"A crime thriller titled 'Chowkidare Thora' in Delhi

 ‘ఢిల్లీలో ‘చౌకీదారే దొంగ’ అనే పేరుతో ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌ 

దేశానికి కాపలాదారుగా ఉంటానన్న వ్యక్తే దొంగగా మారారు:రాహుల్ గాంధీ
Date:20/11/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
మొయిన్‌ ఖురేషీ కేసును దర్యాప్తు చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కొందరు అధికారుల నుంచి కేంద్రమంత్రికి కోట్ల రూపాయల ముడుపులు ముట్టినట్లు సీబీఐ డీఐజీ మనీశ్‌ కుమార్‌ సిన్హా ఆరోపించారు. దీంతో ఇది సంచలనంగా మారింది. కాగా.. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కేంద్రప్రభుత్వం, ప్రధాని మోదీపై మరోసారి విరుచుకుపడ్డారు. దేశానికి కాపలాదారుగా ఉంటానన్న వ్యక్తే దొంగగా మారారంటూ ట్విటర్‌ వేదికగా దుయ్యబట్టారు.‘ఢిల్లీలో ‘చౌకీదారే దొంగ’ అనే పేరుతో ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌ కొనసాగుతోంది. తాజా ఎపిసోడ్‌లో కేంద్రమంత్రి, ఎన్‌ఎస్‌ఏ చీఫ్‌పై సీబీఐ డీఐజీ ఆరోపణలు చేశారు’ అని రాహుల్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ప్రధాని మోదీ గుజరాత్‌ మిత్రులకు రూ. కోట్లలో ముడుపులు అందుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ పరిణామాలతో ప్రజాస్వామ్యం బాధపడుతోంది అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.మొయిన్‌ ఖురేషీ కేసులో గుజరాత్‌కు చెందిన కేంద్ర బొగ్గు శాఖ సహాయమంత్రి హరిభాయ్‌ పార్థిభాయ్‌ చౌధురికి కోట్ల రూపాయల ముడుపులు ముట్టినట్లు సీబీఐ డీఐజీ మనీశ్‌ కుమార్‌ సిన్హా తాజాగా ఆరోపణలు చేశారు. ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానా అవినీతి కేసులో నిందితులను రక్షించడానికి పీఎంవోను మేనేజ్‌ చేసినట్లుగా ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ జరిగినట్లు పేర్కొన్నారు. సంభాషణ జరిగిన రోజు రాత్రే ఆ కేసును దర్యాప్తు చేస్తున్న బృందాన్ని మార్చేసినట్లు ఆరోపించారు. ఇదే కేసులో జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ డోభాల్‌, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి సురేశ్‌ చంద్ర, గూఢచర్య సంస్థ రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌ (రా) అధికారి సామంత్‌ గోయెల్‌, ఆ సంస్థ మాజీ సంయుక్త కార్యదర్శి దినేశ్వర్‌ ప్రసాద్‌ వివిధ సందర్భాల్లో జోక్యం చేసుకున్నట్లు విచారణ సందర్భంగా తెలిసిందన్నారు.
Tags:”A crime thriller titled ‘Chowkidare Thora’ in Delhi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *