tirumala

ఘనంగా స్వర్ణ ఛత్రోత్సవం

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆనవాయితీగా నిర్వహించే బంగారు గొడుగు ఉత్సవం శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగింది. శనివారం సూర్యోదయాన జరిగే రథోత్సవానికి ముఖ్య ఆకర్షణగా నిలిచే స్వర్ణ ఛత్రానికి కల్యాణకట్టలో ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. అనాదిగా వస్తున్న సంప్రదాయం మేరకు ఉత్సవానికి ముందురోజు సాయంత్రం శ్రీవారి కల్యాణకట్ట సిబ్బంది ఆధ్వర్యంలో నూతన ఛత్రస్థాపన జరుగుతుంది. చారిత్రక నేపథ్యంలో శ్రీకృష్ణదేవరాయులు కాలంలో చంద్రగిరిరాజు శ్రీనివాస మహదేవరాయలు చేసిన ధర్మశాసనం ప్రకారం పంతులుగారి వంశస్థులు ఈ హక్కును కొన్ని శతాబ్దాలుగా అనుసరిస్తున్నారు. తొలిరోజుల్లో కొయ్య గొడుగుతో ప్రారంభమై.. 1952 నుంచి రథానికి బంగారు గొడుగు సమర్పణగా మారింది. పంతులుగారి ప్రస్తుత వంశీకుడైన పంతులుగారి రామనాథన్‌ ఆధ్వర్యంలో కల్యాణకట్ట క్షురకులు, సిబ్బంది కలిసి ఈ క్రతువు నిర్వహించారు. ఈ పూజా క్రతువులో తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జేఈవో శ్రీనివాసరాజు, సీవీఎస్‌వో రవికృష్ణ, కల్యాణకట్టకట్ట డిప్యూటీ ఈవో వెంకటయ్య పాల్గొన్నారు. ఛత్రానికి పూజ అనంతరం బంగారు గొడుగును వూరేగింపుగా తీసుకువచ్చి రథానికి అమర్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *