భయం గుప్పిట్లో: తెలుగు రాష్ట్రాలకు రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు?

విశాఖపట్టణం ముచ్చట్లు:

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.నైరుతి బంగాళఖాతం పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనావేస్తున్నారు.నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలపడి సోమవారం నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది క్రమేపీ బలపడుతూ వాయుగుండంగా మారనుంది. అనంతరం వాయవ్య దిశగా పయనిస్తూ ఈనెల 19 నాటికి ఉత్తర కోస్తాంధ్ర – ఒడిశాల మధ్య తీరాన్ని తాకుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి ప్రకటించింది.మరోవైపు రాయలసీమపై నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.అదే సమయంలో రాయలసీమపై మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఆదివారం రాయలసీమలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు కొన్నిచోట్ల పిడుగులు పడతాయని, భారీ ఈదురుగాలులకు ఆవకాశం ఉందని ప్రకటించింది.గత 24 గంటల్లో తాడిమర్రిలో 8, బత్తలపల్లి, ధర్మవరంలలో 8, కంబదూరు, కూనవరం, వరరామచంద్రపురంలలో 7, రామగిరి, వేలేరుపాడు, చింతపల్లి, రామగిరిలోల 5, మడకశిరలో 4 సెం.మీల చొప్పున వర్షపాతం రికార్డయింది.ఈశాన్య రుతుపవనాల సీజను మొదలయ్యాక అక్టోబర్‌ – డిసెంబర్‌ మధ్య మూడు తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ తుపాన్ల రాకపై ఇప్పటికే ఇస్రో ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఇచ్చినట్టు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం వాయుగుండంగా.. ఆ తర్వాత తుపానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు, అంతర్జాతీయ ప్రైవేట్‌ వాతావరణ సంస్థ ఆక్యు వెదర్‌ సీనియర్‌ మెటిరియాలజిస్ట్‌ జాసన్‌ నికోల్స్‌ చెబుతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా, ఒడిశా తీరప్రాంతాలపై ప్రభావం చూపుతుందని అంచనా వేశారు. అందువల్ల వరదలు సంభవించే ప్రమాదం ఉందని సూచించారు. ఇదిలా ఉండగా చైనా సముద్రంలో ప్రస్తుతం ‘ఖానూన్‌’ అనే పెనుతుపాను కొనసాగుతోంది. ఇది రెండ్రోజుల్లో బలహీన పడే అవకాశం ఉండటంతో ఇక్కడ 16న అల్పపీడనం ఏర్పడి 19 నాటికి వాయుగుండంగా మారవచ్చని ఐఎండి పేర్కొంది.తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలోని కృష్ణా, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాలతో పాటు, రాయలసీమ, తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.భారీ వర్గాల కారణంగా వరద నీరు లోతట్టు ప్రాంతాల్లోకి చేరవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు., ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వానలకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అల్పపీడన ద్రోణి, క్యుములో నింబస్, ఉపరితల ద్రోణి తెలుగు రాష్ట్రాలపై పరుచుకుని ఉన్నాయని పేర్కొన్నారు. మరో నాలుగైదు రోజుల పాటు వీటి ప్రభావం ఉంటుందని, ఆపై వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పడతాయని, చలిగాలుల తీవ్రత పెరుగుతుందని వెల్లడించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *