పరిశుభ్రతలో అగ్రగామి

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా అరుదైన ఘనతను సాధించింది. పరిశుభ్రత, బహిరంగ మల విసర్జన రహిత, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పరంగా ఈ జిల్లా స్వచ్ఛభారత్‌ ర్యాంకింగ్స్‌లో మొదటిస్థానాన్ని దక్కించుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు, పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ, నదియా, ఛత్తీస్‌గఢ్‌లోని దంతేరి, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లాలు కూడా మొదటి ర్యాంకు దక్కించుకున్న వాటిలో ఉన్నాయి. ఆదివారం ఈ జాబితాను కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు జిల్లా అధికారులకు అధికారిక సమాచారం అందింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణం వందశాతం జరిగినట్లు కేంద్రం కొద్దిరోజుల కిందట నిర్వహించిన సర్వేలో తేలింది. స్వచ్ఛమైన తాగునీరు, ఇంటింటా చెత్తసేకరణలో వంద శాతం మార్కులను ఈ జిల్లా దక్కించుకుంది. సిరిసిల్ల పట్టణంతోపాటు మండలాల్లో కేంద్రం పారిశుద్ధ్య పనులను కేంద్రం పరిశీలించి, పరిశుభ్రమైన జిల్లాగా తేల్చింది.

ఆఖరు స్థానం నుంచి మొదటికి
కొన్నేళ్ల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా పరిశుభ్రతలో ఆఖరుస్థానంలో ఉండేది. జాతీయ పట్టణ పారిశుద్ధ్య పాలసీని కేంద్ర ప్రభుత్వం 2008లో తీసుకువచ్చింది. అప్పుడు సిరిసిల్ల డివిజన్‌గా ఉండగా పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందనేది కనిపించింది. ప్రస్తుత మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు జిల్లాలోని 13 మండలాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకున్నారు. జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ ఆదేశాలతో అన్ని శాఖల అధికారులు బాధ్యత తీసుకొని ఓడీఎఫ్‌ సాధించేందుకు తీవ్రంగా కృషిచేశారు. ప్రతి గ్రామానికి ఒక నోడల్‌ అధికారిని నియమించారు. మరుగుదొడ్డి లేని ఇంటికి రూ.13 వేలు, ఉన్నవాటికి సెప్టిక్‌ ట్యాంకులు నిర్మించుకోవడానికి రూ.7 వేల చొప్పున ప్రభుత్వం రాయితీ ఇచ్చి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఒక యజ్ఞంలా చేపట్టారు. అధికారులతో ప్రజాప్రతినిధులు సైతం భాగస్వాములయ్యారు. జిల్లాలో కూలీల కొరత ఏర్పడడంతో వరంగల్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల నుంచి అధికారులే స్వయంగా కూలీలను తరలించి పనులు వేగంగా పూర్తిచేశారు. బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా జనవరి 26న గణతంత్ర దినోత్సవంలో కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ ప్రకటించారు.

కేంద్ర సర్వే ఇలా…
కేంద్ర ప్రభుత్వ తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని జాతీయ పట్టణ పారిశుద్ధ్య పాలసీ సంస్థ జిల్లా వ్యాప్తంగా సర్వే నిర్వహించింది. 210 గ్రామ పంచాయతీల్లో సర్వే చేసి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేశారా? ప్రజలు వాటిని వినియోగిస్తున్నారా! అనే దానిపై సమగ్ర సర్వే జరిపి కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. దాని ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ర్యాంకింగ్‌లలో మొదటిస్థానానికి చేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *