ఎన్‌డీఎంఏపై చెక్కుచెదరని ‘విశ్వ’సనీయత

జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎంఏ)కు ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయత ఉందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ఎన్‌డీఎంఏ 13వ వ్యవస్థాపక దిన్సోతవం సందర్భంగా గురువారం పాఠశాలల భద్రతపై నిర్వహించిన కార్యశాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… గతంలో విపత్తు నిర్వహణకు సంస్థాగత ప్రణాళికలు లేవని, ఎన్‌డీఎంఏ ఏర్పాటు తర్వాత విపత్తుల నిర్వహణతోపాటు, వాటిని ఎదుర్కొనే ముందస్తు చర్యల యంత్రాంగమూ రూపొందిందన్నారు. ‘సురక్షిత భారత్‌’ కలలు నెరవేర్చడానికి ఎన్‌డీఎంఏ నిత్యం సంసిద్ధంగా ఉంటుందన్నారు. ‘పడవల భద్రత, సాంస్కృతిక, వారసత్వ కట్టడాలు, ప్రాంగణాల్లో ఎన్‌డీఎంఏ నిర్వహణ మార్గదర్శకాలు’, ‘తమిళనాడు వరదలు: నేర్చుకున్న పాఠాలు, ఉత్తమ పద్ధతులు’ అనే రెండు పుస్తకాలను మంత్రి ఆవిష్కరించారు. గతంలో పాఠశాలల్లో జరిగిన ప్రమాదాలు, పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నివారణ మార్గాలు, బడుల్లో ఉండాల్సిన అత్యవసర పరికరాలు, ప్రథమ చికిత్స, అగ్ని ప్రమాదాలపై చర్చించారు. ఎన్‌డీఎంఏ మాజీ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి, పలు రాష్ట్రాల్లోని డీఈవోలు, సీబీఎస్‌ఈ, నవోదయ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులతో పాటు… తెలంగాణలోని కామారెడ్డి, రంగారెడ్డి, వనపర్తి జిల్లాల డీఈవోలు మదన్‌మోహన్‌, సుశీందర్‌రావు, కె.సత్యనారాయణరెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు టి.ఆనందరావు, కె.గంగాకిషన్‌, వి.కాస్నానాయక్‌, జి.విశ్వనాథం గుప్తా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *