ముఖ్యమంత్రికి ప్రధాని మోదీ ప్రశంసలు

పాట్నా ముచ్చట్లు:

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. పాట్నా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మోదీ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి పట్ల నితీశ్ కుమార్‌కు అంకితభావం ఉందన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో జనతా దళ్ యునైటెడ్ (జేడీయూ) చేరిన తర్వాత ఈ నేతలిద్దరూ తొలిసారి ఒకే వేదికపై కనిపించారు.పాట్నా విశ్వవిద్యాలయం చాలా మంది ఐఏఎస్‌ అధికారులను దేశానికి అందించిందని మోదీ ప్రశంసించారు. 2022లో భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకుంటుందని, అప్పటికి బిహార్ సంపన్న రాష్ట్రాల్లో ఒకటిగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ విశ్వవిద్యాలయాన్ని సందర్శించే అవకాశంతోపాటు విద్యార్థుల మధ్యకు రావడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానన్నారు.బిహార్ పవిత్ర భూమికి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ విశ్వవిద్యాలయం చాలా మంది విద్యార్థులను తీర్చిదిద్దిందని, వారంతా దేశానికి ఎనలేని సేవ చేస్తున్నారని చెప్పారు.బిహార్ అభివృద్ధి కోసం నితీశ్ కుమార్ అంకితభావంతో కృషి చేస్తున్నారని మోదీ ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం తూర్పు భారతదేశ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. బిహార్‌కు జ్ఞానంతోపాటు గంగ కూడా వరంగా లభించిందన్నారు. ఈ గడ్డకు ప్రత్యేక వారసత్వం ఉందన్నారు.మన విశ్వవిద్యాలయాలు సంప్రదాయ బోధన నుంచి సృజనాత్మకత దిశగా పయనించాలన్నారు. ప్రపంచీకరణ శకంలో ఉన్న మనం ప్రపంచంలో మారుతున్న ధోరణులను అర్థం చేసుకోవలసిన అవసరం ఉందన్నారు. పోటీతత్త్వం పెరుగుతుండటాన్ని అవగాహన చేసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో భారతదేశం ప్రపంచంలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. తమ చుట్టూ ఉన్నవారి సమస్యలకు సృజనాత్మక పరిష్కారాల గురించి యువత ఆలోచించాలన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *