లంచం ఇచ్చుకోలేక రైతు ఆత్మహత్యాయత్నం

రాజమహేంద్రవరం ముచ్చట్లు :

భూమి ఆన్‌లైన్‌ చేసేందుకు అధికారులకు లంచం ఇచ్చుకోలేక ఓ రైతు పురుగులమందు తాగేందుకు ప్రయత్నించిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా కడియంలో సోమవారం చోటుచేసుకుంది. కడియానికి చెందిన రైతు కామిశెట్టి వెంకటేష్‌కు మూడెకరాల భూమి ఉంది. ఆ భూమిని వారసులంతా సమానంగా పంచుకోవాల్సి ఉంది. అందులో 10 సెంట్ల భూమి ఆన్‌లైన్‌ కాకపోవడంతో ఆస్తి పంపకాలు నిలిచిపోయాయి. ఏడాదిన్నర క్రితం వెంకటేష్‌ ఈ-సేవలో ఆన్‌లైన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 10 సెంట్ల భూమి మూడు ఎకరాలకు ముడిపడి ఉండటంతో రెవెన్యూ అధికారులు రూ.50 వేలు లంచం డిమాండ్‌ చేశారు. రైతుకు మద్దతుగా స్థానిక నాయకులు, రైతులు తహశీల్దార్‌ కార్యాలయం వద్దకు వచ్చి నిలదీశారు.అధికారులు ఆ ఫైల్‌ మాయమైందని, ఫైలు కన్పించడంలేదని సమాధానం చెప్పడంతో మనస్తాపం చెందిన వెంకటేష్‌ తనతోపాటు తెచ్చుకున్న పురుగుల మందును తాగేందుకు యత్నించాడు. గమనించిన రైతులు డబ్బాను లాక్కుని వారించారు. తన 10 సెంట్ల భూమి ఆన్‌లైన్‌ చేయకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *