వై సిపిలో విభేదాలు, పార్టీ ఆఫీస్‌లో ఫర్నీచర్ ధ్వంసం..

అనంతపురం ముచ్చట్లు

అనంతపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది.వైసిపి ఎంపీ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం వైసిపి కార్యాలయంలో సోమవారం సమావేశం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుర్నాథ్ రెడ్డికి కాకుండా కొత్తగా వచ్చిన వారికి పార్టీ ప్రాధాన్యం ఇస్తోందని కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.గుర్నాథ్ రెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.అంతేకాదు, ఎంపి మిథున్ రెడ్డి సమక్షంలోనే పార్టీలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. తమ నాయకుడికి పార్టీలో అన్యాయం జరుగుతోందని వారు అధిష్టానాన్ని నిలదీసే ప్రయత్నం చేశారు.గుర్నాథ్ రెడ్డికి ప్రాదాన్యత ఇవ్వడం లేదని ఆయన వర్గం ఆందోళనకు దిగడంతో ఎంపీ మిథున్ రెడ్డి వర్గం, గుర్నాథ్ రెడ్డి వర్గాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటు చేసుకుంది. ఈ కారణంగా ఫర్నీచర్ ధ్వంసం చేశారు. గుర్నాథ్ రెడ్డి టిడిపిలో చేరే అవకాశాలున్నాయనే ప్రచారం గత కొద్ది రోజులుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో గుర్నాథ్‌కు పార్టీలో ప్రాధాన్యత లేదని ఆయన వర్గం ఎంపీ మిథున్ రెడ్డి ఎదుట ఆందోళన చేయడం చర్చకు తావిస్తోంది. ఇది టిడిపిలో చేరేందుకు సంకేతమా అనే చర్చ సాగుతోంది. ఇతరులకు ప్రాధాన్యత ఇస్తున్నారని అధినేతపై గుర్నాథ్ రెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *