మళ్లీ వేడెక్కిన ఏపీ రాజకీయాలు

Date:14/02/2018
విజయవాడ  ముచ్చట్లు:
ఏపీలో మిత్రులు మళ్లీ కత్తులు దూసుకుంటున్నారు. మాటల యుద్ధానికి నాలుగు రోజుల గ్యాప్ ఇచ్చి మళ్లీ మొదలు పెట్టారు. సోము వీర్రాజు ప్రెస్‌మీట్‌ పెట్టిమరీ టీడీపీపై మరోసారి విరుచుకుపడ్డారు. పోలవరం సహా అన్ని అంశాలను ప్రస్తావించారు. కేంద్రం ఇప్పటి వరకు ఇచ్చిన నిధులు ఎక్కడు ఖర్చు చేశారో చెప్పాలన్నారు. ఏ రాష్ట్రానికి ఇవ్వని నిధులు ఏపీకి ఇచ్చారని గతంలో చంద్రబాబు అన్నారన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు. రెవెన్యూ లోటు రూ.4600 కోట్లని తేలిందని… లోటు బడ్జెట్‌లో రుణమాఫీ, సంక్షేమ పథకాలను చేర్చారన్నారు. 2014లో బీజేపీతో పొత్తు లేకపోతే టీడీపీ గెలిచేదికాదన్నరు సోము. ఇటు బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు మిత్రపక్షంపై మండిపడ్డారు. తమ పార్టీపై టీడీపీ బురదజల్లాలని చూస్తోందని… ఆ పార్టీ ఎంపీలు చేసిన నిరసన ఏపీ ప్రజల్ని అవమానపరిచేలా ఉందన్నారు. పార్లమెంటులో ఎలా ప్రవర్తించాలో ఎంపీలకు చంద్రబాబు నేర్పాలని ఆయన సూచించారు.బీజేపీ నేతల వ్యాఖ్యలకు టీడీపీ నుంచి కౌంటర్ పడింది. కమలదళం తీరుపై మంత్రి అయ్యన్నపాత్రుడు ఫైరయ్యాడు. రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు. వ్యక్తిగతంగా పార్టీపరంగా బీజేపీతో కలిసి ఉండాలని కోరుకుంటున్నామని… సీఎం, ప్రభుత్వం మీద ఆరోపణలు చేసే నేతలు నిరూపించాలని సవాల్ విసిరారు. విష్ణుకుమార్ రాజుది చిన్న పిల్లాడిలాంటి మనస్తత్వమని.. ఆయనకిచ్చిన ప్రాధాన్యం చంద్రబాబు తమకు కూడా ఇవ్వలేదేమోనన్నారు. సోము వ్యాఖ్యలపై పార్టీ అధికార ప్రతినిధి లంక దినకర్ కూడా స్పందించారు. ప్యాకేజీ అని చెప్పారే కాని… ఆర్థికసాయం కూడా అందడం లేదన్నారు. బీజేపీ నేతలు వాస్తవాలను మాట్లాడితే మంచిదన్నారు. మిత్రుల మధ్య మళ్లీ డైలాగ్ వార్ మొదలవ్వడంతో… ఏపీలో రాజకీయం మళ్లీ వేడెక్కింది.
Tags: Again the warming AP politics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *