ప్రజా వైద్యులకు ప్రోత్సాహకం

ఫైలుపై సంతకం చేసిన సీఎం కేసీఆర్
-కేసీఆర్ కిట్స్‌తో వైద్యసిబ్బంది పనిభారం పెరిగింది..వారి సేవలు శ్లాఘనీయం
-ప్రజల్లో పెరిగిన నమ్మకం నిలబెట్టుకోవాలి
-హెల్త్‌మ్యాప్ సిద్ధం చేయాలని సీఎం సూచన
-నల్లగొండ, సూర్యాపేటలో మెడికల్ కాలేజీల స్థాపనకు చర్యలు
-ప్రభుత్వ దవాఖానలకు దశలవారీగా కొత్త భవనాలు
-రేషన్ బియ్యం పక్కదారిపడుతున్నది
-పౌరసరఫరాల శాఖలో నగదు బదిలీపై చర్చ
-వైద్య, ఆరోగ్య, పౌర సరఫరాలశాఖలపై సమీక్షలో సీఎం
ప్రజావైద్యులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భుజంతట్టి ప్రోత్సహిస్తున్నారు. కేసీఆర్ కిట్స్ పథకం వల్ల పెరిగిన పనిభారాన్ని మోస్తూ, ఓపికగా, చిత్తశుద్ధితో పేదలకు వైద్య సేవలందిస్తున్న వైద్యులకు నగదు ప్రోత్సాహకం అందించే ఫైల్‌పై ఆయన సంతకంచేశారు. రాబోయేకాలంలో రాష్ట్రంలో ప్రజావైద్యం ఎలా ఉండాలన్న అంశంపై హెల్త్‌మ్యాప్ రూపొందించాలని అధికారులను కోరారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో సరుకులు పంపిణీ చేయటం ఉత్తమమా? లేక నగదు బదిలీ పథకం అమలుచేయటం ఉత్తమమా? అనే అంశంపై ఆలోచించాలని అధికారులకు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌లో శనివారం వైద్య ఆరోగ్యశాఖ, పౌర సరఫరాలశాఖలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాలలో మంత్రి సీ లకా్ష్మరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ఆయాశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వైద్యుల సేవలు శ్లాఘనీయం
కేసీఆర్ కిట్స్ పథకం వల్ల ప్రభుత్వ దవాఖానల్లో పనిభారం పెరిగింది. పీహెచ్సీ నుంచి టీచింగ్ హాస్పిటల్స్ వరకు ప్రతిచోటా పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నది. కేటాయించిన బెడ్లకన్నా ఎక్కువ సంఖ్యలో పేషెంట్లు వస్తున్నా సరే, పేదలకు వైద్య సేవలు అందించాలనే మంచి ఉద్దేశంతో వైద్యులు, వైద్య సిబ్బంది సేవలందిస్తున్నారు. చాలామంది ఓవర్ టైమ్ పనిచేస్తున్నారు. వారి సేవలు శ్లాఘనీయం. ప్రజలు వైద్యుల సేవలను కొనియాడుతున్నారు. ప్రభుత్వ దవాఖానల్ల్లో పనితీరు మారింది. వైద్యులకు, సిబ్బందికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాలి అని సీఎం వైద్యులను అభినందించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవటానికి వైద్యశాఖ మరింత క్రియాశీలకంగా పనిచేయాలని వైద్యులకు పిలుపునిచ్చారు. వైద్యశాఖకు ప్రభుత్వం అవసరమైన చేయూత అందిస్తుందని స్పష్టంచేశారు. కేసీఆర్ కిట్స్ బహుళ ప్రయోజనాలు అందిస్తున్నది. పేషెంట్లు ప్రభుత్వ దవాఖానలకే వస్తుండటంతో అనవసర ఆపరేషన్ల గండం నుంచి బయటపడుతున్నారు. నిరంతరం వైద్యశాలకు వచ్చి చెక్ చేసుకోవటం వల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటున్నారు. ఫలితంగా ఆరోగ్యవంతమైన మరో తరం (జనరేషన్) వస్తున్నది. పేదలకు ప్రసూతి ఖర్చు తప్పడమే కాకుండా, తిరిగి ప్రభుత్వమే రూ. 15 వేల దాకా ప్రోత్సాహకం అందిస్తున్నది. పేదలు ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు. గర్భవతులు ముందే దవాఖానకు వచ్చి పరీక్షలు చేయించుకోవటం, ప్రసూతి చేయించుకోవటం వల్ల మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గాయి. కేసీఆర్ కిట్స్ వల్ల పెరిగిన పేషెంట్ల రద్దీకి తగినట్లుగా వసతులు కూడా పెంచాలి. అవసరమైన వైద్యులను, సిబ్బందిని నియమించుకోవాలి. వైద్య ఆరోగ్యశాఖకు అవసరమైన నిధులను ఆర్థికశాఖ ఎలాంటి జాప్యం లేకుండా విడుదల చేయాలి అని సీఎం చెప్పారు. ఆదిలాబాద్‌తోపాటు ఇతర ఏజెన్సీలలో ప్రతి వర్షాకాలంలో అంటువ్యాధులు, విషజ్వరాలు ప్రబలి అనేకమంది చనిపోయేవారని, కానీ ఈసారి వైద్య ఆరోగ్యశాఖ చేపట్టిన కార్యక్రమాల వల్ల అలాంటి పరిస్థితి రాలేదంటూ వైద్యుల పనితీరును ముఖ్యమంత్రి మెచ్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *