న్యాయవిజ్ఞాన సదస్సుల ద్వారా చైతన్యవంతులుకండి – న్యాయమూర్తి రాధమ్మ పిలుపు

పెద్దపంజాణి ముచ్చట్లు

రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న న్యాయవిజ్ఞాన సదస్సులకు ప్రజలు హాజరై చైతన్యవంతులుకావాలెనని సీనియర్‌ సివిల్‌జడ్జి రాధమ్మ పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని పెద్దపంజాణి మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా సీనియర్‌ సివిల్‌జడ్జి రాధమ్మ, అడిషినల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి వెంకట్రమణారెడ్డి హజరైయ్యారు. ఈ సభలో జడ్జి రాధమ్మ మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు లోక్‌అదాలత్‌ను ప్రతి శనివారం నిర్వహించడం జరుగుతోందన్నారు. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించి, ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకే లోక్‌అదాలత్‌ను నిర్వహించడం జరుగుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చట్టం, న్యాయం పట్ల అవగాహన లేకపోవడంతో గ్రామీణప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. ప్రజలకు హక్కులతో పాటు బాధ్యతలను గూర్చి వివరించి, అన్ని విధాలుగా చైతన్యవంతులను చేసేందుకే న్యాయవిజ్ఞాన సదస్సులు నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ సదస్సులకు అన్ని శాఖల అధికారులు హాజరౌతున్నారని తెలిపారు. ఇలాంటి సదస్సులకు ప్రజలు హాజరై కేసుల దాఖలు, సమస్యలు ఎదురైనప్పుడు పరిష్కరించుకునే విధానాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు న్యాయాధికారులు గ్రామ ప్రాంతాలకు వెళ్లి సమావేశాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ సమావేశంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు రెడ్డెప్ప, కార్యదర్శి సి.మల్లిఖార్జునరెడ్డి, ఎంపీడీవో వెంకటరత్నం, డీటీ భాస్కర్‌, న్యాయవాదులు ప్రశాంతి, రెడ్డెప్ప, ఎస్‌ఐ రాజశేఖర్‌, రైట్స్ సంస్థ ఆర్గనైజర్‌ సుబ్రమణ్యం, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *