వరంగల్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుతాం : సీఎం కేసీఆర్

పారిశ్రామిక, వ్యవసాయ, విద్యా రంగంలో వరంగల్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపనం చేయడం సంతోషకరంగా ఉందన్న సీఎం.. ఈ పార్క్ ఏర్పాటుతో లక్ష మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. వచ్చే ఆగస్టు లోపు వరంగల్‌కు కాళేశ్వరం నీళ్లు రాబోతున్నాయి. కాళేశ్వరం నీళ్లతో రైతులు బంగారం పండించ వచ్చని సీఎం అన్నారు. త్వరలోనే వరంగల్.. బంగారు వరంగల్ అవుతుందన్నారు. ఆ తర్వాతే బంగారు తెలంగాణ అవుతుందని సీఎం వ్యాఖ్యానించారు.

వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు.

వరంగల్ జిల్లా ప్రజలను అభినందిస్తున్నా
భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్క్‌కు శంకుస్థాపన చేయించుకున్నందుకు మీ అందరిని అభినందిస్తున్నానని సీఎం చెప్పారు. తెలంగాణ ఉద్యమం జరిగే రోజుల్లో మన వరంగల్ చుట్టుపక్కల ఉండే వర్ధన్నపేట, పరకాలతో పాటు ఇతర నియోజకవర్గాల ప్రజలు సోలాపూర్, భీవండి, సూరత్‌తో పాటు పలు ప్రాంతాలకు వెళ్లారని గుర్తు చేశారు. అక్కడికి వలస వెళ్లిన వారు కూడా టీఆర్‌ఎస్‌కు మద్దతిస్తూ.. ఉద్యమం చేశారు. ఉద్యమ సమయంలో వారిని పిలిచి మాట్లాడటం జరిగింది. అజంజాహీ మిల్లు మూతబడింది కాబట్టి అక్కడికి వలస వెళ్లినమని చెప్పారు. అజంజాహీ మిల్లును తలదన్నేలా వరంగల్ జిల్లాలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ రాబోతుందని ఆనాడే చెప్పాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.

అంతర్జాతీయ ప్రామాణిక దుస్తుల ఉత్పత్తి
కాకతీయ టెక్స్‌టైల్ పార్క్‌లో అంతర్జాతీయ ప్రామాణిక దుస్తుల ఉత్పత్తి జరుగుతదని సీఎం పేర్కొన్నారు. సూరత్‌లో మహిళలు ధరించే వస్ర్తాలు తయారు చేస్తారు. తమిళనాడులో అండర్ గార్మెంట్స్, షోలాపూర్‌లో దుప్పట్లు, రగ్గులు తయారు చేస్తారు. సూరత్, షోలాపూర్, తమిళనాడు కలయికే వరంగల్ టెక్స్‌టైల్ పార్క్ అని సీఎం స్పష్టం చేశారు. ఈ పార్క్‌లో అన్ని రకాల దుస్తులను తయారు చేస్తారని తెలిపారు. పత్తి నుంచి మనం వేసుకునే బట్టల వరకు వరంగల్‌లోనే తయారు అవుతాయని తెలిపారు.

లక్ష మందికి పైగా ఉపాధి
కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుతో లక్ష మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ ఒక్క రోజే 22 సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. పారిశ్రామికవేత్తలు రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం సంతోషాన్నిస్తుందన్నారు. ఈ ఒప్పందాల వల్ల 3,900 కోట్ల రూపాయాల పెట్టబుడులు రానున్నాయని తెలిపారు సీఎం. ఈ రోజు జరిగిన ఒప్పందాలతో 27 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి, 50 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. ఇతర రాష్ర్టాల్లో ఉన్న మన నేతన్నలు.. తిరిగి రాష్ర్టానికి రావాలని కోరుతున్నానని పేర్కొన్నారు. భూములు కోల్పోయిన ప్రతీ ఒక్కరికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉందన్నారు. నిర్వాసితులకు ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామన్నారు.

టీఎస్ ఐపాస్ ద్వారా అద్భుతం జరిగింది
స్వర్గీయ జయశంకర్ సార్, తాను కలిసి తెలంగాణ ధనిక రాష్ట్రమైతది అని పలు సభల్లో చెప్పామని సీఎం గుర్తు చేశారు. ఆనాడు చెప్పిన విధంగానే తెలంగాణ ఇప్పుడు ధనిక రాష్ట్రమైందని స్పష్టం చేశారు. టీఎస్‌ఐపాస్ ద్వారా ఇవాళ ఒక అద్భుతం జరిగింది. పదిహేను రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామన్నారు. 5,017 పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. అవినీతికి తావు లేకుండా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామన్నారు. ఇప్పటి వరకు టీఎస్‌ఐపాస్ విధానం ద్వారా ఒక లక్షా ఏడు వేల కోట్ల పెట్టుబుడులు వచ్చాయి. కొత్త రాష్ట్రమైనప్పటికీ అభివృద్ధిలో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం, అధికారులు చిత్తశుద్ధితో పని చేయడం వలన ఇదంతా సాధ్యమవుతుందన్నారు సీఎం కేసీఆర్.

రాబోయే రోజుల్లో అద్భుతాలు చూస్తారు
వరంగల్ రూరల్‌లో టెక్స్‌టైల్ పార్క్‌ను అద్భుతంగా నిర్మించుకోబోతున్నాం. అజంజాహీ మిల్లును తలదన్నేలా ఉంటుందన్నారు. రంగారెడ్డి జిల్లాలో ప్రపంచమే ఆశ్యర్యపోయే విధంగా పార్మా సిటీ రాబోతుందన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతాలు జరుగుతాయన్నారు. త్వరలోనే మామునూరు ఎయిర్‌పోర్టును తయారు చేస్తామన్నారు. టెక్స్‌టైల్ పార్క్‌కు కాజీపేట జంక్షన్ కలిసొచ్చే అంశమన్నారు. వరంగల్ నుంచి దేశంలో ఎక్కడికైనా రైలు ద్వారా ప్రయాణం చేయొచ్చని సీఎం పేర్కొన్నారు. వందశాతం అద్భుతంగా కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ రూపుదిద్దుకోబోతుందన్నారు.

సంక్షేమంలో తెలంగాణ నెంబర్ వన్
దేశంలో ఎక్కడా లేని విధంగా 50 అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు సీఎం కేసీఆర్. కేసీఆర్ కిట్స్‌ను ప్రజలు బాగా ఆదరిస్తున్నారని తెలిపారు. గర్భిణులకు 12 వేల రూపాయాలు అందిస్తున్న విషయం మీకు తెలుసు. పశువుల కోసం సంచార వైద్యశాలలు ఏర్పాటు చేశాం. ఆటోలకు, వ్యవసాయ ట్రాక్టర్లకు పన్నుమాఫీ చేసిన రాష్ట్రం తెలంగాణ మాత్రమే. పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అమలు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం 504 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశాం. నిరుపేద విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్ ఇస్తున్నాం. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నాం. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి.. అసంఘటిత రంగంలో ఉన్న రైతులను సంఘటిత పరిచే విధంగా రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. భూరికార్డుల ప్రక్షాళన చాలా విజయవంతంగా జరుగుతుందని సీఎం స్పష్టం చేశారు.
Tags: CM KCR , FOUNDATION STONE , KAKATIYA MEGA TEXTILE PARK , TEXTILE PARK , KTR , TELANGANA , WARANGAL ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *