50,000 acres under irrigation

ఎస్సారెస్పీ కింద 50 వేల ఎకరాలకు సాగునీరు

-తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు

Date: 14/01/2018

వరంగల్ ముచట్లు:

ఎస్సారెస్పీ కింద వర్ధన్నపేట నియోజకవర్గంలోని 50 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలంగాణ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రకటించారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో శనివారం పర్యటించిన మంత్రులు కడియం శ్రీహరి, హరీష్‌రావు, తుమ్మల నాగేశ్వర్‌రావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ వర్ధన్నపేట నియోజకవర్గానికి రెండు పంటలకు సాగునీరు అందిస్తామని హామీనిచ్చారు. సాధారణ రీతిలో పనులు జరిగితే కాళేశ్వరం పూర్తికి పదేళ్లు పడుతుందన్నారు. ‘‘సీఎం కేసీఆర్ కృషి వల్ల ఏడాదిలోపే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కానుంది. కాళేశ్వరం పనులు మూడు షిఫ్టుల్లో జరుగుతున్నాయి’’ అని హరీష్‌రావు స్పష్టం చేశారు. రోళ్లకల్, కొనరెడ్డి, ఏనుగాల్లు చెరువుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. 24 గంటల కరెంట్‌పై మంత్రి హరీష్‌రావు కీలక సూచన చేశారు. సాగుకు 24 గంటల విద్యుత్ కావాలా? వద్దా? అనేది రైతుల ఇష్టమని మంత్రి చెప్పారు. అవసరం లేని చోట రైతులు తీర్మానం చేసుకుని అవసరమైనన్ని గంటలు తీసుకోవచ్చని సూచించారు. నిరంతర సరఫరా వద్దనుకుంటే గ్రామ తీర్మానం చేయాలని మంత్రి హరీష్‌రావు రైతులకు సూచన చేశారు. తీర్మానాలను ఎమ్మెల్యేలకు అందజేస్తే 24 గంటలకు బదులు సరిపడా విద్యుత్ అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Tags: 50,000 acres under irrigation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *