Date:16/04/2018
రాజమండ్రి ముచ్చట్లు:
ఎండా, వాన తేడా లేకుండా సైకిళ్లు, తోపుడుబండ్లు, బుట్టలతో రోడ్లపై నిలబడి పండ్లు, ఇతర తినుబండారాలు అమ్ముకుని బతికే బుడుగ జీవులను రాజమహేంద్రవరం కార్పొరేషన్లో ఆశీలు వసూళ్ల విషయంలో కాంట్రాక్టర్లదే ఇష్టా రాజ్యంగా మారుతోంది. అంతకు ముందు ఏడాదిలో రూ.15, ప్రస్తుతం రూ.30 తీసుకుంటున్నారంటూ కాంట్రాక్టర్లు ఇచ్చిన టోకెన్లు చూపిస్తున్నారు. మార్కెట్లలో సైకిల్, మోటారు సైకిల్‌పై వ్యాపారాలు చేసుకునే వారి వద్ద గతేడాది నగర పాలక సంస్థ నిర్ణయించిన రూ.2కు బదులుగా 10 రెట్లు పెంచి రూ. 20 వసూలు చేశారు. ఒక సైకిల్ వ్యాపారి వద్ద రోజుకు రూ.2 లెక్కన నెలకు రూ. 60 వసూలు చేయాలి. కానీ పది రెట్లు పెంచి రోజుకు రూ. 20 లెక్కన నెలకు రూ.600 వసూలు చేశారు. ఇలా ఏడాదికి రూ.720 బదులు బడుగు జీవుల వద్ద రూ. 7,200 దోచుకున్నారు. ఇలా కాంట్రాక్టర్లు అడ్డుగోలు వసూళ్లకు పాల్పడుతున్నా నగర పాలక సంస్థ రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నగరంలో ఉన్న ఏడు మార్కెట్లలో ఆశీలు వసూలు చేసుకునే హక్కును వేలంపాట ద్వారా ప్రతి ఏడాదీ నలుగురు కాంట్రాక్టర్లే చేజిక్కించుకుంటున్నారు. గత ఏడాది జాంపేట మార్కెట్లో హక్కును చందర్రావు అనే కాంట్రాక్టర్ వేలంలో దక్కించుకున్నారు. మార్కెట్ నిర్వహణ, స్వీపర్ చార్జీలతో కలిపి సుమారు రూ.13.5 లక్షలు నగరపాలక సంస్థకు చెల్లించారు. ఆశీల రేట్లు 11 ఏళ్ల తరువాత ప్రస్తుతం నాలుగు రెట్లు పెంచారు. ఈ ఏడాది జాంపేట మార్కెట్లో ఆశీల వసూలు చేసుకునే టెండర్‌ను డి.శ్రీనివాస్ అనే వ్యక్తి రూ.41 లక్షలకు దక్కించుకున్నారు. చందర్రావు కూడా పాటలో పాల్గొన్నా తృటిలో చేజారింది. అతనికి కంబాల చెరువు వద్ద ఉన్న మునికుట్ల అచ్యుతరామయ్య మార్కెట్లో కాంట్రాక్ట్ వచ్చింది. వీరితోపాటు మరో ఇద్దరు కాంట్రాక్టులను వేరొకరికి వెళ్లకుండా గత కొన్నేళ్లుగా జాగ్రత్తపడుతున్నారు. గత ఏడాదితోపాటు అంతకు ముందు ఏడాది కూడా ఆశీల కాంట్రాక్టర్లు రోడ్డుపై వ్యాపారులు చేసుకునే బడుగు జీవులను అడ్డంగా దోచేస్తున్నారన్న విమర్శలున్నాయి. నగరపాలక సంస్థ పేర్కొన్న గెజిట్ ప్రకారం కాకుండా ఇష్టారీతిన వసూళ్లు చేశారు. గత ఏడాది గెజిట్ ప్రకారం నగరంలోని గౌతమీ ఘాట్ వద్ద ఉన్న హోల్‌సేల్ అరటిపళ్ల మార్కెట్లో సైకిల్‌కు రూ.5, మిగిలిన జాంపేట, సెంట్రల్ కూరగాయల మార్కెట్, ఆల్కట్తోట మార్కెట్, నాగులచెరువు మార్కెట్లలో సైకిల్‌పై వ్యాపారాలు చేసుకునే వారి వద్ద రోజు వారీ రూ.2 ఆశీలు వసూలు చేయాలి…కానీ కాంట్రాక్టర్లు రూ.20 వసూలు చేశారు. ఇలా తోపుడు బండ్లు, బుట్టలలో పండ్లు, ఇతర తినుబండారాలు తెచ్చి అమ్ముకునే వారి వద్ద వసూలు చేశారు. చెప్పిన మేర కట్టకుంటే వ్యాపారాలు చేసుకోనివ్వకపోవడంతో కట్టామని వ్యాపారులు వాపోతున్నారు. ఇదే విషయం నగరపాలక సంస్థ అధికారులు కూడా వచ్చి చెప్పడంతో చెల్లించామని పేర్కొంటున్నారు.అంతేగాకుండా కాంట్రాక్టర్ల వద్ద నెలవారీ మామూళ్లు తీసుకుని చూసీచూడనట్లు ఉన్నారని ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా రెవెన్యూ అధికారులు మార్కెట్లోకి వచ్చి కాంట్రాక్టర్లు చెప్పే రేట్లు సరైనవేనని చెప్పడం గమనార్హం. ఒక్కొక్క సైకిల్ వ్యాపారి వద్ద ఏడాదికి రూ.720 బదులు అదనంగా రూ.6,480 వసూలు చేశారు. ఇలా వందలాది మంది చిరు వ్యాపారుల పొట్టగొట్టారు. ఉదాహరణకు జాంపేట మార్కెట్ బయట రోడ్డుపై రోజుకు దాదాపు 100 మంది సైకిల్, మోటారు సైకిల్, తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఒక్కొక్కరి వద్ద రూ.6,480 చొప్పున 100 మంది వద్ద ఏడాదికి రూ.6,48,000 అదనంగా వసూలు చేశారు. నగరంలోని మార్కెట్ల వద్ద రోడ్లపై చిరు వ్యాపారులు వేల సంఖ్యలో ఉంటారు. ఈ లెక్కన కాంట్రాక్టర్లు రూ. కోట్ల రూపాయలు బుడుగుజీవుల కష్టార్జితాన్ని దోచుకుంటున్నారని వాపోతున్నారు.
Tags: 100-fold increase in earnings