Coal Ground for Electricity

ముందుచూపులేక విద్యుత్‌ రంగానికి బొగ్గు గండం

Date: 14/12/2017

ఢిల్లీ ముచ్చట్లు:

ప్రాజెక్టులకు బొగ్గు ఇక్కట్లు తోడవటంతో సమస్య మరింత జటిలం
దేశంలో ఎన్ని థర్మల్‌ కేంద్రాలు ఉన్నా, ఎన్నెన్ని ప్రాజెక్టులు వస్తున్నా విద్యుదుత్పాదన అంతంతమాత్రంగానే ఉంటోంది. బొగ్గుకొరత థర్మల్‌ విద్యుత్కేంద్రాల పాలిట శాపంలా పరిణమిస్తోంది. రాష్ట్రంలో కురిసిన భారీవర్షాల పుణ్యమా అని జలవిద్యుత్‌ ఉత్పత్తితో ప్రస్తుతం పరిస్థితి ఫరవాలేదనిపిస్తోంది. వానకాలం తరవాత మళ్ళీ చీకట్లు ముసురుకోరాదంటే, ప్రభుత్వం ఇప్పటికైనా విద్యుత్‌రంగంలో దీటైన చర్యలు తీసుకోవడంపై ఎందుకు దృష్టి కేంద్రీకరించడం లేదో అర్ధంకావడం లేదు. విద్యుత్‌ రంగాన్ని ఇంధన కొరత ఇంకా వెంటాడుతోంది. దేశంలో, రాష్ట్రంలో కూడా ఇప్పటికీ ఇదే దుస్థితి కనిపిస్తోంది. గ్యాస్‌ కొరత వల్ల, ఏడువేల మెగావాట్ల స్థాపిత సామర్థ్యం గల విద్యుత్‌ ప్రాజెక్టుల్ని నేటికీ సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. ఇతర ప్రాజెక్టులకు బొగ్గు ఇక్కట్లు తోడవటంతో, సమస్య మరింత జటిలమవుతోంది. దేశంలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు చాలాకాలంగా బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. దీని ప్రభావం కొత్తగా వచ్చే ప్రాజెక్టులపైనా పడుతోంది. బొగ్గు ఉత్పత్తి పెంపుదల యత్నాలు ఎంతకీ ముందుకు సాగటం లేదు. కష్టాలు నానాటికీ ఎక్కువ అవుతున్నాయే తప్ప, తగ్గటంలేదు. దిగుమతులు అనివార్యమన్నంతగా పరిస్థితులు దాపురించాయి. ఏటేటా పెరిగిపోతున్న దిగుమతుల వల్ల కష్టనష్టాలు ఎక్కువవు తున్నాయి. వీటన్నిటి ఫలితంగా, అధిక ఛార్జీల రూపంలో భారాన్నంతా మోస్తోంది విద్యుత్‌ వినియోగదారులే! దేశంలో 78 వేల మెగావాట్ల సామర్థ్యమున్న థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టులకు బొగ్గు సరఫరా చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల్లో 2009 సంవత్సరం నుంచి విద్యుదుత్పత్తి ప్రారంభించినవాటితో పాటు, 2015 మార్చికల్లా పని మొదలుపెట్టేవీ ఉన్నాయి. దేశీయంగా లభించే బొగ్గును దృష్టిలో పెట్టుకునే, కేంద్రం నిర్ణయం తీసుకుంది. తరవాత, ఆయా ప్రాజెక్టులకు అవసరమైనంత బొగ్గు సరఫరా చేయలేమంటూ చేతులెత్తేసింది. బొగ్గు పంపిణీ విధానంలో- 65నుంచి 67శాతం మాత్రమే ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది. ఇంధన సరఫరా ఒప్పందాలు సైతం ఆ మేరకేనని తేల్చిచెప్పింది. కొరత తట్టుకునేలా దిగుమతికి అనుమతీ ఇచ్చింది. విద్యుత్‌ ప్రాజెక్టులు సొంతంగా బొగ్గు దిగుమతి చేసుకోవచ్చు, లేదంటే కోల్‌ ఇండియా (సిల్‌) దిగుమతి చేసి ఇచ్చే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 76.9కోట్ల టన్నుల బొగ్గు అవసరమని అంచనా వేశారు. దేశీయంగా ఉత్పత్తి అయ్యేది 61.4కోట్ల టన్నులే. అవసరమైనంత బొగ్గు అందుబాటులో లేనందువల్ల, ప్రాజెక్టుల సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తి జరగడంలేదు. బొగ్గు నాణ్యతపరంగా కూడా అవస్థలు ఎదురవుతున్నాయి. నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్టీపీసీ) ప్రాజెక్టులు బొగ్గు కొరతతో సతమతం అవుతున్నాయి. విశాఖలోని సింహాద్రి విద్యుత్‌ ప్రాజెక్టుకు రోజుకు 28 వేల టన్నుల బొగ్గు అవసరమైనా, అంత మొత్తంలో సరఫరా లేదు. దీంతో, విద్యుదుత్పాదన మరింత తగ్గిపోయింది. కొరత విషయం ముందుగా తెలిసినా, దానినుంచి బయటపడలేనంత దురవస్థ ఇప్పుడుంది. థర్మల్‌ ప్రాజెక్టులు గిరాకీని తట్టుకోవడానికి దిగుమతిమీద ఆధారపడుతున్నాయి. కేంద్రమూ ముందుగానే ఇందుకు అనుమతినిస్తోంది. బొగ్గు దిగుమతి ఏటేటా పెరుగుతూ వస్తోంది. 2010-11లో 6.8కోట్ల టన్నుల బొగ్గు దిగుమతి చేసుకుంటే, గత ఆర్థిక సంవత్సరంలో ఇది 13.7కోట్ల టన్నులకు చేరింది. ప్రధానంగా ఇండొనేసియా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అమెరికా, న్యూజిలాండ్‌ నుంచి ఇండియా బొగ్గు దిగుమతి చేసుకుంటోంది. ఆయా దేశాల్లో వచ్చిన, వస్తున్న విధానాల్లో మార్పులకు తోడు, రూపాయి మారక ప్రభావమూ బొగ్గు ధరపై పడుతోంది. దిగుమతి చేసుకునే బొగ్గు ధర ఎక్కువ. పరిమాణమూ ఎక్కువ అవుతున్న కారణంగానే, దిగుమతి వ్యయం పెరిగిపోతోంది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో, దిగుమతి చేసుకున్న బొగ్గు విలువ రూ.8,101కోట్లకు చేరుకుంది. ఆ అధిక భారమంతా వినియోగదారులే మోయాల్సి వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో బొగ్గు దిగుమతి ఇంకా పెరిగే అవకాశముంది. ఏపీ జెన్‌కో ప్రస్తుతం 15లక్షల టన్నుల బొగ్గు దిగుమతి చేసుకుంటోంది. ఇప్పటికే 50 శాతం దిగుమతికి ఆర్డరు ఇచ్చింది. దేశీయ బొగ్గుతో కలిపి దీన్ని వాడుతున్నారు. దేశీయ బొగ్గు కంటే దిగుమతి బొగ్గు ధర యూనిట్‌కు 15 నుంచి 20 పైసలు అధికం అవుతోందని అంచనా. మహానది కోల్‌ ఫీల్డ్స్‌ నుంచి జెన్‌కోకు కేటాయించిన బొగ్గులో 60 శాతానికి మించి రావడంలేదు. రవాణాలో సైతం అనేక లోటుపాట్లు ఎదురవుతున్నాయి. రైల్వేశాఖ తగినన్ని ర్యాకులను కేటాయించలేకపోతోంది. ఒక్క జెన్‌కోనే కాక, అన్ని థర్మల్‌ ప్రాజెక్టులూ ఇదే పరిస్థితిలో ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రవాణా ఖర్చులు ఎనిమిది శాతం పెరిగినట్లు అంచనా. ఏపీజెన్‌కో దిగుమతి చేసుకునే బొగ్గు వచ్చే ఏడాదికి రెట్టింపు అయ్యే అవకాశముంది. మొత్తం 1,600 మెగావాట్ల సామర్థ్యమున్న కృష్ణపట్నం ప్రాజెక్టు ఈ ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి రానుంది. సుమారు 800 మెగావాట్ల తొలి యూనిట్‌ అక్టోబరులో విద్యుదుత్పత్తి ప్రారంభించవచ్చు. రెండోదైన 800 మెగావాట్ల యూనిట్‌ జనవరికి సిద్ధం కావచ్చు. కృష్ణపట్నం ప్రాజెక్టుకు రమారమి 70శాతం బొగ్గు దిగుమతి చేసుకోవలసిందే! బొగ్గు ఎక్కువగా వినియోగిస్తున్న దేశాల్లో చైనా తరవాత మనమే ఉన్నాం. థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టులు ఇక్కడ ఎక్కువగా ఉండటమే అందుకు కారణం. దేశంలో 1.32లక్షల మెగావాట్లమేరకు థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టుల సామర్థ్యముంది. విద్యుదుత్పాదనకు ఇంకా బొగ్గే ప్రధాన వనరుగా ఉన్న కారణంగా, ఈ ప్రాజెక్టులు మరింతగా పెరగవచ్చు. అందుకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తిని పెంచే ప్రయత్నమే సాగటంలేదిప్పుడు. విద్యుత్‌ రంగంలో ఏదైనా ప్రాజెక్టు- నిర్మాణం చేపట్టిన నాలుగేళ్లలో పూర్తవుతోంది. బొగ్గు రంగంలో మాత్రం అలా జరగటం లేదు. ఏళ్లూ పూళ్లూ గడుస్తున్నా, గనుల్లో బొగ్గుతీత పనులు పూర్తిగా చేపట్టలేనంత దుర్దశ దేశంలో ఉంది. పైగా, పర్యావరణ అనుమతుల సమస్యలు ఉండనే ఉన్నాయి. వివాదాల ముసురూ సరేసరి. మంత్రుల కమిటీ సిఫార్సు ప్రకారం, దేశంలోని వివిధ ప్రభుత్వరంగ కంపెనీలకు కేంద్రం ఈమధ్య 14 బొగ్గు గనులు కేటాయించింది. వీటిల్లో 831.1కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని గుర్తించారు. ఏడాదికి 15.9కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయవచ్చు. మొత్తం 31,800మెగావాట్ల విద్యుదుత్పాదనకు ఈ బొగ్గు సరిపోతుందని అంచనా. ఇందులో ఏపీజెన్‌కోకు ఒక గని దక్కింది. ఇది ఒడిశాలో ఉంది. గనిలో 70.1కోట్ల టన్నుల బొగ్గు నిల్వ ఉన్నట్లు తేలింది. విజయవాడలోని డాక్టర్‌ నార్ల తాతారావు థర్మల్‌స్టేషన్‌లోని 800 మెగావాట్ల అయిదో యూనిట్‌, కొత్తగూడెం, సత్తుపల్లి, ఇతరత్రా యూనిట్లకు ఈ బొగ్గునిల్వలు కేటాయించారు. బొగ్గు గనుల ప్రక్రియ పరిపూర్తికి చొరవ చూపాలని కేంద్రం ఇటీవలే ఏపీజెన్‌కోకు లేఖ రాసింది. స్పందన తగిన రీతిలో లేకపోతే గని కేటాయింపు రద్దు అయినట్లే భావించాల్సి వస్తుందనీ హెచ్చరించింది. ఇక్కడ దూరదృష్టి ఎంత అవసరమో దీన్నిబట్టే అర్థమవుతోంది. రాష్ట్రంలో థర్మల్‌ ప్రాజెక్టులు పెరుగుతున్న కారణంగా, ఇప్పుడు దక్కిన గనిని ఏమాత్రం చేజార్చుకోరాదు. ప్రభుత్వపరంగా మరింత చొరవ ఉండితీరాలి. బొగ్గు ఉత్పత్తిలో కోల్‌ ఇండియా ప్రపంచంలోనే పెద్దది అయినప్పటికీ, విస్తరణలో విఫలమైపోయింది. ఆ సంస్థ అనుకున్నంతగా ఉత్పాదన పెంచలేకపోతోంది. లక్ష్యం ఉన్నా, ఆచరణ కొరవడిందక్కడ. ఈ ఆర్థిక సంవత్సరంలో 48.5కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలన్నది సంస్థ ధ్యేయమైనా, తొలి త్రైమాసికం ముగిసినా అది సాధించింది కొంతే. బొగ్గు నిక్షేపాలు విస్తారంగా ఉన్నప్పటికీ, గిరాకీకి అనుగుణంగా ఉత్పాదన పెంచుకోలేకపోవటం తీవ్ర విమర్శలపాలవుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే, కోల్‌ ఇండియాను పునర్‌ వ్యవస్థీకరించాలని నిర్ణయించారు. ప్రణాళిక సంఘంతోపాటు టి.ఎల్‌.శంకర్‌ కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్నారు. పునర్‌ వ్యవస్థీకరణపై విలువైన సూచనలు చేసే బాధ్యతను ఓ కన్సల్టెంట్‌కు అప్పగిస్తున్నారు. డిసెంబరునాటికి అక్కడినుంచి కేంద్రానికి నివేదిక అందే సూచనలున్నాయి. అది అందిన తరవాతే, తుది వ్యవస్థమీద ఎవరికైనా ఒక అవగాహనంటూ వస్తుంది. ఆదాయం పంచుకునే పద్ధతిలో, ప్రైవేట్‌ కంపెనీలకు బొగ్గు గనుల్ని కేటాయించే అంశాన్ని కేంద్రం తాజాగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అదింకా ప్రాథమిక దశలోనే ఉంది. ఒకవైపు ఇంధన కొరత బాధిస్తుంటే, మరోవైపు అవసరాల్ని బట్టి ఇతర మార్గాల్లో విద్యుదుత్పాదన పెంచుకునే యత్నాలైనా సాగకపోవటం శోచనీయం. వేసవిలో విద్యుత్‌ గిరాకీని తట్టుకునేందుకు, ద్రవీకృత సహజ వాయువు (ఆర్‌ఎల్‌ఎన్జీ)తో కొంతవరకు ఉత్పాదన చేశారు. దాని ధరా ఎక్కువైనందువల్ల, యూనిట్‌కు రూ.12.50 పైసలదాకా చేసినట్లు సమాచారం. ఇంత ధరపెట్టినా విద్యుత్‌ లోటు మాత్రం తీరలేదు. వేసవిలో ఉత్పత్తి చాలావరకు తగ్గింది. ఆ మేరకు విద్యుత్‌ కోతలు పెరిగిపోయాయి. బయటినుంచి కొనుగోళ్లలో కూడా ఇబ్బందులెన్నో. ట్రాన్స్‌మిషన్‌ కారిడార్‌ లేకపోవడమే మూల కారణం. గిరాకీకి తగ్గట్లు సరఫరా లేకపోవటంతో, ఇప్పుడు కూడా ఎక్కడిక్కడ కోతలే! ప్రకృతి సహకరించినందువల్ల, ప్రస్తుతానికి బయటపడగలిగాం. జలాశయాలు కళకళలాడటంతో, విద్యుదుత్పాదన బాగా పెరిగింది. గత ఏడాది ఇదే సమయంలో రోజుకు 70లక్షల యూనిట్లు వస్తే, ఇప్పుడు రోజుకు 6.2 కోట్ల యూనిట్ల ఉత్పత్తి అవుతోంది. గిరాకీని తట్టుకున్న స్థితే అయినా, ఇదంతా తాత్కాలికమే. అవసరాలకు దీటుగా విద్యుదుత్పత్తి పెంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. సౌరశక్తిద్వారా వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి జరపాలన్న నిర్ణయం గత ఏడాది నవంబరునాటిది. ఆ యూనిట్‌ ధర రూ.6.49పైసలుగా ప్రభుత్వం నిర్ణయించింది. అదే ధరకు 222 మెగావాట్ల తయారీ యూనిట్లు నెలకొల్పేందుకు టెండరుదారులు ముందుకు వచ్చారు. తొమ్మిది నెలలు గడిచినా, ఒక్క యూనిట్‌లోనూ పనులు మొదలుకాలేదు! వీటికి ఇకనైనా వెంటనే క్రియారూపం ఇవ్వాల్సి ఉంది. బాధ్యతంతా ప్రభుత్వం, ఏపీట్రాన్స్‌కో మీదే ఉంది. సౌరశక్తి ప్యానల్స్‌ దిగుమతిమీద ఆధారపడటంతో, డాలరుతో రూపాయి మారక ప్రభావం ఆ యూనిట్లపైనా కనిపిస్తోంది. ఇప్పటికైనా సరైన చర్యలు లేకుంటే, విద్యుత్‌ కొరత వెంటాడుతూనే ఉంటుంది.

Tag: Coal Ground for Electricity

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *