అమ్మో…అమ్మ….

Date:21/06/2018
రాజమండ్రి ముచ్చట్లు:
శ్మశానంలో తీవ్రమైన గాయాలతో రక్తమోడుతూ పడి ఉన్న తొమ్మిదేళ్ల ఆ బాలిక మెల్లిగా సృహలోకి వచ్చింది. ఒంటిపై తీవ్రమైన గాయాలు వేధిస్తుండగా.. శక్తినంతా కూడదీసుకొని పైకి లేచింది. నేరుగా వెళ్లి తన అమ్మమ్మ ఇంటి తలుపు తట్టింది. ఆ చిన్నారిని ఆ పరిస్థితుల్లో చూసిన అమ్మమ్మ, తాత హతాశులయ్యారు. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి సిద్ధమవుతూ.. తల్లికి సమాచారం ఇవ్వడానికి ప్రయత్నించారు. అది గమనించి ఆ చిన్నారి భయంతో వణికిపోయింది. తనను అమ్మ వద్దకు పంపొద్దంటూ వారిని కాళ్లా వేళ్లా పడి వేడుకుంది. రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ బాలిక వద్దకు తల్లి పరుగెత్తుకొచ్చింది. తన కూతురు మొఖం కత్తిగాట్లు, ఒంటిపై గాయాలు చూసి తల్లడిల్లింది. తన గారాలపట్టిపై ఎవరు ఇంతటి కిరాతకానికి ఒడిగట్టారంటూ కన్నీరుమున్నీరైంది. తలను గోడకేసి బాదుకుంటూ రోదించింది. ఆమె ఆర్తనాదాలతో ఆస్పత్రి మార్మోగిపోయింది. ఆ తల్లి ఏడుపు విని అక్కడికి వచ్చిన పలువురు పాప పరిస్థితి చూసి చలించిపోయారు. నిందితులను బహిరంగంగా ఉరి తీయాలంటూ శాపనార్థాలు పెట్టారు. కానీ, ఆ తొమ్మిదేళ్ల బాలికపై హత్యాయత్నం చేసింది ఎవరో కాదు.. ఆమె కన్నతల్లేనని పోలీసులు తేల్చారు. ఆ వార్త తెలియడంతో రాజమహేంద్రవరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోయింది. బాలికపై పైశాచికంగా దాడి చేసిన ఘటన స్థానికంగా సంచలనంగా మారడంతో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాజమండ్రి అర్బన్‌ ఎస్పీ రాజకుమారి స్వయంగా దర్యాప్తు చేశారు. ఘటన జరిగిన 6 గంటల్లోనే మిస్టరీని చేధించారు. దివాన్‌చెరువు గ్రామానికి చెందిన మచ్చా శారద కు ఇద్దరు ఆడపిల్లలు. మొదటి భర్తను విడిచిపెట్టడంతో తల్లిదండ్రులు ఆమెకు రెండో పెళ్లి చేశారు. రెండో భర్తతోనూ సరిగా కాపురం చేయకుండా రెండేళ్లుగా పిల్లలతో కలిసి విడిగా ఉంటోంది. స్థానికంగా ఓ హోటల్‌లో పనిచేస్తూ పిల్లలిద్దరినీ పోషిస్తోంది. అయితే.. నానాటికీ ఆమెకు పిల్లల పోషణ భారంగా మారడంతో ఉన్మాదిలా ప్రవర్తిస్తోంది. పెద్ద కుమార్తెను తరచూ గొడ్డును బాదినట్లు బాదుతోందని స్థానికులు పోలీసులకు తెలిపారు.  రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న పెద్ద కుమార్తె లక్ష్మి  నోట్లో గుడ్డలు కుక్కిన శారద.. ఆమె ముఖాన్ని కత్తి చిధ్రం చేసింది. ఆ సమయంలో చిన్న కూతురు అక్కడే నిద్రిస్తోంది. లక్ష్మి మెడపై, వీపుపైనా శారద తీవ్రంగా గాయపర్చింది. గాయాలతో బాలిక విలవిల్లాడుతున్నా ఆ మాతృహృదయం ఏమాత్రం కనికరించలేదు. ఆమె ప్రైవేట్ పార్ట్స్‌పైనా కత్తితో గాయపర్చింది. దీంతో ఆ అమ్మాయి సొమ్మసిల్లి పడిపోయింది. కూతురు చనిపోయిందని భావించిన శారద ఆమెను తన చేతుల్లో మోసుకొని వెళ్లి సమీపంలోని శ్మశానంలో పడేసి వచ్చింది. 4 గంటల తర్వాత మేల్కొన్న ఆ బాలిక అమ్మమ్మ ఇంటికి చేరకోవడంతో వారు ఆస్పత్రికి తరలించారు. రాత్రి 9 గంటలప్పుడు తన కుమార్తె లక్ష్మిని పడుకోవడం లేదని కొట్టానని, దాంతో అలిగి అమ్మమ్మ ఇంట్లో పడుకుంటానని వెళ్లిపోయిందని, రాత్రి 10 గంటలకు తన తల్లి ఇంటికి వెళ్లి అడిగితే ఆమె రాలేదని చెప్పడంతో ఆందోళనకు గురయ్యామని పోలీసుల వద్ద శారద కట్టుకథ చెప్పింది. కూతురు కోసం చుట్టుపక్కల వెతికానని, తెల్లవారుజామున 3 గంటలప్పుడు ఒంటిపై తీవ్రగాయాలతో వచ్చిందని పోలీసులతో శారద చెప్పింది. తన కూతురుపై ఎవరో కిరాతకానికి ఒడిగట్టారని ఆరోపించింది. కేసును పలు కోణాల్లో విచారించిన పోలీసులు స్థానికులు తెలిపిన వివరాలు, శారద ప్రవర్తనా తీరుతో ఆమెపై అనుమానం వ్యక్తం చేశారు.  సృహలోకి వచ్చిన బాలికను ప్రశ్నించడంతో తొలుత ఆమె కూడా పోలీసులకు అదే కథను చెప్పింది. ఆ తర్వాత ఎస్పీ రాజకుమారి బాలికతో ఆప్యాయంగా మాట్లాడి భరోసా ఇవ్వడంతో చివరికి నిజం చెప్పింది. అమ్మ తనన్నెప్పుడూ కొడుతూ ఉంటుందని, చెల్లితో కలిసి పడుకుని ఉండగా తన నోట్లో గుడ్డలు కుక్కి చాకుతో దాడి చేసిందని తెలిపింది. విషయం ఎవరికీ చెప్పొద్దని శారద ఆ బాలికను బెదిరించడంతో మొదట ఆమె ఏమీ చెప్పలేదు.
ఆ కర్కశతల్లి శారదను అరెస్టు చేసిన పోలీసులు బొమ్మూరు స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. సోమవారం రాత్రి తల్లి చేతిలో కాళరాత్రిని చూసిన ఆ బాలిక ఆస్పత్రిలో కోలుకుంటోంది. శారద తరచూ ఉన్మాదిలా ప్రవర్తిస్తుందని, తనకు తాను ఒంటిపై చాకుతో గాయాలు చేసుకుంటుందని కుటుంబ సభ్యులు చెప్పారు. అసలు విషయం తెలిసిన తర్వాత స్థానికులు నివ్వెరపోయారు..
అమ్మో…అమ్మ….http://www.telugumuchatlu.com/ah-i/
Tags:Ah … I ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *