బీజేపీ జాబితా వచ్చేసింది…

సిమ్లా ముచ్చట్లు:

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 68 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ బుధవారంనాడు విడుదల చేసింది. మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్‌కుమార్ ధుమాల్‌కు సుజన్‌పూర్ నియోజవర్గాన్ని కేటాయించింది. 68 సభ్యుల హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు జనవరి 7వ తేదీతో ముగియనుండటంతో నవంబర్ 9న ఒకే విడతలో ఎన్నికల నిర్వహిస్తున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇటీవల ప్రకటించింది. డిసెంబర్ 9న ఓట్లు లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది.

కాగా, హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌పైనే కాంగ్రెస్ గట్టి నమ్మకం పెట్టుకుంది. ఇప్పటికే ఆయనను సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించడంతో పాటు అభ్యర్థుల ఎంపిక బాధ్యతను కూడా ఆయనకే అప్పగించింది. వీరభద్ర సింగ్‌ అర్కీ నియోజకవర్గం నుంచి, సిమ్లా నుంచి ఆయన కుమారుడు విక్రమాదిత్య పోటీ చేయనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే పార్టీ అభ్యర్థుల జాబితాను ఇంకా కాంగ్రెస్ ప్రకటించేదు. ఇప్పటికే మోదీ, రాహుల్ ముందస్తు పర్యటనలతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. వీరభద్రసింగ్ ఏడోసారి సీఎం పదవి చేపట్టడం ఖాయమని, అధికారం తమదేనని రాహుల్ తన పర్యటనల్లో ధీమా వ్యక్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధిలో వీరభద్ర సింగ్ పాత్ర ఎంతో ఉందని, మోదీ వాగ్దానాలను నమ్మొద్దని ఓటర్లకు రాహుల్ పిలుపునిచ్చారు. కాగా, బిలాస్‌పూర్ పర్యటనలో ‘ఎయిమ్స్’ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ…వీరభద్ర సింగ్ అవినీతిని ఎండగట్టారు. కాంగ్రెస్ నేతలంతా బెయిలుపైనే ఉన్నారని, యువరాజు (రాహుల్), వీరభద్ర అంతా బెయిల్‌పై బైట ఉన్నవారేనంటూ విసుర్లు విసిరారు. బీజేపీకి ఓటు వేయడం ద్వారా వీరభద్రసింగ్ వంటి వారిని వదిలించుకోండంటూ పిలుపునిచ్చారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర పార్టీ యూనిట్‌లో అంతర్గత విభేదాల మూలంగా బీజేపీ ఓటమి చవిచూసింది. ఈసారి ఎన్నికల్లో మాత్రం గెలుపు తమదేనని ధీమాగా చెబుతున్న బీజేపీ ఇంకా తమ సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *