Natyam ad

 29 వేలకు చేరిన మిర్చి.

మహబూబ్  నగర్ ముచ్చట్లు:
 
మిరప రైతాంగాన్ని వివిధ ప్రాంతాలలోని మార్కెట్లలో వివిధ రకాలుగా పలుకుతున్న ధరలు ఆశలు కలిగిస్తూ ఉత్సాహాన్ని నింపుతున్నాయి. రైతులకు 4 రోజుల క్రితం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో మేలైన మిరప క్వింటాలు ఒక్కంటికి 27 వేలు ధర లభించగా.. నిన్న వరంగల్ వ్యవసాయ మార్కెట్ లో అదే క్వింటా ఒక్కంటికి 29 వేలకు పెరగడం రైతుకు కలిసొచ్చిన అదృష్టంగా పేర్కొనవచ్చు. వివిధ రకాల మిర్చి పంటల సాగుకు పేరుగాంచిన తుంగతుర్తి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల రైతాంగం నేడు మిర్చి పంటకు వస్తున్న ధరలతో ఎన్నడూ లేనంతగా ఉత్సాహంతో ఉంటున్నారు. ప్రధానంగా నాగారం,తిరుమలగిరి, తుంగతుర్తి,మద్దిరాల మండలాల్లో తేజ రకం మిర్చి పంటల సాగు ఎక్కువగా ఉంటుంది. తుంగతుర్తి మండలంలో తేజకు తోడు వివిధ రకాల పచ్చళ్ళలో వాడుకునే దొబ్బ మిరప సాగుని రైతాంగం చేస్తుంది. అయితే గత ఏడాది తేజ రకం మిర్చి పంట క్వింటాలు ఒక్కంటికి 8 నుండి 12 వేల మధ్యలో ధర లభించి కేవలం వారిలో ఊరటను మాత్రమే కలిగించింది.అయితే ఈ ఏడాది ఎన్నో ఆశల మధ్య తేజ రకంతో పాటు దోబ్బ, వివిధ రకాల మిరపని సాగుచేశారు. పంట చేతికొచ్చే సమయంలోనే క్రిమిసంహారక మందులకు కూడా తగ్గని రీతుల్లో రోగాలు సోకి మిరప పంటను చాలావరకు దెబ్బతీసింది. దీనికితోడు ఇటీవల కురిసిన వర్షాలు తోడయ్యాయి. కాగా వీటన్నింటి నుండి కొద్ది గొప్పలో బయటపడ్డ మిరప పంటని రైతాంగం మద్దతు ధర కోసం తమ తమ గృహాల్లో దాచుకుంది. ఈ ఏడాది మొదట్లో మిర్చి పంట క్వింటాలు ఒక్కంటికి పదివేల రూపాయల లోపే ధర ఉండడంవల్ల కొంతమంది రైతులు అమ్ముకున్నారు. కాగా ఖమ్మం,వరంగల్, తదితర ప్రాంతాలలో గత వారం రోజులుగా మిర్చి పంటకు ఊహించని స్థాయిలో ధరలు వస్తున్న దృష్ట్యా తాము దాచుకున్న పంటను రైతులు బయటికి తీస్తున్నారు. పంటలో ఉన్న కొద్దిపాటి తాలు కాయను పక్కకు తీసి శుభ్రం చేసుకుంటున్నారు. ముఖ్యంగా గత నెల రోజుల్లో 10 నుండి 16 వేలకు చేరిన మిర్చి ధర నేడు 29 వేలకు ఎగబాకడంతో రైతుల్లో సంతోషాలు వ్యక్తమవుతున్నాయి. దాచుకున్న తమ పంటంతా అమ్మకానికి పెడుతున్నారు.
 
Tags;29 thousand chillies.