అడవిదొగలు 

Date:13/02/2018
మంచిర్యాల ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్రంలో 27, 292 చదరపు కిలోమీటర్ల అటవీప్రాంతం ఉంది. ఇందులో ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో 7,101.30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులున్నాయి. ఇదంతా లెక్కల్లో. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 44.9 శాతం అటవీ ప్రాంతం ఉండగా, మంచిర్యాల జిల్లాలో 45 శాతం కావడం గమనార్హం. ఇప్పుడు ఆ అడవి కన్నీరు పెడుతున్నది. ఈ ప్రాంతం లో ఒకప్పుడు వర్షం అత్యధికంగా కురిసే జిల్లాగా పేరుంది. ఇప్పుడు వర్షాలు కూడా కురవడం లేదు. సాధారణ వర్షం కన్నా ఇటీవల జూన్‌, జులై, ఆగష్టులో అతి తక్కువ వర్షపాతం నమోదైంది. ఇందుకు కారణం అడవిని యథేచ్ఛగా నరికివేస్తున్న స్మగ్లర్లు. వారికి అండదండలుగా ఉంటున్న అధికారగణం, రాజకీయ నాయకులేనంటే అతిశయోక్తి కాదు. పులులు, చిరుతలు, ఇతర జంతువులు నీరు దొరకక పట్టణాల వైపుకు తరలివస్తున్న సంఘటనలు. పెరుగుతున్నాయి.మొత్తం జిల్లాలో మూడు, నాలుగు వేలకు ఈ పని చేసే వారు సుమారు 300 మంది ఉంటారని సమాచారం. వీరందరూ రోజు కూలీలాగా పని చేస్తారు. అందరి వద్ద సెల్‌ఫోన్లు ఉంటాయి. పది మందికి ఒక లీడర్‌ ఎక్కడికక్కడ ఈ నిర్దేశించిన స్ధావరం వద్దకు దుంగలు చేరే విధంగా ఎప్పటికప్పుడు సమాచారం తీసుకొని ఏర్పాట్లు చేస్తాడు. ఒక వేళ పకడ్బందీగా ఫారెస్టు అధికారులు ఎవరైనా ఉంటే వారి నిఘా నుంచి తప్పించడం కోసం అవసరమైతే కొన్ని రోజులు కలపను దాచి ఉంచుతారు. బీట్‌ అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు చేయాల్సిన తనిఖీలు చేయకుండానే ఏర్పాట్లు చేసుకుంటారు. సెక్షన్‌ ఆఫీసర్లు, బీట్‌ అధికారులు, ఇతర బేస్‌ క్యాంప్‌ సిబ్బంది ఎవరు కూడా పట్టించుకోరు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో దశాబ్దాలుగా స్మగ్లర్ల చేతుల్లో అడవి నరికివేతకు గురవుతున్నది. గడిచిన రెండు సంవత్సరాల నుంచి అయితే విచ్చలవిడిగా నరికివేత కొనసాగుతున్నప్పటికీ పట్టించుకునేవారు లేరు. కొత్తగా జిల్లాలు ఏర్పడిన తర్వాత ఇది మరింత పెరిగిపోయింది.చెట్టును నరికివేసిన సమాచారం ఎప్పటికప్పుడు బీట్‌ అధికారి తెలుసుకోవాల్సి ఉంటుంది. నరికివేతకుగురైన చెట్ల లెక్క బీట్‌ ఫెల్లింగ్‌ రిజిస్ట్రర్‌లో రాయాల్సి ఉంటుంది. లక్షల రూపాయల విలువైన కలప నరికివేతకు గురవుతూ జిల్లా సరిహద్దులు దాటుతున్నప్పటికి వాటి లెక్కలు మాత్రం రిజిస్ట్రర్‌లలో కనిపించవు. అక్కడక్కడ చిన్న చిన్న చెట్లు నరికివేతకు గురైతే వాటి లెక్కలు రాసేస్తారు. లెక్కలన్నీ అబ్రకదబ్రా లెక్కలే. ఎక్కడికక్కడ స్మగ్లర్లు ఎవరిని పడితే వారిని మానేజ్‌ చేసుకుంటున్న దాఖలాలున్నాయి. వీరెవరికీ బదిలీలు కావు. ఏళ్ల తరబడి ఒకే దగ్గర పనిచేసే విధంగా పైరవీ చేయించుకుంటారు. బేస్‌ క్యాంపులు ఏర్పాటు చేసినప్పటికీ వాటి ఫలితం లేదు. అక్కడినుంచే వారి కనుసన్నలలోనే స్మగ్లింగ్‌ జరుగుతున్నట్టు ఆరోపణలున్నాయి.స్మగ్లర్లు మంచిర్యాల, ఆదిలాబాద్‌, కుమరంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో చెట్లు నరికే కూలీలను ఏర్పాటుచేసుకుంటున్నారు. వారు నరికి ఎడ్ల బండ్లు, ద్విచక్ర వాహనాలు, మెటోడోర్‌ వ్యాన్‌ల ద్వారా రోడ్లు దాటిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ పని కోసం ప్రతీ రోజు వంద వరకు వాహనాలు తిరుగుతుంటాయనేది సమాచారం. కల్లెడ, తాటిగూడ, మంగి, ఎర్రబండ, తిర్యాణి, గండిగోపాల్‌పూర్‌, మామిడిపల్లి, లింగాపూర్‌, కొమ్ముగూడ, నంబాల లాంటి దండేపల్లి మండలంలోని ప్రాంతాలు, అటు జన్నారంలో తాళ్లపేట రేంజ్‌లోగల గ్రామాలు ఇటు కాసిపేట మండలంలో 4గ్రామాల గుండా అటవీ ప్రాం తాల నుంచి నరికివేత అనంతరం చెట్లను దుంగలుగా తయారు చేసి రవాణా చేస్తారు. దొరికితే దొంగ….లేకపోతే లేదు. ప్రతీ రోజు సుమారు ఉమ్మడి జిల్లా నుంచి 8 నుంచి 12 లక్షల రూపాయల విలువైన కలప కరీంనగర్‌, హైదరాబాద్‌, వరంగల్‌కు తరలివెళ్తుంది. గుట్టలమీద నుంచి నరికి తీసుకువచ్చే ఈ చెట్లను సైకిల్‌ల మీద, స్కూటర్లు, మోటర్‌సైకిళ్ల మీద కొద్ది దూరం, అనంతరం ఎడ్ల బండ్ల మీద తీసుకువస్తారు.ఒక దుంగను రూ. 2, 3 వేలకు కొనుగోలు చేసి రూ. 20 వేలకు అమ్ముతున్నారు. ఈ అమ్మకం చేస్తున్న వారు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన స్మగ్లర్లు కాగా ఇతర జిల్లాలలో వీటిని కొనుగోలు చేసే వారు మరో ఐదుపది వేలు పెంచుకొని అమ్ముకుంటున్నారు. కాసిపేట మండలంలోని దేవాపూర్‌ ప్రాంతంలోని కలప నాణ్యమైందని, ఎక్కువ రేటు పలుకుతుంది. ఇది లోకల్‌గానే రూ.4 వేల నుంచి 5 వేలకు అ మ్ముతుంటారు. దీని కొనుగోలుకు మంచి డిమాండ్‌ ఉంది.
Tags: Adavidogalu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *