ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎక్కడా గెలిచే అవకాశం లేదు

– బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌ రావు జోస్యం
Date:13/11/2018
హైదరాబాద్‌  ముచ్చట్లు:
ఇప్పుడు జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎక్కడా గెలిచే అవకాశం లేదని జోస్యం చెప్పారు.  మహా కూటమి ఓనర్‌ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడని ఎద్దేవా చేశారు. ఈ తెలంగాణ వ్యతిరేక కూటమికి మెజారిటీ సీట్లు వస్తే ముఖ్యమంత్రి ఎవరవుతారో కాంగ్రెస్‌ నేతలు చెప్పగలరా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ జాబితా చూస్తే టీడీపీ అధినేత నారా చంద్రబాబు  నాయుడి ముద్ర స్పష్టంగా కనిపిస్తోందని బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌ రావు వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..
ఇపుడు కాంగ్రెస్‌ జాబితా పరిశీలిస్తే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార రెడ్డి పట్టుకోల్పోయినట్లు తెలుస్తోందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో ప్రతిపక్షంగా పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్‌ విడుదల చేసిన 65 అభ్యర్థులు ప్రజలతో ఉన్న నేతలు కాదని అన్నారు.మెజార్టీ సీట్లు వస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి, లోకేష్‌ హోంమంత్రి అవుతారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీని చంద్రబాబు కబ్జా చేశారని విమర్శించారు.
రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్‌ పార్టీని నేతలు చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు.కర్ణాటకలో కుమార స్వామి మాదిరిగా టీడీపీకి తక్కువ సీట్లు వచ్చినా చంద్రబాబు సీఎం పదవి చేపడతారని, కర్ణాటక మోడల్‌ రాజకీయాన్ని కాంగ్రెస్‌ తెలంగాణలో అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కేంద్రంలో అవినీతి రహిత పాలన కొనసాగిస్తున్న బీజేపీకి ఓటేస్తారా లేక అన్నిరంగాల్లో విఫలమైన టీఆర్‌ఎస్‌కు ఓటేస్తారా లేక తెలంగాణ ఆత్మగౌరవాన్ని టీడీపీకి తాకట్టు పెట్టిన కాంగ్రెస్‌కు ఓటేస్తారా తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు.  మిషన్‌ భగీరథతో నీళ్లు రాకపోతే ఓట్లు అడగనని చెప్పిన కేసీఆర్‌ ఇప్పుడెందుకు ఓట్లు అడుగుతున్నారని సూటిగా ప్రశ్నించారు.
Tags; Congress can not win anywhere in the five states elections

టీఆర్‌ఎస్‌కు బొడిగె శోభ గుడ్‌ బై?

Date:13/11/2018
 కరీంనగర్‌  ముచ్చట్లు:
 సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికి చొప్పదండి స్థానాన్ని తనకు కేటాయించకుండా పెండింగ్‌లో ఉంచడంపై తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. టీఆర్‌ఎస్‌ టికెట్‌ తనకే కేటాయిస్తారనే ఆశతో వేచిచూసిన ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సెప్టెంబర్‌లోనే 105 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.
చొప్పదండితో పాటు మరికొన్ని స్థానాలను పెండింగ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే.. చొప్పదండి సీటు దక్కించుకోవడానికి ఆమె తీవ్రంగా ప్రయత్నించినప్పటికి.. టీఆర్‌ఎస్‌ అధిష్టానం నుంచి ఎటువంటి సానుకూల ప్రకటన వెలువడలేదు.నేడో, రేపో కేసీఆర్‌ చొప్పదండి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ప్రకటించనుండగా.. శోభకు టికెట్‌పై ఎటువంటి హామీ లభించలేదు. దీంతో చొప్పదండి స్థానం నుంచి ఎలాగైన బరిలోకి దిగాలని భావిస్తున్న శోభ..
పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కావడంతో ఆమె తన ప్రయత్నాలను వేగవంతం చేశారు. ఇప్పటికే ఆమె బీజేపీ నాయకులతో సంప్రదింపులు జరిపినట్టుగా వార్తలు వస్తున్నాయి. నిన్న తన అనుచరులతో సమావేశమై పార్టీ మారడంపై చర్చించిన ఆమె ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. బుధవారం ఆమె తన భవిష్యత్‌ కార్యచరణను ప్రకటించే అవకాశం ఉంది.
Tags; Bodige Shobha Good Bye to TRS?

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి అసమ్మతి సెగ

-న్యాయం జరగకపోతే రాజీనామాలు, ఆత్మహత్యలంటూ హెచ్చరించారు
Date: 13/11/2018
హైదరాబాద్‌  ముచ్చట్లు:
అభ్యర్థుల ఖరారు, నామినేషన్ల పర్వం మొదలైన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి అసమ్మతి సెగ తగిలింది. రాష్ట్ర నాయకత్వం డబ్బులు తీసుకుని టిక్కెట్లు అమ్ముకుందని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. తమ నాయకులకు న్యాయం జరగకపోతే రాజీనామాలకు, ఆత్మహత్యలకు వెనుకాడబోమని పార్టీ అధినాయకత్వాన్ని హెచ్చరించారు.
మరోవైపు.. శేరిలింగంపల్లి టికెట్‌ భవ్యా ఆనంద్‌ ప్రసాద్‌కు ఇవ్వడంతో నిరసనలు మిన్నంటాయి. ఆమె స్థానంలో మువ్వా సత్యనారాయణకు టికెట్‌ ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేస్తూ ఓ కార్యకర్త పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.
 ఇదిలా ఉండగా.. యాదవులకు టిక్కెట్లు ఇవ్వలేదనే కారణంతో ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ ముందు ఓయూ యాదవ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అర్థనగ్న ప్రదర్శనలతో నిరసన తెలిపారు. యాదవ, గొల్ల కురుమ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ డబ్బులు తీసుకుని టిక్కెట్లను అగ్రవర్ణాలకు అమ్ముకున్నారని ఆరోపించారు.
Tags: The Telugubai Party is the disagreement of the state office

ప్రదాని మోడీ ని 24 సార్లు కాల్చి చంపాలి: సీసీఐ నారాయణ

Date:13/11/2018
చిత్తూరుముచ్చట్లు:
ఆర్బీఐ, ఎన్నికల కమిషన్‌, సీబీఐ వంటి సంస్థలు ప్రధాని నరేంద్ర మోదీ కబంధ హస్తాల్లో నలిగి పోతున్నాయని సీసీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ అన్నారు. మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా ఎంతో మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. యాభై రోజుల్లో నోట్ల రద్దు ప్రయోజనాలు లేకుంటే తనని కాల్చి చంపాలని మోదీ చెప్పారని, ఈ లెక్కన ఆయనను 24 సార్లు కాల్చి చంపాలంటూ మండిపడ్డారు. నోట్ల రద్దు తర్వాత ఆర్‌బీఐ పరిస్థితి డోలాయమానంలో పడిందన్నారు.
ఎన్డీయే పాలనను అంతం చేసేందుకు దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తామని నారాయణ పేర్కొన్నారు. రఫేల్ కుంభకోణంతో బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకు పోయిందన్నారు. ఎన్నికల కమిషన్ సైతం మోదీ అడుగుజాడల్లో నడుస్తోందని ఆరోపించారు. సీబీఐ ప్రస్తుతం ముక్కలయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గోరక్షణ పేరుతో దళితులపై దాడులు పెరిగిపోయాయని పేర్కొన్నారు.ఇక.. పొత్తుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని ప్రస్తావిస్తూ, ఆయన ఎప్పుడు ఎవరితో కాపురం చేస్తారో తెలియదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని అందరూ ఖండించాలన్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) విచారణ సవ్యంగా సాగడం లేదని, సిట్‌ నివేదికపై తమకు తీవ్ర అభ్యంతరాలున్నాయని నారాయణ చెప్పారు.
Tags; narendra-modi-shot-dead-24-times-cki-narayana

ప్రజా ఫిర్యాదులను సకాలంలోపరిష్కరించాలి:సిఎస్.

Date:13/11/2018
అమరావతి ముచ్చట్లు:
;:ప్రజల నుండి వచ్చిన వివిధ రకాల ఫిర్యాదులను నిర్ధిష్ట గడువు ప్రకారంలో సకాలంలో పరిష్కరించేందుకు అన్ని శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ ఆదేశించారు.ఈమేరకు మంగళవారం అమరావతి సచివాలయంలోని ఆయన కార్యాలయంలో గ్రీవియెన్స్ ఫిర్యాదుల పరిష్కారంపై రియల్ టైమ్ గవర్నెన్స్(ఆర్టీజీ)సిఇఓ బాబు ఎ తదితరులతో సిఎస్ సమీక్షించారు.
ఈసందర్భంగా సిఎస్ పునేఠ మాట్లాడుతూ ఆర్ధికేతరపరమైన ఫిర్యాదులు, విజ్ణాపనలను నిర్ధిష్ట గడువులోగా సకాలంలో పరిష్కరించాలని స్పష్టం చేశారు.ఆర్ధికపరమైన అంశానికి సంబంధించిన విజ్ణాపనలను మాత్రం అందుబాటులో ఉన్న నిధులకు అనుగుణంగా వాటిని పరిష్కరించాలని అన్నారు.ఒకవేళ పరిష్కరించేందుకు అర్హతకలిగి ఉన్నా నిధులు అందుబాటులోలేక పెండింగ్ లో ఉన్న విజ్ణాపనలను వచ్చే వార్షిక కార్యాచరణ ప్రణాళిక లేదా కొత్తగా బడ్జెట్ నిధులు మంజూరు .
అయ్యాక పరిష్కరించడంలో ఈవిధంగా పెండింగ్ లో ఉన్నవాటికి ప్రాధాన్యతను ఇచ్చి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్ పునేఠ స్పష్టం చేశారు.ఇకమీదట ప్రతి మంగళవారం సాయంత్రం ఫిర్యాదుల పరిష్కారం విషయమైన అందరు జిల్లా కలక్టర్లు,సంబంధితశాఖల జిల్లా అధికారులు ఆయా శాఖాధిపతులతో వీడియో సమావేశం నిర్వహించనున్నట్టు సిఎస్ పునేఠ పేర్కొన్నారు.జిల్లా స్థాయిలో పెండింగ్ లో ఉన్న వివిధ ఫిర్యాదులు,విజ్ణాపనలు సకాలంలో పరిష్కరించేలా చర్యలు చేపట్టాల్సిందిగా జిల్లా కలక్టర్లకు డిఒ లేఖ వ్రాయాలని ఆర్టీజి సిఇఓ బాబును ఆయన ఆదేశించారు.
ముఖ్యంగా రెవెన్యూ,హోం,సాంఘిక,గిరిజన,బిసి సంక్షేమం,మీ-సేవ, ఐటి,వ్యవసాయం తదితర శాఖలకు సంబంధించిన కార్యక్రమాలు,పధకాలు అమలులో ప్రజల్లో సంతృప్తి స్థాయి తక్కువగా ఉన్న శాఖాధిపతులు,కలక్టర్లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించి ప్రగతిని మెరుగుపడేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.ఆతదుపరి మిగతా విభాగాలపై రాబోవు రోజుల్లో దృష్టి సారించడం జరుగుతుందని చెప్పారు.ఆర్ధికేతర విజ్ణాపనలు,ఫిర్యాదులు పెండింగ్ నకు సంబంధించి చిత్తూర్ జిల్లాలో అత్యధికంగా 30వేల 973,తూర్పు గోదావరి జిల్లాలో 24వేల 766,గుంటూర్ జిల్లాలో 23వేల 17 పెండింగ్ లో ఉండగా ఆయా కలక్టర్లతో సిఎస్ పునేఠ టెలిఫోన్ ద్వారా మాట్లాడి పెండింగ్ ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈసమావేశంలో రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజి)సిఇఓ బాబు ఎ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ కైజాలా యాప్ ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించేందుకు,ప్రజా స్పందనను తెల్సుకునేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉందని దీనిని రెవెన్యూ,పౌరసరఫరాలు,ఎక్సైజ్ వంటి కొన్ని శాఖలే పూర్తిగా వినియోగించుకుంటున్నాయని అన్ని శాఖలు ఈకైజా యాప్ ను వినియోగించేలా ఆదేశాలు జారీ చేయాలని సిఎస్ ను కోరారు.
ఈయాప్ తోపాటు మీకోసం ప్రజావేదిక,ఐవిఆర్ఎస్ తదితర విధానాల ద్వారా ప్రజల నుండి వచ్చిన విజ్ణాపనలు, ఫిర్యాదులను ఆయా శాఖలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజల నుండి మొత్తం కోటి 86లక్షల వివిధ రకాల ఫిర్యాదులు,విజ్ణప్తులు రాగా వాటిలో ఇప్పటికే 72లక్షలకు పైగా ఫిర్యాదులు,విజ్ణాపనలను పరిష్కరించడం జరిగిందని తెలిపారు.
.బడ్జెత్ తో సంబంధం లేకుండా ఉన్న ఆర్ధికేతరపరమైన విజ్ణప్తులను సకాలంలో పరిష్కరించాల్సిన అవసరం ఉందని అందుకనుగుణంగా ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈవిధమైన ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం ప్రజా సాధికార సర్వే ద్వారా వచ్చినవేనని చెప్పారు.
Tags; Public Complaints To be Timed:

బీసీలకు ఒరిగింది ఎమీ లేదు

Date:13/11/2018
విజయవాడ ముచ్చట్లు:
ఆదరణ పధకంతో ఏదో చేసేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. బిసి వర్గాలకు చంద్రబాబు ప్రభుత్వం చేసిందేమి లేదు. టిడిపి కార్యకర్తలకే ఆదరణ పనిముట్లు ఇస్తున్నారని వైకాపా నేత మోపిదేవి వెంకటరమణ ఆరోపించారు. ఆదరణ పధకం కన్నా పబ్లిసిటి ఖర్చు అధికంగా ఉంది. విశాఖలో మత్స్యకారులను అవమానించారు.
సెక్రటేరియట్ లో నాయిబ్రాహ్మణులను అవమానించారు. ఫీజు రీయంబర్స్ మెంట్ పధకాన్ని నాశనం చేశారని అయన విమర్శించారు. -వైయస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయంబర్స్ మెంట్ వల్ల ఎందరో బిసి ల కుటుంబాలు బాగుపడ్డాయి. ఎన్నికలకు ముందు చంద్రబాబు మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారు. ఎన్నికలు వస్తున్నాయని  మైనారిటిలకు,గిరిజనులకు మంత్రివర్గంలో స్దానం కల్పించారని అన్నారు.
బిసిలలో ఉన్న కొన్ని వర్గాలను ఎస్టీలలో ఎస్సీలలో చేరుస్తానని హామి  ఇచ్చారు. మరికొన్ని వర్గాలను బిసిలలో చేరుస్తామని చెప్పారు. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు సిద్దహస్తుడు. -చంద్రబాబు పధకాల వల్ల బాగుపడ్డ బిసి కుటుంబాలను చూపించగలరా అని ప్రశ్నించారు. ఎన్నికలు వస్తున్నాయని  ఇలాగే ఆదరణ అని బిసిలను మోసం చేశారు.
Tags: There is nothing to begging for BCs

కాంగ్రెస్ పార్టీ తీరు పట్ల  పొన్నాల అసంతృప్తి

-జనగామ నుంచి పోటీ చేసే విషయంపై ఇప్పుడే ఏమీ మాట్లాడలేను:కోదండరాం
Date:13/11/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
కాంగ్రెస్‌ పార్టీ తీరు పట్ల మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత  పొన్నాల లక్ష్మయ్య అసంతృప్తి వ్యక్తం చేసారు. మూడున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతూ ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తనకు తొలి జాబితాలో టిక్కెట్‌ కేటాయించకపోవడం ఆశ్చర్యం కలిగించిందని పొన్నాల అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తీరు పట్ల అసంతృప్తితో ఉన్న పొన్నాల.. పార్టీ పెద్దలను కలిసేందుకు మంగళవారం దిల్లీ వచ్చారు.
పార్టీకి తాను చేసిన సేవలను వారికి గుర్తుచేస్తూ జనగామ టిక్కెట్‌ను తనకే కేటాయించాలని కోరుతున్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… జనగామ టిక్కెట్‌ను తెలంగాణ జన సమితికి కేటాయిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. తెజస కూడా ఆ టిక్కెట్‌ కోరుతున్నట్లు ఎక్కడా సమాచారం లేదని.. కోదండరామ్‌ ఎక్కడా దాని గురించి మాట్లాడటం లేదన్నారు. సీట్ల సర్దుబాటులో భాగంగా కొన్ని సీట్లను కాంగ్రెస్‌ పార్టీ వదులుకోవాల్సి వస్తోందన్నారు. రెండో జాబితాలో తనకు టిక్కెట్‌ కచ్చితంగా వస్తుందని పొన్నాల ధీమా వ్యక్తం చేశారు.
సీట్ల కేటాయింపులో అన్ని వర్గాలకు న్యాయం చేయకపోతే ప్రత్యర్థికి మననే ఆయుధం అందించినట్లు అవుతుందని పొన్నాల అన్నారు.కాగా జనగామ స్థానం నుంచి తాను పోటీ చేసే విషయంపై ఇప్పుడే ఏమీ మాట్లాడలేనని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. మహాకూటమితో పొత్తులో భాగంగా తెజసకు 11 సీట్లు ఇవ్వాలని తాము కాంగ్రెస్‌ను అడుగుతున్నట్టు చెప్పారు. ఇప్పటికైతే తెజసకు ఆరు స్థానాలపై మాత్రమే స్పష్టత ఉందన్నారు.
మరికొన్ని స్థానాలపై పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు. తాము పోటీచేసే అన్ని స్థానాలపై స్పష్టత వచ్చాక వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. మల్కాజ్‌గిరి, మెదక్‌, దుబ్బాక, సిద్దిపేట, వర్థన్నపేట, అంబర్‌పేట స్థానాలపై తమకు స్పష్టత వచ్చిందని వివరించారు. ఒక ఎస్సీ, ఒక ఎస్టీ సీటు కేటాయించాలని కాంగ్రెస్‌ను కోరుతున్నట్టు తెలిపారు. ఊహాగానాల ఆధారంగా మాట్లాడటం సమంజసంకాదన్నారు.
Tags; The Congress Party’s disgrace on the pattern of disgrace

హైద‌రాబాద్‌లో ఎన్నికల నియ‌మావ‌ళి అమ‌లుకు 120 బృందాలు – దాన‌కిషోర్

Date:13/11/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
హైద‌రాబాద్ జిల్లాలో ఎన్నికల ప్ర‌వ‌ర్తన నియ‌మావ‌ళిని ప‌టిష్టంగా అమ‌లు చేయడంతో పాటు ధన ప్ర‌వాహాన్ని అడ్డుకునేందుకు 120 వివిధ ర‌కాల ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటు చేసిన‌ట్టు హైద‌రాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్ వెల్ల‌డించారు. శాసన సభ ఎన్నిక‌ల‌కు గాను కేంద్ర ఎన్నికల సంఘం హైద‌రాబాద్ జిల్లాకు 8మందిని ఎన్నికల వ్యయ ప‌రిశీల‌కులుగా నియ‌మించింది. ఈ కేంద్ర ఎన్నికల వ్యయ ప‌రిశీల‌కుల‌తో మంగళవారం  సాయంత్రం నిర్వ‌హించిన స‌మావేశంలో దాన‌కిషోర్ పాల్గొన్నారు.
ఈ సంద‌ర్భంగా దాన‌కిషోర్ మాట్లాడుతూ హైద‌రాబాద్ జిల్లాలోని 15 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి మూడు వీడియో స‌ర్వేలెన్స్ టీమ్ లు, మూడు ఫ్ల‌యింగ్ స్క్వాడ్ లు, ఒకొక్క అకౌంటింగ్ టీమ్, వీడియో వ్యూయింగ్ టీమ్ ల‌ను ప్ర‌త్యేకంగా నియ‌మించామ‌ని వివ‌రించారు. వీటికితోడు కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌వేశ‌పెట్టిన సి-విజిల్ ద్వారా కూడా ఎన్నికల ఉల్లంఘ‌నల‌పై  ఫిర్యాదుల‌ను స్వీక‌రిస్తున్నామ‌ని  వివ‌రించారు. ఎన్నికల ప్రకటన వెలు‌వ‌డిన వెంట‌నే ఈ బృందాల‌ను నియ‌మించామ‌ని తెలియ‌జేశారు.
నియ‌మావ‌ళి అమ‌లుకు ఏర్పాటుచేసిన ఈ ప్ర‌త్యేక బృందాల‌న్నింటికి ప్ర‌త్యేక శిక్ష‌ణ‌ను ఇచ్చామ‌ని తెలిపారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి గ‌ణాంకాల్లో సుశిక్షితులైన గ్రూపు-బి స్థాయి అధికారిని అసిస్టెంట్ ఎక్స్ పెండేచ‌ర్ అబ్జ‌ర్‌వ‌ర్ లుగా నియ‌మించామ‌ని తెలిపారు. వివిధ పార్టీలు, పోటీ చేసే అభ్య‌ర్థులు నిర్వ‌హించే ర్యాలీలు, స‌భ‌లు స‌మావేశాలన్నింటిని వీడియో స‌ర్వేలెన్స్  టీమ్ లు పూర్తిగా వీడియోగ్ర‌ఫీ చేస్తాయ‌ని పేర్కొన్నారు. వివిధ బృందాలు తీసిన వీడియో సీడీల‌ను వీడియో వ్యూయింగ్ బృందాలు పూర్తిస్థాయిలో ప‌రిశీలించి త‌గు చ‌ర్య‌లు ప్ర‌తిపాదిస్తాయ‌ని తెలిపారు.
సి-విజిల్ ద్వారా ఫిర్యాదులు స్వీక‌రించేందుకు 24గంటల పాటు మూడు షిఫ్ట్ లుగా ప్‌‌త్యేక సిబ్బందిని ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు సి-విజిల్ ద్వారా 79 ఫిర్యాదులు అంద‌గా వీటిలో 44 ప‌రిష్క‌రించామ‌ని, 24 డ్రాప్ చేయగా ఐదింటికి స‌మాధానాలు పంపామ‌ని, మ‌రో ఐదు పురోగ‌తిలో ఉన్నాయ‌ని వివ‌రించారు. ఇప్ప‌టి వ‌ర‌కు హైద‌రాబాద్ జిల్లాలో రూ. 17.44 కోట్లను స్వాదీన‌ప‌ర్చుకున్నామ‌ని, రూ. 11.50 ల‌క్షల విలువైన వెండిని, రూ. 72.51ల‌క్షల విలువైన ఇతర వ‌స్తువుల‌ను స్వాదీన‌ప‌ర్చుకున్నామ‌ని తెలిపారు.
ఎన్నికల ప్ర‌వ‌ర్తన నియ‌మావ‌ళిని అతిక్ర‌మించిన 34మందిపై కేసులు న‌మోదు చేశామ‌ని తెలిపారు. కాగా హైద‌రాబాద్ జిల్లాలో ఎన్నికల ప్ర‌వ‌ర్తన నియ‌మావ‌ళి అమ‌లుకు జిల్లా ఎన్నికల అధికారి చేసిన ఏర్పాట్ల‌పై కేంద్ర ఎన్నికల వ్యయ ప‌రిశీల‌కులు సంతృప్తి వ్య‌క్తం చేశారు.
ఈ స‌మావేశంలో కేంద్ర ఎన్నికల వ్యయ ప‌రిశీల‌కులు విన‌య్ కుమార్, కె.పి.జ‌యేక‌ర్, అప్పు జోష‌ఫ్ జోసె, బ‌ల్ బీర్ సింగ్, మ‌నీష్ కె జైస్వ‌ల్, శ్రీ‌ధ‌ర్ భ‌ట్ట‌చార్య, బిజు థామ‌స్, మ‌నిగంద ‌స‌మి, నగర పోలీస్ అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ డి.ఎస్.చౌహాన్, జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ కెన‌డి, విజిలెన్స్ డైరెక్ట‌ర్ విశ్వ‌జిత్ కంపాటి, నోడ‌ల్ అధికారులు పాల్గొన్నారు.
Tags; 120 teams for implementation of electoral code in Hyderabad – Danakishor