మందకొడిగా మట్టి నమూనాల సేకరణ

Date:19/06/2018
ఖమ్మం ముచ్చట్లు:
ఖమ్మం జిల్లాల్లో భూసార పరీక్షలు సజావుగా సాగడంలేదన్న కామెంట్స్ చక్కర్లు కొడుతున్నాయి. రైతాంగం సాగుకు సన్నద్ధమై.. విత్తనాలు సైతం విత్తుతోంది. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందే సంబంధిత అధికారులు భూసార పరీక్షలు నిర్వహించి ఎక్కడ ఏయే పంటలు పండిస్తే మంచిదో చెప్పాల్సి ఉంటుంది. అయితే.. అలాంటి చర్యలేవీ పూర్తిస్థాయిలో లేవని స్థానిక రైతులు అంటున్నారు. ఇదిలాఉంటే వ్యవసాయ అధికారులు, రైతు బంధు, రైతు బీమా పథకాల పనులతో బిజీగా ఉండడం వల్లే భూసార పరీక్షలు మందకొడిగా సాగుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే భూసారం పరీక్షలు నిర్వహించి రైతులకు ఆయా ఫలితాలు చేతికందిస్తే ఎంతో ఉపయుక్తంగా ఉండేది. దిగుబడులు పెరిగేందుకు నత్రజని, భాస్వరం, పోటాషియం, కాల్షియం, మెగ్మీషియం, సల్ఫర్‌, జింకు, బోరాన్‌, ఇనుము వంటి పోషకాలను అందించాలి. పోషకాలు నిర్దేశించినట్లుగా సమతుల్యతలో  లేకుంటే సేంద్రీయ, రసాయన ఎరువులు చల్లాలి. వాస్తవానికి మే ఆఖరు నాటికే భూసార పరీక్షలు, ఫలితాల వెల్లడి ప్రక్రియ పూర్తవ్వాల్సి ఉంది. ఈ తంతు పూర్తిస్థాయిలో ఇంకా ప్రారంభం కాలేదని పలువురు విమర్శిస్తున్నారు. గతేడాది పంటకాలం సగం పూర్తయిన తర్వాత అంతకు ముందు రెండేళ్ల క్రితం చేసిన నమూనాల ఫలితాలు రైతులకు అందాయి. గత ఏడాదికి సంబంధించిన నమూనాల ఫలితాల్లో ఇప్పటికీ కొందరు రైతులకు రాలేదట. ఇప్పుడైతే నమూనాల సేకరణే సాగడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి మట్టి నమూనాలు ఎప్పుడు సేకరిస్తారో.. ఎప్పుడు పరీక్షలు చేసి.. ఫలితాలు అందిస్తారో తెలీడంలేదని కర్షకులు అంటున్నారు. వ్యవసాయశాఖ అధికారులు ఇప్పటికీ రైతుబంధు పథకం పనులు సాగిస్తున్నారు. రెండు నెలలుగా పూర్తిస్థాయిలో ఇదే అంశంలో మునిగిపోవడంతో ఏప్రిల్‌, మే నెలలో సేకరించాల్సిన భూసార మట్టి నమూనా సేకరణ ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. కొన్ని మండలాల్లో మట్టి నమూనాలు సేకరించారు. కొన్ని ప్రాంతాల్లో ఆ ఊసే లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అయితే రైతులు భూసార పరీక్షల కోసం వేచి చూడకుండా సాగు యత్నాల్లో మునిగిపోయారు. తొలకరి పలకరించడంతో ఖరీఫ్‌ సాగు ప్రారంభించారు. భూసార ఫలితాలు ముందుగానే అందిస్తే ఫలితం ఉండేది. కానీ ఇప్పుడిప్పుడే మట్టి నమానాలు సేకరిస్తుండగా వీటి ఫలితాలు ఎప్పటికి వస్తాయన్న విషయమై సందిగ్ధత నెలకొంది. ఏదేమైనా మట్టి నమూనాలను త్వరిగతిన పరిశీలించి ఫలితాలు వెంటనే రైతులకు చేరేలా చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.
Tags; A collection of dull clay patterns

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *