మరో మూడు దేశాలపై ట్రంప్‌ ట్రావెల్‌ బ్యాన్‌

తమ దేశంలోకి ప్రవేశించకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిషేధిత జాబితాలోకి మరిన్ని దేశాలను చేర్చారు. ఉత్తర కొరియా, వెనెజులా, చాద్‌ దేశాల పౌరులపై తాజాగా నిషేధాజ్ఞలు జారీ చేశారు. దీంతో మొత్తం నిషేధిత జాబితాలో ఉన్న దేశాల సంఖ్య 8కి చేరింది. నిషేధిత ఉత్తర్వులపై ట్రంప్‌ ఆదివారం సంతకం చేశారు. ప్రస్తుతం ఆరు దేశాలపై ఉన్న నిషేధం ఆదివారంతో ముగిసింది. అయితే తాజా ఆదేశాల ప్రకారం.. ప్రస్తుత దేశాలపై నిషేధం తిరిగి వెంటనే అమలుచేస్తుండగా.. కొత్తగా జాబితా చేర్చిన వాటిపై మాత్రం అక్టోబర్‌ 18 నుంచి నిషేధం అమలు కానుంది.
ఇప్పటికే ఇరాన్‌, లిబియా, సిరియా, యెమన్‌, సోమాలియా, సూడన్‌పై అమెరికా 90రోజుల పాటు ట్రావెల్‌ బ్యాన్‌ విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిషేధం ఆదివారంతో ముగిసింది. దీంతో కొత్త ఆదేశాలను తీసుకొచ్చింది ట్రంప్‌ సర్కార్‌. అయితే ఈ సారి ప్రస్తుత దేశాల జాబితా నుంచి సూడన్‌ను తొలగించింది. కొత్తగా ఉత్తర కొరియా, వెనెజులా, చాద్‌లను తీసుకువచ్చింది. అయితే వెనజులా నుంచి ప్రభుత్వ అధికారులు, వారి కుటుంబసభ్యులపై మాత్రమే ఈ ఆంక్షలు కొనసాగుతాయని శ్వేతసౌధం ప్రకటించింది.

‘అమెరికాను సురక్షిత దేశంగా మార్చడమే నా మొదటి ప్రాధాన్యత. భద్రతకు భంగం కలిగించే వారిని మా దేశంలోకి అనుమతించం’ అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. దుందుడుకు చర్యలతో పక్కలో బల్లెం మాదిరిగా మారిన ఉత్తర కొరియాపై నిషేధం తీసుకొచ్చింది. ఇక చాద్‌ ఉగ్రవాద కార్యకలాపాల నిర్మూలనకు సంబంధించి అమెరికాకు ఎలాంటి సహకారం అందించడం లేదని అందుకే ట్రావెల్‌ బ్యాన్‌ విధించినట్లు శ్వేతసౌధం పేర్కొంది. మరోవైపు వెనెజులాలోని ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలపై ఆంక్షలు విధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *