ప్రజల్లోకి కమల్… జాలర్ల కుటుంబాలతో సమావేశం…!

చెన్నై ముచ్చట్లు:

తమిళనాట కొత్త రాజకీయ పార్టీకి రంగం సిద్ధం చేసుకున్న ప్రముఖ నటుడు కమల్ హాసన్… ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.ఇందులో భాగంగా శుక్రవారం ఆయన ఎన్నూరు డెల్టా ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి జాలర్ల కుటుంబాలను కలుసుకుని స్వయంగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్ధాల కారణంగా ఎన్నూరు ఏరు తీవ్రంగా కలుషితమవుతున్నట్టు ఆయన శుక్రవారం ట్విటర్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. తమిళనాడు ప్రభుత్వం ఎన్నూరు ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తే చెన్నైకి వరదముప్పు వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు.కాగా ఇవాళ ఉదయం ఎన్నూరులో పర్యటిస్తూ..పవర్ ప్లాంటులు, ఆయిల్ రిఫైనరీల నుంచి వెలువడుతున్న రసాయనాల కారణంగా మత్స్యకారులు ఎలా నష్టపోతున్నదీ వివరాలు కనుక్కున్నారు. ఇటీవల ఓ పర్యావరణ పరిరక్షణ సంస్థ చేపట్టిన అవగాహన కార్యక్రమం ద్వారా ఈ విషయం తెలుసుకున్న కమల్… ఎన్నూరు వాగు పరిరక్షణపై స్వయంగా రంగంలోకి దిగడం విశేషం. కోస్తాలయార్ నది నుంచి బంగాళాఖాతం వరకూ పయనించే ఎన్నూరు వాగు..చైన్నై నగరాన్ని వరదల నుంచి కాపాడడంతో పాటు, జర భద్రతలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. ఉత్తర చెన్నైలోని థర్మల్ పవర్ స్టేషన్ నుంచి ఇందులో కలుస్తున్న వ్యర్థాల కారణంగా దాదాపు వెయ్యి ఎకరాల్లో సాగు దెబ్బతింటున్నట్టు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *