ఈ గుండె 1300 కిలోమీటర్లు పయనించింది!

ముంబాయి ముచ్చట్లు:

అయవదానంపై పలు స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో అవగాహన పెంచుతుండడంతో దాని ఆవశ్యకతను ఇప్పుడిప్పుడే అందరూ తెలుసుకుంటున్నారు. తాజాగా ముంబయిలో బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి గుండెను ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 1300 కిలోమీటర్ల దూరంలోని ఓ వ్యక్తికి అమర్చి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. ఇందుకు ఎయిర్‌పోర్ట్‌ అధికారులు, ట్రాఫిక్‌ సిబ్బంది, వైద్యులు ఎంతో సహకారం అందించారు.నవీ ముంబయి చెందిన చేతన్‌ టేలర్‌ ఓ చిరు వ్యాపారి. తీవ్ర అస్వస్థతతో 20 రోజుల కిందట అపోలో ఆస్పత్రిలో చేరాడు. ఆయన మెదడులో రక్తస్రావం అవుతున్నట్లు వైద్యులు గుర్తించారు.దాన్ని ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు వైద్యులు అతని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆస్పత్రికి చెందిన వైద్యుడు అవయవదానం గురించి చేతన్‌ భార్య, కుమారుడికి అవగాహన కల్పించడంతో వారు చేతన్‌ గుండెను దానం చేసేందుకు ముందుకొచ్చారు. ‘కేవలం చేతన్‌ గుండె మాత్రమే వేరొకరికి అమర్చేందుకు వీలుంది. మిగిలిన అవయవాలు ఎవరికీ సరిపోలేదు’ అని అపోలో ఆస్పత్రి మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రసాద్‌ ముగలికర్‌ తెలిపారు.అయితే, ఆస్పత్రిలో 26మంది గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రోగులు ఉన్నా, వారెవరికీ చేతన్‌ గుండె సరిపోలేదు. దీంతో రంగంలోకి దిగిన నేషనల్‌ ఆర్గాన్‌ అండ్‌ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్‌ ఆర్గనైజేషన్‌(ఎన్‌వోటీటీవో) వేరెవరికైనా ఈ గుండె సరిపోతుందేమోనని ఆరా తీసింది. చెన్నైలోని నివసిస్తున్న లెబనాన్‌కు చెందిన 61 ఏళ్ల వ్యాపారవేత్తకు అది సరిపోతుందని తెలీడంతో నవీ ముంబయి నుంచి గుండెను చెన్నైకు తరలించారు.గుండెను తరలించే క్రమంలో అధికారులు ఎక్కడిక్కడ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంతో ఆస్పత్రి నుంచి కేవలం 40 నిమిషాల్లో గుండెను ముంబయి ఎయిర్‌పోర్ట్‌కు చేర్చారు. చార్టెడ్‌ విమానంలో అక్కడి నుంచి కేవలం నాలుగు గంటల్లో చెన్నైలోని ఫోర్టిస్‌ ఆస్పత్రికి తీసుకొచ్చి విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *