హైదరాబాద్ అలర్ట్ : జామ్.. జామ్.. జామ్..!!

సోమవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ నగరవాసులు నరకం చవిచూశారు. రహదారులన్నీ ట్రాఫిక్ జామ్ లతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రహదారులపై ఎక్కడికక్కడ నీరు చేరిపోవడంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయ్యింది. రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ.. సహాయ కార్యక్రమాలు మొదలుపెట్టిన కొద్దిసేపటికే వాతావరణ శాఖ నుంచి మరో హెచ్చరిక జారీ అయింది. రానున్న మరికొద్ది గంటలూ ప్రజలు, యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని సూచించింది.

మియాపూర్, కూకట్ పల్లి, దిల్ సుఖ్ నగర్, హయత్ నగర్, నాగోల్, మలక్ పేట్ లతో పాటు నగరంలోని ప్రధాన రహదారులన్నీ ట్రాఫిక్ జామ్ తో నిండిపోయాయి. రహదారులపై చేరిన నీటిని తొలగించడానికి కనీసంగా మరో మూడు గంటల సమయం పట్టే అవకాశాలున్నందున అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. భారీ నీటి వరద వస్తున్న కారణంగా మొజాంజాహీ నుంచి బేగంబజార్ వైపునకు వచ్చే వాహనాలను పూర్తిగా మళ్లించాలని అధికారులను ఆదేశించారు.

ఆస్మాన్ గఢ్, చార్మినార్, బేగంబజార్, అత్తాపూర్, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా విద్యుత్ స్తంభాలపై చెట్లు కూలాయి. రహదారులపై పడిన విద్యుత్ వైర్లను తాకరాదని సీఎండీ రఘుమారెడ్డి హెచ్చరించారు. విద్యుత్ డిసాస్టర్ మేనేజ్ మెంట్ బృందాలు రంగంలోకి దిగాయని, తెగిపడిన విద్యుత్ వైర్లను తొలగించే పనిలో నిమగ్నమయ్యారని ఆయన తెలిపారు.విద్యుత్ ఫిర్యాదుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *