100 retail outlets for sale of tribal products

గిరిజన ఉత్పత్తుల అమ్మకాలకై 100 రిటైల్ షాపులు

జిసిసి ద్వారా ఈఏడాది 500కోట్ల రూ.ల వ్యాపార లక్ష్యం.
అరకు కాఫీకి ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నం.
జిసిసి ఉత్పత్తుల అమ్మకాల విభాగంలో 87మంది గిరిజన యువతకు ఉపాధి. సచివాలయంలో జిసిసి అరకు కాఫీ రిటైల్ షాపు ప్రారంభ
సాంఘిక,గిరిజన సంక్షేమంత్రి నక్కా ఆనందబాబు
Date:12/10/2018
అమరావతి ముచ్చట్లు:
రాష్ట్రంలో గిరిజన రైతుల స్వచ్ఛమైన సహజమైన ఉత్పత్తులను పట్టణ ప్రాంత వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ కూడళ్లు,ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలు,పర్యాటక ప్రాంతాలు తదితర చోట్ల 100 రిటైల్ షాపులను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర గిరిజన,సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు నక్కా ఆనంద బాబు వెల్లడించారు.ఈమేరకు శుక్రవారం అమరావతి సచివాలయంలోని మూడవ బ్లాకులో గిరిజన సహకార సంస్థ (జిసిసి)ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిటైల్ స్టాల్ ను మంత్రి ప్రారంభించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది గిరిజన సహకార సంస్థ ద్వారా వివిధ ఉత్పత్తుల విక్రయం ద్వారా 307కోట్ల రూ.ల వ్యాపారం చేయగా ఈఏడాది 500కోట్ల రూ.లు వ్యాపారం సాగించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని తెలిపారు.
గిరిజన రైతులు సేకరించే సహజమైన,స్వచ్ఛమైన వివిధ ఉత్పత్తులకు పెద్దఎత్తున మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించేందుకు పట్టణ ప్రాంతాల్లో 100 రిటైల్ షాపులను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల దిశానిర్దేశాలకు అనుగుణంగా గిరిజనుల ప్రకృతి సిద్ధమైన ఫల సాయాల అమ్మకాలకై ప్రాసెసింగ్,బ్రాండింగ్,మార్కెటింగ్ ప్రక్రియలపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని తెలిపారు.అరకు లోయ కాఫీ ఉత్పత్తులకు జాతీయ,అంతర్జాతీయ మార్కెట్లలో ప్రత్యేక గుర్తింపు సాధించేందుకు కృషి చేస్తున్నట్టు మంత్రి ఆనందబాబు మీడియాకు వివరించారు.విజయవాడ, శ్రీకాకుళం,ఏలూరు పట్టణాల్లోని రైతు బజారుల్లో ప్రత్యేక స్టాళ్ల ఏర్పాటు పూర్తికావచ్చిందని, విశాఖపట్నంలోని సెంట్రల్ పార్క్,పాడేరు గిరిజన ప్రాంతంలోని కొత్తపల్లి జలపాతం వద్ద స్టాళ్ల  ఏర్పాటు పూర్తికావచ్చిందని మంత్రి తెలిపారు.
విజయవాడ భవానీ ద్వీపంలో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.అలాగే న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్,శాస్త్రి భవన్,సుప్రీం కోర్టు,ఢిల్లీ నగరపాలక సంస్థ కార్యాలయాల్లోను,విజయవాడ విమానాశ్రయం, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయం,అలిపిరి శ్రీవారి మెట్లవద్ద,విశాఖ ఏజెన్సీలోని డుంబ్రిగూడ,లంబసింగి,బొర్రా గుహలు తదితర చోట్ల నూతన స్టాల్స్ పురోగతిలో ఉన్నాయని అన్నారు.అంతేగాక రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బాంబినో,మెప్మా సంస్థలకు చెందిన పెట్రోల్ బంకుల్లోను,రిటైల్ కౌంటర్లలో గిరిజన ఉత్పత్తులను అమ్మేందుకు ఒప్పందాలు చేసుకోవడం జరుగుతోందని తెలిపారు.
ఈవిధంగా రిటైల్ అమ్మకాలు చేసేందుకు అవకాశం కల్పించడం ద్వారా గిరిజన రైతుల అటవీ ఫలసాయాలకు,వ్యవసాయ,ఉద్యానవన పంటలకు సరైన మార్కెట్ ధరతోపాటు కొత్త ఉత్పత్తుల ద్వారా ఎక్కువ ఆదాయం పొందేందుకు వీలుకలుగుతుందని మంత్రి ఆనంద బాబు పేర్కొన్నారు.గిరిజన ఉత్పత్తుల రిటైల్ అమ్మకాల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ఇప్పటి వరకూ ఎంబిఏ,ఇతర పోస్టు గ్యాడ్యుయేట్ డిగ్రీల్లో ఉత్తీర్ణులైన సుమారు 87మంది స్థానిక గిరిజన యువతకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఉపాధి కల్పించడం జరిగిందని చెప్పారు.
త్వరలో గుంటూరు జిల్లా తాడేపల్లిలో జిసిసి ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్టు మంత్రి ఆనందబాబు తెలిపారు.ఇంకా ఈకార్యకమంలో సాంఘిక,గిరిజన సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్.రావత్, జిసిసి ఉపాధ్యక్షులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ టి.బాబురావు నాయుడు,మేనేజర్ పార్వతీశం తదితరులు పాల్గొన్నారు.
Tags:100 retail outlets for sale of tribal products

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *