హైస్పీడ్‌ ట్రైన్‌లో కేటీఆర్‌!

On the high speed KTX train from Seoul to Daegu, tweets ktr - Sakshi

16/1/2018 సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు మంత్రి కేటీఆర్‌ ప్రస్తుతం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన సియోల్‌ నుంచి డ్యాగు పట్టణానికి హైస్పీడ్‌ ట్రెయిన్‌లో పర్యటించారు. భారత్‌లోని టైయిర్‌ 2 పట్టణాలు ప్రధాన నగరాలతో అనుసంధానం కావాలంటే.. వాటి మధ్య దూరాన్ని త్వరగా తగ్గించేలా గంటకు 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించే, వైఫై అనుసంధానిత హైస్పీడ్‌ రైళ్లు రావాల్సిన ఆవశ్యకత ఉందని కేటీఆర్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  హైస్పీడ్‌ ట్రెయిన్‌లో మంత్రి కేటీఆర్‌తోపాటు  ప్రభుత్వ సలహాదారు వివేక్, ఇతర అధికారుల బృందం ఉంది.

కేటీఎక్స్‌ హైస్పీడ్‌ ట్రెయిన్‌ ప్రత్యేకతలివే..
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌-డ్యాగు పట్టణం మధ్య ఈ హైస్పీడ్‌ రైలు నడుస్తుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం 417.5 కిలోమీటర్లు. గంటకు సుమారు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కొరియన్‌ ట్రెయిన్‌ ఎక్స్‌ప్రెస్‌ (కేటీఎక్స్‌)కు చెందిన హైస్పీడ్‌ ట్రెయిన్‌.. రెండు గంటల పది నిమిషాల్లో వ్యవధిలోనే గమ్యానికి చేరుకుంటుంది.

కాకతీయ మెగా టెక్స్ట్‌టైల్‌ పార్కులో పెట్టుబడులు
తెలంగాణలో చేపడుతున్న పారిశ్రామిక అనుకూల చర్యలు దక్షిణ కొరియా పెట్టుబడిదారులకు వివరించామని, ముఖ్యంగా వరంగల్‌లో చేపడుతున్న కాకతీయ మెగాటెక్స్ట్‌టైల్‌ పార్కులో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించామని కేటీఆర్‌ ట్విట్టర్‌లో తెలిపారు. వస్త్ర తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు కాకతీయ మెగాటెక్స్ట్‌టైల్‌ పార్కు ఆదర్శనీయమైన గమ్యస్థలమని వివరించినట్టు వెల్లడించారు. అలాగే డ్యాగు పట్టణంలోని వ్యాపార ప్రతినిధులతోనూ భేటీ అయి.. పెట్టుబడుల విషయమై చర్చించినట్టు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *