సంచారుల జీవితాల్లో వెలుగే లక్ష్యం

బతికున్నా.. వాళ్లకంటూ గుర్తింపు లేని కులస్థులు సంచారులని.. నేటి సమాజంలో సామాజిక అనాథలుగా కష్టాలు అనుభవిస్తున్నారంటూ.. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, సంచారి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు దాసరి శ్రీనివాసులు అన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న ‘స్కిట్‌’ ఇంజినీరింగ్‌ కళాశాల ఆవరణలో శనివారం సంచారుల అభ్యున్నతి కోసం గంగిరెద్దుల, బుడబుక్కల, పూసల, హరిదాసులు, ఎరుకలసాని తదితర కులాల యువతీ, యువకులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రారంభోపన్యాసంలో ఆయన మాట్లాడుతూ.. పురాతన కాలం నుంచి.. వారి కట్టుబాట్లు, మన సంస్కృతి, సంప్రదాయాలను రక్షించుకుంటూ.. ఇప్పటికి పౌరసత్వం లేని పౌరులుగా ఈ సంచార జాతులు జీవితాన్ని నెట్టుకుంటూ వస్తున్నాయన్నారు. వీళ్ల జీవితాల్లో వెలుగులు నింపుతామని వచ్చే ప్రభుత్వాలు.. వాగ్దానాలతో వాళ్ల పుణ్యకాలం గడిపి వెళ్తున్నాయే తప్ప.. వారి వెంట నిలబడి.. వీళ్ల కష్టాలను పరిష్కరించేందుకు ముందుకు రాలేకపోతున్నాయని తెలిపారు. దేశ వ్యాప్తంగా 198 జాతులుంటే.. ఒక్క ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 28 సంచార కులాలున్నాయన్నారు. వీరిలో అత్యుత్తుమ డిగ్రీలు పొందిన విద్యార్థులు, నిరుద్యోగులు సరైన గుర్తింపు రాక, ఉపాధి అవకాశాలు లభించక బిచ్చం ఎత్తుకుని జీవితాన్ని గడుపుకోవాల్సి వస్తోందన్నారు. సంచార జీవితాల్లో వెలుగులు నింపి.. వాళ్లకు తగిన గుర్తింపును తీసుకువచ్చేందుకు 2012లో సంచారీ సంక్షేమ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రధానంగా ఉన్నత చదువులు చదివి నిరుద్యోగులుగా ఉన్న యువతీ, యువకులకు ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాల కల్పన, ప్రస్తుతం ప్రభుత్వ పరంగా ఉన్న పథకాలు తదితర వాటిపై వీరిని చైతన్యవంతులను చేయడం సంస్థ లక్ష్యంగా చేసుకుందని పేర్కొన్నారు. తితిదే తరఫున ఎరుకులసాని కులాలకు, శ్రీశైలం తరఫున చెంచులకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశమై ఆయా ఆలయాల అధికారులతో చర్చించినట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన జనధన్‌ బీమా యోజనపై వీళ్లకు అవగాహన కల్పించడం, బ్యాంకుల సహకారంతో వీరి జీవితాల్లో వెలుగులు తీసుకురావాలన్నది తమ సంస్థ ప్రధాన లక్ష్యమన్నారు. తను ఐఏఎస్‌ విద్యను అభ్యసించి ప్రజాసేవ కోసం ఎంతో ప్రయత్నించానని, ముప్పై ఏళ్లు ఉద్యోగం చేస్తే ఇరవై శాఖలకు తనను బదిలీ చేశారన్నారు. అందుకే ప్రభుత్వ పరంగా ఉంటే సాయం చేయలేమని, ప్రస్తుతం ఉన్న సమయమంతా వెచ్చించి సామాజిక అనాథలైన వాళ్ల జీవితాలకు ఓ గుర్తింపు తీసుకురావాలన్న లక్ష్యంతో శ్రమిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా.. పలు సంచారీ కులాలు వాళ్ల వృత్తులకు తగ్గట్టుగా ప్రదర్శనలు చేసి సభికులను ఆకట్టుకున్నారు. జబర్దస్‌ బుల్లితెర నటుడు హరి తన ప్రసంగంలో సంచారీల జీవితాల దుర్భర పరిస్థితిని వివరించారు. కోటయ్య బృందాల నృత్యాలు, పలువురు కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేకంగా నిలిచాయి. సమావేశంలో ఆచార్యులు సుందరమూర్తి, భరత్‌, శ్రీశుకబ్రహ్మాశ్రమ మేనేజరు ఈశ్వర్‌, ముక్కంటి ఆలయ మాజీ పాలకమండలి అధ్యక్షులు శాంతారాం జె.పవార్‌, కోలా ఆనంద్‌, కళాశాల ప్రిన్సిపల్‌ సుధాకర్‌రెడ్డి, అరవింద్‌రెడ్డి, సుబ్రహ్మణ్యంరెడ్డి, రాజు, కిషోర్‌, రమేష్‌, రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *