మద్యం దుకాణంలో మహిళా ఉద్యోగి!

ఇంటర్నెట్‌డెస్క్‌ ముచ్చట్లు:

సాధారణంగా మద్యం దుకాణాల్లో పురుషులే విధులు నిర్వహిస్తుంటారు. ఎందుకంటే అక్కడి పరిస్థితులు మహిళలకు అనుకూలించవు. కానీ కేరళకు చెందిన షైనీ రాజీవ్‌ అనే మహిళకు వూహించని విధంగా మద్యం దుకాణంలో ఉద్యోగం లభించింది.ఎర్నాకుళం ప్రాంతానికి చెందిన షైనీ రాజీవ్‌కు టీచర్‌ కావాలని కోరిక. దానికోసం బీఈడీ పూర్తి చేసింది. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా హై స్కూల్‌ అసిస్టెంట్‌(హెచ్‌ఎస్‌ఏ) ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది. గతంలో ఆమె పుతన్‌వెలిక్కర పంచాయితీలో అసిస్టెంట్‌గా పనిచేసేది. మూడేళ్ల క్రితమే ఆ ఉద్యోగం పోయింది.ఆ తరువాత టీచర్‌ ఉద్యోగానికి కూడా ఎంపిక కాలేదు. ఆ క్రమంలోనే 2010లో మద్యం దుకాణాల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రకటన ఇవ్వడంతో ఆ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసింది. అందులో షైనీకి 526 ర్యాంకు వచ్చింది. అయితే ఆమె కంటే తక్కువ ర్యాంకు వచ్చిన పురుషులకు ఆ ఉద్యోగం ఇచ్చారు.దీంతో మరో ఆరుగురు మహిళలతో కలిసి మహిళలపై వివక్ష చూపిస్తున్నారని ఉన్నతాధికారుల దృష్టికి షైనీ తీసుకువెళ్లింది. అనంతరం దీనిపై 2012లో ఆమె హైకోర్టుకు విన్నవించుకుంది. అయితే కేరళ ప్రభుత్వ అబ్కారీ చట్టం ప్రకారం మహిళలకు మద్యం దుకాణాల్లో ఉద్యోగాలివ్వకూడదు. కానీ ఆమె అభ్యర్థనను పరిశీలించిన న్యాయస్థానం లింగ వివక్ష చూపడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొనడంతో ఆమెకు ఏప్రిల్‌లో కనక్కన్‌కదేవ్‌లో లోయర్‌ డివిజన్‌ క్లర్కుగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో ఈనెల 26న షైనీ క్లర్క్‌గా బాధ్యతలు స్వీకరించారు.ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆమె విధులు నిర్వహిస్తారు. ఆమె భర్త రాజీవ్‌, సహోద్యోగులు ఆమెకు ఎంతో సహకారం అందిస్తున్నారు. ఈ రంగంలో మరింత మంది మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి లింగభేదాన్ని దూరం చేయాలని భావిస్తున్నారు అధికారులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *