జగన్ వైపు జయప్రద అడుగులు

ఉత్తరాది రాజకీయాల నుంచి దాదాపు నిష్క్రమించారు నటీమణి జయప్రద. యూపీ నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున గతంలో ఎంపీగా పనిచేసిన జయప్రద తన సన్నిహితుడు అమర్ సింగ్ తో పాటు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత అమర్ స్థాపించిన పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం యూపీ రాజకీయాల్లో అమర్ సింగ్ ను పట్టించుకునే నాథుడు లేడు. ఇలాంటి నేపథ్యంలో జయప్రద కూడా యూపీ రాజకీయ ఊసులో లేకుండా పోయారు. ఇలాంటి నేపథ్యంలో గత కొన్నాళ్లుగా సొంత రాష్ట్ర రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.జయప్రద గతంలో తెలుగుదేశం పార్టీలో పని చేశారు. ఆ పార్టీ తరఫున ఎంపీ కూడా అయ్యారు. అయితే అటుపై యూపీ రాజకీయాల్లోకి వలస వెళ్లిపోయారు. ఇప్పుడు ఆమె తిరిగి తెలుగు రాజకీయాల్లో బిజీ కావాలని అనుకున్నారట. అందుకు తగ్గట్టుగా ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. గతంలో టీడీపీలో పని చేసినా, ఒకదశలో టీడీపీ అధినేత చంద్రబాబుపై జయప్రద పలు ఆరోపణలు చేశారు. చంద్రబాబు తనను రాజకీయంగా వాడుకుని వదిలేశారు.. అని కూడా ఆమె వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు మనుషులను వాడుకుని వదిలేయడం బాగా అలవాటు అని అప్పట్లో జయప్రద వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆమెను తెలుగుదేశం పార్టీ తిరిగి చేర్చుకునే అవకాశాలు ఉండకపోవచ్చు.దీంతో ఏపీ రాజకీయాల్లో బిజీ కావాలనుకుంటే.. జయప్రదకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేదా జనసేన వంటి మార్గాలున్నాయి. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో జయప్రదకు సంప్రదింపులు జరుగుతున్నాయని.. ఆమె త్వరలోనే వైకాపా తీర్థం పుచ్చుకోవచ్చని వార్తలు వస్తున్నాయి. రోజా రూపంలో ఇప్పటికే ఒక సినీ నటి పార్టీలో ఉన్నప్పటికీ.. మరింత సినీ గ్లామర్ కోసం వైకాపా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో జయప్రదను ఆ పార్టీ చేర్చుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *