afflicted natizans fire on nandi awards

నంది అవార్డ్సా.. నందమూరి అవార్డ్సా..!

  • మండిపడుతున్న నెటిజన్లు
  • నంది అవార్డులు ప్రకటించిన తీరుపైన విమర్శల వెల్లువ
  • మెగా కుటుంబానికి అవమానం.. సినీ పరిశ్రమలోను అసంతృప్తి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన నంది అవార్డులు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. 2014, 15, 16 సంవత్సరాలకుగాను ఉత్తమ చిత్రాలకు ఏపీ సర్కారు మంగళవారం సాయంత్రం నంది అవార్డులు ప్రకటించింది. ఈ మూడు సంవత్సరాలకు లెజెండ్‌, బాహుబలి, పెళ్లి చూపులు ఉత్తమ సినిమాలుగా, బాలకృష్ణ, మహేశ్‌బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. ఈ మేరకు ఏపీ సర్కారు ప్రకటించిన నంది అవార్డుల విషయంలో ఇటు టాలీవుడ్‌లోనూ, అటు సోషల్‌ మీడియాలోనూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ సర్కారు రాజకీయంగా తమవారికే నందులు పంచిందని విమర్శలు వినిపిస్తున్నాయి.

మెగా కుటుంబానికి అవమానం..!
ముఖ్యంగా నంది అవార్డుల విషయంలో మెగా హీరోలకు అన్యాయం జరిగిందనే వాదన వినిపిస్తోంది. నంది అవార్డుల్లో మెగా హీరోలకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. అదీకాక రుద్రమదేవి సినిమాలో ‘గోనగన్నారెడ్డి’ పాత్ర పోషించిన అల్లు అర్జున్‌కి ‘బెస్ట్‌ క్యారెక్టర్‌ యాక్టర్‌’ నటుడిగా నంది అవార్డు ప్రకటించడం పుండు మీద కారం చల్లినట్టు అయింది. ఒక స్టార్‌ హీరోగా రాణిస్తున్న యువ నటుడిని ‘క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌’కు పరిమితం చేసి అవార్డు ఇవ్వడం ఏమిటి? అన్న వాదన వినిపిస్తోంది. అల్లు అర్జున్‌కు ‘బెస్ట్‌ సోపోర్టింగ్‌ యాక్టర్‌’ అవార్డు ఇస్తే న్యాయం జరిగి ఉండేదని, కానీ అందుకు భిన్నంగా అవార్డు ప్రకటించి అవమానించారని ఆగ్రహం వ్యక్తమవుతోంది.

బన్నీ వాసు ఫైర్‌..!
మెగా కుటుంబ అభిమాని.. గీతా ఆర్ట్స్‌ కో ప్రొడ్యూసర్‌ మేనేజర్‌ బన్నీ వాసు నంది అవార్డులపై సోషల్‌ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. “టీడీపీ ప్రభుత్వాన్ని చూసి మెగా హీరోలు నటన నేర్చుకోవాలి. నంది అవార్డులు రావాలంటే.. తక్షణం చంద్రబాబు సర్కారు వద్ద శిక్షణ పొందాలి. నంది అవార్డుల్లో మెగా ఫ్యామిలీకి తీవ్ర అన్యాయం జరిగింది. అల్లు అర్జున్‌కి ఉత్తమ క్యారెక్టర్‌ నటుడు అవార్డు ఇచ్చి అవమానించారు’ అని బన్నీవాసు కామెంట్ చేశారు. మెగా అభిమానుల్లో ఉన్న ఆగ్రహాన్ని ఈ వ్యాఖ్యలు చాటుతున్నాయి.

‘లెజెండ్‌’ సినిమాకు 9 నందులా?
బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘లెజెండ్‌’ సినిమాకు నంది అవార్డుల్లో పెద్దపీట దక్కింది. ఈ సినిమాకు ఏకంగా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ విలన్‌ ఇలా తొమ్మిది నంది అవార్డులు దక్కాయి. అయితే, మాస్‌ మసాల కమర్షియల్‌ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఇన్ని నంది అవార్డులు రావడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా నంది అవార్డుల జ్యూరీలో బాలకృష్ణ సభ్యుడిగా ఉన్న నేపథ్యంలో ఇలా అవార్డులు రావడం విమర్శలకు తావిస్తోంది. ఏపీ సర్కారు ప్రకటించింది నంది అవార్డులా? నందమూరి అవార్డులా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

‘మనం’కు అన్యాయం..!
తెలుగు సినీ దిగ్గజం, లెజెండ్‌ అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి సినిమా ‘మనం’. ఈ సినిమాలో మూడు తరాల అక్కినేని నటులు నటించారు. చక్కని కుటుంబ కథా చిత్రంగా, వినూత్నమైన స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిన ఈ సినిమాను కాదని తెరపై రక్తపాతం పారించిన ‘లెజెండ్’ సినిమాకు ఉత్తమ చిత్రంగా నంది అవార్డు ప్రకటించడంపై సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెటిజన్లు తీవ్రమైన వ్యాఖ్యలతో ఈ విషయాన్ని ప్రశ్నిస్తున్నారు. ఏఎన్నార్‌ నటించిన చివరి సినిమాకు ఇదా ఏపీ సర్కారు ఇచ్చే గౌరవం అని విమర్శిస్తున్నారు. ఈ సినిమాకు ఉత్తమ ద్వితీయ చిత్రంగా అవార్డు ఇచ్చి సరిపుచ్చడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు.

‘రుద్రమదేవి’ని పట్టించుకోలేదు
ఎన్నో వ్యయప్రయాసలకోర్చి.. ఎంతో శ్రమించి తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక అయిన ‘రుద్రమదేవి’ సినిమాను దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కించారు. అయితే ఈ సినిమాకు వినోద పన్ను మినహాయింపు ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం మాట తప్పిందని ఆ మధ్య గుణశేఖర్‌ ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ‘రుద్రమదేవి’ సినిమా నంది అవార్డుల్లో విస్మరణకు గురికావడం గమనార్హం అని చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు బెస్ట్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ అవార్డు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇక, ఊపిరి, భలేభలే మగాడివోయ్‌ వంటి సినిమాలను అస్సలు గుర్తించకపోవడం, వరుసగా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ మ్యూజిక్‌ అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్‌ను విస్మరించడం కూడా విమర్శలకు తావిస్తోంది. నంది అవార్డులు ప్రకటించిన తీరుపై సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రతిష్టాత్మకమైన నంది అవార్డులను రాజకీయ కోణంలో ఏపీ సర్కారు పంపిణీ చేసిందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

Tags :Afflicted Natizans,nandi awards 2017,nandamuri family,tollywood

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *