’’అమ్మ’’ చాటున సాధించిన డిఎస్పీ ఉద్యోగం – జన్మభూమిని వదలను – తప్పుచేస్తే క్షమించను – పలమనేరు డిఎస్పీ చౌడేశ్వరి మనోగతం

పలమనేరు ముచ్చట్లు

గ్రామీణ పేదరికంలో జీవిస్తూ తండ్రి ఆకాల మరణాన్ని తట్టుకోలేక పోయినా రెండేళ్ళ పసి హృదయం వెనక్కి తగ్గలేదు. ’’అమ్మ’’ చాటున పట్టుపదలతో చదువుపై దృష్టి సారించింది. తీరిక వేళల్లో అమ్మకు అండగా వ్యవసాయ పనులు చేసుకుంటు , పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు శ్రీకారం చుట్టి, అంచలంచలుగా ఎదిగి 2010లో జరిగిన గ్రూప్‌ -1 పరీక్షలో డిస్పీగా ఎంపికై, పలమనేరు సబ్‌డివిజనల్‌ ఆఫీసర్‌గా తొలిసారిగా కె.చౌడేశ్వరిని ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా ఆమె తెలుగుముచ్చట్లతో తన మనోగతాన్ని పంచుకున్నారు.

కుటుంబ నేపధ్యం…

గుంటూరు జిల్లా, తక్కెలపాడు అనే చిన్నగ్రామంలో శేషగిరిరావు, శేషారత్నంల దంపతులకు చౌడేశ్వరి ఏకైక కుమార్తె, ఈమె ఏడవతరగతి నుంచి గుంటూరు గురుకుల పాఠశాలలో చదివి ప్రతిభ కనపరచింది. బికాం చదివారు. ఇలా ఉండగా తన సమీప బంధువైన సతీష్‌ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం సతీష్‌ హైదరాబాద్‌లో ఉద్యోగరీత్యా ఉన్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సాయివినీత్‌ ఇంజనీరింగ్‌ చదువుతుండగా, కుమార్తె నందిత ఇంటర్మీడియట్‌ చదువుతోంది.

పోలీస్‌ ఉద్యోగం కావాలని…..

పోలీస్‌ ఆఫీసర్‌గా ఉండాలన్న ఆలోచనతో వచ్చాను. ఆర్డీవో ఉద్యోగం వచ్చినా వెళ్లలేదు. అలాగే ఎంపీడీవో ఉద్యోగంతో పాటు గత వారం సబ్‌రిజిస్ట్రార్‌ ఉద్యోగం కూడ వచ్చింది. పోలీస్‌ ఆఫీసర్‌గా పేద ప్రజలకు న్యాయం అందించేందుకే పోలీస్‌ ఉద్యోగాన్ని ఎంపిక చేసుకున్నానని డిఎస్పీ చౌడేశ్వరి స్పష్టం చేశారు.

జన్మభూమిపై మమకారం ….

గుంటూరు జిల్లా తక్కెలపాడు గ్రామంలో తమకున్న పది ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తున్నాం. పదవి విరమణ తరువాత తక్కెలపాడు గ్రామానికి వెళ్తా, అక్కడ వ్యవసాయం చేసుకుంటు గ్రామీణ వాతావరణంలో కలసి జీవించాలని నిర్ణయించుకున్నా.

కష్టాన్ని ఇష్టంతో పూర్తి చేయండి ….

ప్రతి ఒక్కరికి కష్టాలు ఎదురౌతాయి. వాటికి బెదిరిపోకండి . కష్టాన్ని ఇష్టంగా మార్చుకుని, ప్రతి పనిని పట్టుదలతో సాధించేందుకు కృషి చేయండి. విజయం వరిస్తుంది. కష్టం 90 శాతం, అదృష్టం 10 శాతమే. ఇందుకు నా జీవితమే నిదర్శనమె అంటున్నారు ఆమె. విది నిర్వహణలో అన్యాయాలను , అక్రమాలను క్షమించేది లేదన్నారు. సమాజంలో అందరు బాగుండాలన్నదే తమ అభిమతమన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *