రెప్పపాటులో రెండు ప్రాణాలు

అత్యంత వేగంతో డివైడర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం
అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు యువకులు
మద్యం మత్తు, శిరస్త్రాణం ధరించకపోవడంతో దుర్ఘటన
ప్రాణాలు పోతున్నా.. మారని యువత
వాయువేగంతో వాహనం నడపడం… స్వీయ జాగ్రత్తలు తీసుకోకపోవడం.. మద్యం మత్తులో బైకులను రంకెలేయుస్తుండటం ఫలితంగా ఏటా వందల మంది యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. వాహనం నడిపేందుకు తగిన వయసు లేకుండానే కొందరు, చోదక అనుమతి లేకుండానే మరికొందరు, మద్యం మత్తులో ఇంకొందరు రహదారులపై అదుపులేని వేగంతో బైక్‌లు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత మొదలు వేకువజాము వరకూ నిర్మానుష్యంగా ఉండే రహదారులపై దూసుకెళ్తూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ఒక్కగానొక్క కొడుకనో, తోటి మిత్రులందరూ బైక్‌ నడుపుతున్నారు…తాను నడుపుతానని మారం చేస్తున్నాడనో, గారాబం కొద్దో తగిన వయసు రాకుండానే అత్యధిక సామర్థ్యం గల వాహనాలను పిల్లల చేతికిస్తున్నారు. పిల్లలు ప్రమాదాల బారిన పడుతున్నారు. విజయవాడలో ఆదివారం వేకువజామున ప్రమాదానికి గురైన సెకన్ల వ్యవధిలోనే ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉదంతం యువతరానికి, వారి తల్లిదండ్రులకు అనేక పాఠాలు చెబుతోంది.

రెండే సెకన్లు… రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఇద్దరు యువకుల ప్రాణాలను బలిగొంది. వాయు వేగం, ఆపైన శిరస్త్రాణం ధరించకపోవడం ఫలితంగా కళ్లుమూసి తెరిచేలోపే ఆ ఇద్దరు స్నేహితులు విగత జీవులుగా మారారు. విజయవాడలో ఆదివారం వేకువజామున జరిగిన ఈ ఘటన కిక్కు కోసం అత్యంత వేగంతో బైకులు నడుపుతూ యువత ఎలా ప్రాణాలు మీదకు తెచ్చుకుంటుందో చెప్పేందుకు సజీవసాక్ష్యంగా నిలుస్తోంది.
ఓ దుర్ఘటన నాలుగు పాఠాలు
బైక్‌ వేగం అదుపులో లేకపోతే: బైక్‌ నడిపేటప్పుడు నియంత్రించగలిగేంత వేగంలోనే నడపాలి. అలా చేస్తే ప్రమాదం ముంచుకొస్తుందని తెలిస్తే క్షణాల్లో అప్రమత్తమై బయటపడొచ్చు. అదే అపరిమిత వేగంతో వెళ్తే ప్రమాదం బారిన పడతామని గుర్తించినా, బ్రేకులు వేసే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. రెప్పపాటులో ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ప్రమాదం జరిగే అవకాశం ఉందని కళ్లతో గమనించి కాళ్లతో బ్రేకులు వేసేందుకు 3 సెకన్లు సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. వాహన వేగం గంటకు 100 కి.మీ వేగంతో ఉంటే సెకను 27.5 మీటర్ల దూరం వెళ్తుంది. ప్రమాదం జరుగుతుందని వూహించి వెంటనే బ్రేకులు వేసినా అప్పటికే వాహనం 80 మీటర్ల దూరాన్ని దాటేస్తుంది. ఈ రెప్పపాటులో ప్రమాదం జరిగిపోతుంది. హృతిక్‌, యశ్వంత్‌లు గంటకు 140 కి.మీ వేగంతో వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అంటే వాళ్లు ప్రమాదాన్ని వూహించే లోపే ప్రాణాలు కోల్పోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *