సాగు భూములకే 4 వేలు…

Date:13/02/2018
కరీంనగర్  ముచ్చట్లు:
వచ్చే సీజన్ నుంచి పంట పెట్టుబడి పథకం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఎకరాకు 4 వేల చొప్పున ఏటా రెండు సీజన్లకు 8 వేలు అందించి బాసటగా నిలువబోతున్నది. ప్రతి రైతుకు చెక్కుల ద్వారా ఈ మొత్తాన్ని అందించబోతున్నది. ఈ నేపథ్యంలో అర్హులైన రైతులందరికీ పెట్టుబడి అందించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా భూరికార్డులను శుద్ధి చేసింది. మార్చి 11న ఒకే రోజు రైతులందరికీ పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. జూన్‌లో వ్యవసాయ శాఖ ద్వారా రైతు సమగ్ర సర్వే నిర్వహించగా, భూరికార్డుల్లో అనేక లోపాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లాలో మొత్తం రైతులు 1,20,090 మంది రైతులుంటే 1,12,319 మంది రైతులకు సంబంధించిన భూముల వివరాలు మాత్రమే సర్వే చేయగలిగారు. మిగతా భూముల వివరాలు తేలలేదు. దీంతో గత సెప్టెంబర్ నుంచి డిసెంబర్ చివరి వరకు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూరికార్డుల ప్రక్షాళన చేపట్టి 92.30 శాతం రికార్డులను శుద్ధి చేశారు. జిల్లాలో మొత్తం 5,10,460.29 ఎకరాల భూములుండగా, 4,71,193.12 ఎకరాల భూరికార్డులను ప్రక్షాళన చేశారు. ఇందులో 3,76,850.21 ఎకరాలు వ్యవసాయ భూములు, 38,527 ఎకరాలు వ్యవసాయేతర భూములు, 55,814.38 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నట్లు తేల్చారు. దీంతో సంతృప్తి చెందిన ప్రభుత్వం ముందుగా శుద్ధి చేసిన రికార్డుల మేరకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చిందేందుకు సిద్ధమైంది. మార్చి 11న రైతులందరికీ ఒకేరోజు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ప్రక్రియను వేగవంతం చేసింది. జిల్లాలో 3,76,850.21ఎకరాలు వ్యవసాయ భూములున్నా, అన్నింటిలో పంటలు సాగు కావడం లేదని రాష్ట్ర సర్కారు భావిస్తున్నది. అందుకే పంటలు సాగయ్యే భూములకు మాత్రమే ఎకరాకు 4 వేల పెట్టుబడి పథకాన్ని వర్తించేలా చూడాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయ అధికారులు రంగంలోకి దిగారు. ఎన్ని ఎకరాల భూముల్లో పంటలు పండిస్తున్నారనే విషయమై నాలుగైదు రోజులుగా క్లస్టర్ల వారీగా ఏవోలు, ఏఈవోలు పరిశీలించి వివరాలు నమోదు చేస్తున్నారు. వారంలో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. రైతువారీగా గతంలో సమగ్ర సర్వే నిర్వహించినట్లే మరోసారి ఈ ప్రక్రియను చేపట్టారు. జిల్లాలో నిజానికి 2.20 ఎకరాల్లోపు ఉన్న రైతులే ఎక్కువగా ఉన్నారు. వీరి కమతాలన్నింటిలో పంటలు సాగు చేసుకుంటున్నారు. జిల్లాలో ఈ రైతులు 62 శాతం ఉంటే, ఐదెకరాలోపు ఉన్న రైతులు 24 శాతం మాత్రమే. ఇక పదెకరాలున్న వారు 11 శాతం, 25 ఎకరాలకుపైగా ఉన్న పెద్ద రైతుల సంఖ్య కేవలం 3 శాతం మాత్రమే ఉంది. కొందరు రైతులు కౌలుకు ఇవ్వడం, మరి కొందరు రైతులు తమ భూములను బీళ్లుగా ఉంచుకోవడం చాలా చోట్ల కనిపిస్తున్నది. కాగా, పంటలు సాగు చేయని భూములకు పంట పెట్టుబడిని సమకూర్చడం సరైనది కాదని భావిస్తున్న ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. సాగు భూములు ఎన్ని ఉన్నా వారికి పెట్టుబడి పథకం వర్తించేలా చూడాలని యోచిస్తున్నది. మే నుంచే పెట్టుబడి పథకం అమలు చేయాలని రాష్ట్ర సర్కారు భావిస్తున్నది. ఇందులో భాగంగానే వ్యవసాయ శాఖ అర్హులైన రైతుల లెక్క తేల్చే పనిలో పడింది. ఇటు రైతులకు సంక్షేమం కోసం ఏర్పాటు చేస్తున్న రైతు సమన్వయ సమితుల ఏర్పాటు ప్రక్రియ కూడా వేగంగా జరుగుతున్నది. రైతులకు పెట్టుబడి అందించడం, పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం, లేదంటే తామే కొనుగోలు చేయడం లాంటి కీలక బాధ్యతలను ఈ సమితులకు అప్పగించబోతున్నారు. వచ్చే వానాకాలం సీజన్ నుంచే రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈ పరిణామాలను బట్టి తెలుస్తున్నది.
Tags: 4 thousand for cultivated lands

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *