ఆగమోక్తం.. కేదారగౌరీ వ్రతం

శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురువారం దీపావళిని పురస్కరించుకుని కేదారగౌరీ వ్రతాన్ని అత్యంత ఘనంగాను, ఆగమోక్తంగాను జరిపారు. ఏటా దీపావళి పర్వదినాన ఈ విశేష పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సౌభాగ్యాన్ని పదిలం చేయడంతో పాటు ఐశ్యర్యాన్ని వృద్ధి చేసేందుకు మహిళలు ఈ విశేష వ్రతాన్ని నోచుకుంటూ ఉంటారు. ఈ విశేష ఉత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ముక్కంటి ఆలయంలోని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన శాంతి మండపంలో ఈ పూజాది కార్యక్రమాలు ఆగమోక్తంగా జరిపారు. వేకువజామునే ఈ వ్రతపూజల్లో పాల్గొనేందుకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అలంకార మండపం నుంచి శ్రీకేదారగౌరీ అమ్మవారికి విశేష అలంకరణలు చేపట్టి.. వేదపండితుల మంత్రోచ్చారణలతో ఉత్సవమూర్తిని అంగరంగ వైభవంగా వూరేగింపుగా శాంతి మండపానికి తీసుకువచ్చారు. అనంతరం కేదారగౌరీ వ్రతాన్ని శాస్త్రòక్తంగా జరిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ఈ పూజల్లో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయం తరఫున దాదాపు ఐదు వేల వరకు టిక్కెట్లును విక్రయించారు. ఈ దఫా ఎలాంటి తోపులాటలు, తొక్కిసలాటలు లేకుండా కేదార గౌరీ వ్రతాన్ని విశేష రీతిలో జరిపారు. పూజలు చేయించుకున్న తరవాత భక్తులకు ఆలయం తరఫున వాయినాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో భ్రమరాంబ, దీక్షాగురుకుల్‌ వరదగురుకుల్‌, ప్రధాన అర్చకులు సంబంధం, కర్ణా గురుకుల్‌తో పాటు ఆలయ ఈఈ వెంకటనారాయణ, ఏఈవోలు ఎన్‌.ఆర్‌.కృష్ణారెడ్డి, చిట్టెమ్మ, మోహన్‌, సూపరింటెండెంట్‌ హేమమాలినితో పాటు పలువురు అధికారులు, అధికారేతరులు పాల్గొన్నారు. ఈ పూజల కారణంగా ఆలయంలో రద్దీ నెలకొంది. భక్తుల సౌకర్యార్థం స్వామి, అమ్మవార్ల ఆలయాల్లో లఘు దర్శనం అమలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *