విభిన్న పంథాలో జనసేన ముందుకు…

హైదరాబాద్ ముచ్చట్లు:

విభిన్న పంధాలో జనసేన నేతలు ముందుకు వెళ్తున్నారా?.. 2019కి ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నా?… పవన్ ప్లాన్స్ ఏంటి?.. వరుస సమావేశాలు ఏం చెబుతున్నాయి. బాధ్యతాయుతమైన రాజకీయం అంటూ జనసేనతో పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టారు పవన్. ఇందుకోసం మొదటి నుంచే విభిన్న పంథాలో ముందుకు వెళ్తున్నారు. విమర్శల విషయంలోనూ, సమస్యల పరిష్కారంలోనూ తనదైన మార్కు చూపిస్తున్నారు. అభిమానులకు అదే చెబుతున్నారు. మానవత్వమే మతంగా, సమాజ హితమే అభిమతంగా ముందుకు వెళ్లాలని అంటున్నారు.భావితరాల భవిష్యత్‌కు విశాల దృక్పథం కలిగిన రాజకీయాలు చాలా అవసరమని చెబుతున్నారు. 2019లో వచ్చే ఎన్నికలకు రెడీ అవుతోంది జనసేన.రెండు రాష్ట్రాల్లోనూ బరిలో దిగేందుకు ప్రణాళికలు రచిస్తోంది. తాను అనంతపురంలో నుంచి బరిలో దిగనున్నట్లు ప్రకటించారు పవన్. ఇందుకు తగ్గట్లుగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటాలని భావిస్తున్న జనసేన ఆ దిశగా తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇన్నాళ్లూ స్తబ్దుగా ఉన్న పార్టీ కార్యక్రమాలను పరుగులు పెట్టించడానికి రెడీ అవుతోంది.ఇందులో భాగంగానే అన్ని జిల్లాల్లో పార్టీ ఆఫీసుల ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు పవన్. హైదరాబాద్, అమరావతిలో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు జనసేనాని. దీంతో పాటు జిల్లాల్లోనూ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. అమరావతి, హైదరాబాద్‌లో నిర్మించే రాష్ట్ర కార్యాలయాల నిర్మాణం 5 ఎకరాల్లో చేపట్టనున్నారు. జిల్లాల్లో రెండెకరాల్లో పార్టీ ఆఫీసులు ఉండేలా నిర్మించాలని భావిస్తున్నారు. తెలంగాణలో మొదట ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పార్టీ ఆఫీసులు ఏర్పాటు చేసి ఆ తరువాత కొత్త జిల్లాలకు విస్తరించనున్నారు. మేధావులు, అభివృద్ధిని కోరుకునే వారు చర్చలు జరిపేందుకు వీటిలో వసతులు కల్పించనున్నట్లు తెలిపారు.ఆఫీసుల ఏర్పాటుకు పార్టీలో ఇద్దరు ముఖ్యులకు బాధ్యత అప్పగించారు పవన్. వీలైనంత త్వరగా ఆఫీసులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తాజాగా హైదరాబాద్‌లో మార్పులు చేసిన పార్టీ కార్యాలయాన్ని పవన్ ప్రారంభించారు. పార్టీ నిర్మాణంలోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు పవన్. ప్రజారాజ్యం నేర్పిన పాఠాలతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులను హడావుడిగా చేర్చుకోవడం లేదు. పార్టీ నేతల ఎంపికలోనూ ప్రత్యేక పద్దతిని ఫాలో అవుతున్నారు. ఇందులో భాగంగానే జనసైనికుల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ప్రతీ జిల్లాలో ప్రత్యేక శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశారు. జనసేన లక్ష్యాలేంటో వారికి వివరించారు.ప్రజాసమస్యలే పరమావధిగా ముందుకు వెళ్లాలని వారికి సూచించారు. ఇప్పటికే శతఘ్ని పేరుతో సోషల్ మీడియా బృందం చురుగ్గా పనిచేస్తోంది. పవన్ కళ్యాణ్ ఆలోచనలను, పార్టీ విధివిధానాలను తరచూ వెల్లడిస్తున్నారు. పార్టీ తరపున నిలబెట్టే అభ్యర్థులు గెలవాలంటే కేవలం అభిమానులు ఉంటే సరిపోదని పార్టీ నిర్మాణం కూడా అవసరమని భావిస్తున్నారు. అందుకే జనసేన సంస్థాగతంగా పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టారు. మరోవైపు 2019 ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో పార్టీ నిర్మాణం పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు.సంస్థాగతంగా జనసేనను బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం రెండు రాష్ట్రాల పర్యటనకు కూడా సిద్ధమవుతున్నారు పవన్. మరోవైపు త్వరలో పార్టీ ప్లీనరీని నిర్వహించాలని నిర్ణయించారు జనసేనాని. తెలుగు రాష్ట్రాల్లో ప్లీనరీ సమావేశాన్ని విడివిడిగా నిర్వహించాలని సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా సభ్యత్వ నమోదు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *