ఆసియా కప్‌ హాకీ విజేత భారత్‌

ఆసియాకప్‌ హాకీలో భారత్‌ చరిత్ర సృష్టించింది. ఫైనల్‌లో మలేసియాపై 2-1 గోల్స్‌ తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత్‌ మూడోసారి ఆసియాకప్‌ను కైవసం చేసుకుంది. సూపర్‌ 4లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 4-0 తేడాతో చిత్తు చేసిన భారత్‌.. ఫైనల్లోనూ అదే జోరు కనబరిచింది. ఈ టోర్నీలో పాక్‌పై భారత్‌ రెండు సార్లు విజయం సాధించింది.

ఢాకాలో జరిగిన ఫైనల్‌లో భారత్‌ ఆది నుంచీ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మూడో నిమిషంలోనే రమణ్‌దీప్‌సింగ్‌ భారత్‌కు తొలి గోల్‌ను అందించాడు. 29వ నిమిషంలో లలిత్‌ ఉపాధ్యయ్‌ మరో గోల్‌ను సాధించి భారత శిబిరంలో ఆనందాన్ని నింపాడు. చివరి క్వార్టర్‌లో మలేసియా పుంజుకున్నప్పటికీ.. భారత్‌ ఆధిపత్యం కొనసాగింది. లీగ్‌ మ్యాచ్‌లో కూడా మలేసియా భారత్‌పై 2-6 తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. భారత్‌ ఆసియాకప్‌ ఫైనల్‌ చేరడం ఇది ఏడోసారి. ఆసియా కప్‌ గెలుచుకోవడం మూడోసారి. పాక్‌పై ఈ ఏడాదిలో భారత్‌ నాలుగుసార్లు గెలవగా.. ఈ టోర్నీలో రెండు సార్లు మట్టికరిపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *