సినిమా హాళ్లలో జాతీయ గీతం.. పునరాలోచనలో సుప్రీం!

న్యూఢిల్లీ ముచ్చట్లు

సినిమా హాళ్లలో జాతీయ గీతం తప్పనిసరి అని, ఆ సమయంలో ప్రతి ఒక్కరూ లేచి నిలబడాలన్న గతేడాది తీర్పును పునఃసమీక్షించడానికి సుప్రీంకోర్టు సంసిద్ధత వ్యక్తంచేసింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపింది. మోరల్ పోలీసింగ్‌కు ఫుల్‌స్టాప్ పడాల్సిందేనని, ప్రతి ఒక్కరూ ఎప్పుడూ తమ భుజాలపై దేశభక్తిని మోయాల్సిన అవసరం లేదని ఈ బెంచ్ అభిప్రాయపడింది. థియేటర్లలో జాతీయ గీతం పాడనంత మాత్రాన వాళ్లు జాతి వ్యతిరేకులు కారని సుప్రీం ధర్మాసనం స్పష్టంచేసింది. జాతీయ గీతం సమయంలో అందరూ కచ్చితంగా లేచి నిలబడాలని అనుకున్నపుడు ఎందుకు దాని కోసం ప్రత్యేకంగా నిబంధనలను రూపొందించరు అని సుప్రీం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.గతేడాది నవంబర్‌లో సినిమా హాళ్లలో జాతీయ గీతంపై సుప్రీం ఇచ్చిన తీర్పుపై జస్టిస్ డీవై చంద్రచూడ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ తీర్పును ఉల్లంఘిస్తే జాతి వ్యతిరేకులుగా ముద్ర వేస్తారని ప్రజలు భయపడుతున్నారు. వాళ్లు సినిమా హాళ్లకు వచ్చేది కేవలం వినోదం కోసమే. వాళ్లకు అదే కావాలి.మోరల్ పోలీసింగ్ కాదు అని చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ప్రతి థియేటర్‌లో సినిమా మొదలయ్యే ముందు జాతీయ గీతం వేయాలని, ప్రేక్షకులంతా లేచి నిలబడాల్సిందే అని గతేడాది సుప్రీం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అంగ వైకల్యం ఉన్నవారిని ఇందులోంచి మినహాయిస్తూ తమ తీర్పును కాస్త సవరించింది. ఇప్పుడు థియేటర్లలో జాతీయ గీతంపై కొత్తగా ఆర్డర్ ఇవ్వాలా వద్దా అన్నదానిపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సమాధానం ఇవ్వాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *