అడవినీ వదలని అక్రమార్కులు

Date:13/02/2018
నిజామాబాద్ ముచ్చట్లు:
అధికార యంత్రాంగం కాస్త ఏమరుపాటుగా ఉంటే చాలు.. సర్కారీ భూములు కబ్జాకు గురవుతున్న రోజులివి. ఖాళీ స్థలాలు ఎక్కడ కనిపించినా పాగా వేయడమే కొందరు పనిగా పెట్టుకున్నారు. ఈ దందాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా అక్రమార్కులు కొత్తకొత్త మార్గాల్లో తమ పని చేసుకుపోతున్నారు. ఇక నిజామాబాద్ జిల్లాలో అయితే అటవీ ప్రాంతం అక్రమార్కుల చెరలో చిక్కుకుపోవడం విస్తుగొలుపుతోంది. పలువురు అడవులను కబ్జా చేయడమే కాకుండా చెట్లను నరికివేస్తూ సాగుభూములుగా మార్చేస్తున్నారని అధికారులు గుర్తించారు. ఉమ్మడి జిల్లాలోని 10751 హెక్టార్ల అటవీ భూమి ఆక్రమణకు గురైనట్లు ఈపీటీఆర్‌ఐ నివేదిక వెల్లడిస్తోంది. ఇంత పెద్దమొత్తంలో కబ్జాకు గురైనా అధికారులు మాత్రం దీనిని కప్పిపుచ్చేందుకు యత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. పదివేలకు పైగా హెక్టార్లు అన్యాక్రాంతమైతే అధికారులు మాత్రం 940 హెక్టార్లే కబ్జాకు గురైనట్లు చెప్తూ సమస్యను చిన్నదిగా చూపేందుకు యత్నిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పర్యావరణ సమతుల్యత కొనసాగాలంటే అడవులు తప్పనిసరి. అటవీ ప్రాంతం తరిగిపోతుండడం వల్లే భూగోళం నేడు పర్యావరణం పరంగా పలు సమస్యలు ఎదుర్కొంటోంది. పెరిగిపోయిన కాలుష్యంతో జీవకోటి నానాపాట్లు పడుతోంది. ఇంతటి ప్రాధాన్యమైన అటవీ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి బదులు ధ్వంసం చేస్తుండడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్విరాన్‌మెంట్‌ ప్రొడక్షన్‌ ట్రైనింగ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌..ఈపీటీఆర్‌ఐ నివేదిక జనవరిలోనే విడుదల అయింది. నివేదిక ప్రకారం ఉమ్మడి జిల్లాలో 10751 హెక్టార్లు అటవీభూమి కబ్జాకు గురైంది. అంటే ఉమ్మడి జిల్లా అటవీ విస్తీర్ణంలో 6.08 శాతం ఆక్రమణకు గురైనట్లు తెలుస్తోంది. 2008-09నుంచి 2016-17 వరకు 157 అగ్నిప్రమాదాలు జరిగి విలువైన కలప దగ్ధమైనట్లు వెల్లడైంది. ఈ ఆక్రమణలు, ప్రమాదాల పర్వం పరిశీలిస్తే క్షేత్రస్థాయిలో కంపా పథకం ద్వారా బేస్‌ క్యాంపులకు, చెక్‌పోస్టులకు  నిధులు విడుదల అవుతున్నా అటవీ రక్షణకు అక్కరకు రాకుండా పోతున్నాయన్న అనుమానాలు రాకమానవు. ఏదేమైనా అధికారులు స్పందించి కబ్జాకు గురైన అటవీ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని ఆక్రమణలకు చెక్ పెట్టాలని జిల్లా వాసులు విజ్ఞప్తిచేస్తున్నారు.
Tags: Acknowledgments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *