టిప్పు సుల్తాన్‌పై రాష్ట్రపతి సంచలన ప్రసంగం

న్యూఢిల్లీ ముచ్చట్లు:

మైసూర్ పాలకుడుటిప్పు సుల్తాన్ గొప్ప యుద్ధ వీరుడని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. విధాన సౌధ 60వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం కర్నాటక అసెంబ్లీ, శాసనమండలి సంయుక్త సమావేశంలో ఆయన ప్రసంగించారు. ”బ్రిటిష్ పాలకులపై పోరాడుతూ టిప్పు సుల్తాన్ వీరమరణం పొందారు. యుద్ధంలో మైసూర్ రాకెట్లకు ఆయనే నాంది పలికారు..” అని కొనియాడారు. రాష్ట్రంలోని జీవన వైవిధ్యంపై ఆయన మాట్లాడుతూ.. ”పురాతన జైనులకు, బౌద్ధ సంప్రదాయాలకు ఈ నేల ప్రసిద్ధి చెందింది. ఆదిశంకరాచార్యుడు ఇక్కడే శృంగేరి మఠాన్ని నెలకొల్పాడు. గుల్బర్గా ప్రాంతం సూఫీ సంస్కృతికి కేంద్రంగా విలసిల్లింది.కర్నాటకలోనే బసవాచార్య నేతృత్వంలో లింగాయత్ ఉద్యమం పురుడుపోసుకుంది..” అని ఆయన పేర్కొన్నారు.ఘనమైన ఆథ్యాత్మిక చరిత్రతో పాటు శాస్త్ర, సాంకేతిక రంగాలకు, వ్యవసాయానికి కర్నాటక ప్రసిద్ధి చెందిందన్నారు. భారత సైన్యానికి సైతం కర్నాటక అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. ”మన సైన్యంలోని ఇద్దరు చీఫ్‌లు ఫీల్డ్ మార్షల్ కేఎమ్ కరియప్ప, జనరల్ కేఎస్ తిమ్మయ్య కర్నాటక బిడ్డలే..”అని రాష్ట్రపతి కోవింద్ గుర్తుచేశారు. టిప్పు సుల్తాన్‌ నిరంకుశుడంటూ బీజేపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన ప్రసంగంలో స్పష్టమైన వైఖరిని వెల్లడించడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *