శ్రీ కపిలేశ్వరాలయంలో ఏకాంతంగా త్రిశూలస్నానం
-ముగిసిన వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం ఉదయం త్రిశూలస్నానం ఏకాంతంగా జరిగింది.అంతకుముందు ఉదయం శ్రీ నటరాజ స్వామివారికి ఆస్థానం జరిగింది. ఆ తరువాత అర్చకులు శాస్త్రోక్తంగా త్రిశూలస్నానం నిర్వహించారు. అనంతరం శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వరస్వామివారికి, స్వామివారి ఆయుధమైన త్రిశూలానికి స్నపన తిరుమంజనం నిర్వహించి శాంతి చేకూర్చారు. ఇందులో భాగంగా పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తరువాత పూర్ణాహుతి, కలశోధ్వాససం, మూలవర్లకు కలశాభిషేకం నిర్వహించారు.సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు ధ్వజావరోహణంతో శ్రీకపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కాగా రాత్రి 8 నుండి 9 గంటల వరకు రావణాసుర వాహనం ఆస్థానం జరుగనుంది.హరిబ్రహ్మాదులకే లభ్యం గాని పవిత్రపాదపద్మాలను హృదయ చక్రంలో నిలుపుకొని నిత్యం ధ్యానం చేసిన రాక్షసభక్తుడు రావణుడు. తపస్సంపన్నుడైన రావణుడు పరదారాపహరణమనే దుర్మార్గాన్ని చేయడం, శిష్టులైన దేవతలకు హాని తలపెట్టడం వల్ల రామబాణానికి హతుడయ్యాడు. ఇలాంటి రావణుడి వాహనంపై స్వామివారికి ఆస్థానం జరుగుతుంది.ఈ కార్యక్రమాల్లో ఆలయ డెప్యూటీ ఈవో సుబ్రమణ్యం, ఏఈవో సత్రే నాయక్, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రెడ్డిశేఖర్, శ్రీనివాస్‌నాయక్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
Tags: A solitary trident bath at Sri Kapileshwara Temple