Albert's own best service!

అత్యుత్తమ సేవాదృక్పధం ఆల్బర్ట్‌ సొంతం!

-నోబెల్ బహుమతి అందుకున్నా నిరాడంభరుడే

-ఆల్బర్ట్‌ స్విట్జర్‌… అత్యుత్తమ సేవాదృక్పధం కలిగిన వైద్య నిపుణుడు, నోబెల్‌ బహుమతి గ్రహీత,

Date: 14/01/2018

లాంబరీని ముచ్చట్లు:

లాంబరీనిలోని ఆల్బర్ట్‌ స్విట్జర్‌ హాస్పిటల్‌ వ్యవస్థాపకుడు. ఈయన 1952 సంవత్సరపు నోబెల్‌ శాంతి బహుమతిని 1953 సంవత్సరంలో అందుకున్నారు. ఇతడు లాంబరీనిలో (ప్రస్తుతం గాబన్‌ దేశంలో) ఆల్బర్ట్‌ స్విట్చర్‌ హాస్పిటల్‌ను స్థాపించి అభివృద్ధి చేసి, పశ్చిమ ఆఫ్రికా ప్రజలకు మరువలేని సేవచేశారు. 1912 సంవత్సరంలో స్విట్జర్‌ తన స్వంత ఖర్చులతో ఆఫ్రికాలోని లాంబరీనిలో నున్న పారిస్‌ మిషనరీ సొసైటీలో వైద్యునిగా పనిచేయడానికి నిర్ణయించుకొన్నారు. అప్పుడు అదొక ఫ్రెంచి కాలనీ. సంగీత కార్యక్రమాలు నిర్వహించి నిధులు పోగుచేశారు. అందుకు ప్రముఖ సంగీతకారుడు బాచ్‌ కూడా చాలా సహాయం చేశారట. 1913 సంవత్సరంలో భార్యతో సహా సుమారు 200 మైళ్ళ దూరం చిన్న తెప్పలో ప్రయాణించి హాస్పిటల్‌ నెలకొల్పడానికి ప్రయాణమయ్యారు. మొదటి తొమ్మిది నెలలు భార్యాభర్తలు సుమారు 2,000 మంది వ్యాధిగ్రస్తుల్ని పరీక్షించారు. కొంతమంది సుదూర ప్రాంతాల నుండి వచ్చినవారున్నారు. గాయాలనే కాకుండా గుండె సంబంధ వ్యాధుల్ని, అతిసారం, మలేరియా, అనేక రకాలైన జ్వరాలు, లెప్రసీ, మొదలైన చాలా రకాల వ్యాధులకు వైద్యం చేశారు. భార్య ఫ్రా స్విట్జర్‌ ఇతనికి మత్తుమందు సహాయకులుగా ఉండేవారు. కోళ్ళ ఫారమ్‌లో ప్రారంభించిన సేవ, అనతికాలంలోనే ఇనుముతో నిర్మించిన రెండు గదుల మొదటి వైద్యశాలకు తరలించారు. స్విట్జర్లు సొంత బంగళాలో నివసించేవారు. వీరు జోసెఫ్‌ అనే ఫ్రెంచి మాట్లాడగలిగే వాన్ని సహాయకుడిగా చేర్చుకున్నారు. కాగా, మొదటి ప్రపంచ యుద్ధం చెలరేగిన తర్వాత 1914లో స్విట్జర్లు ఇద్దర్నీ లాంబరీనిలోనే నిర్బంధించారు. 1917లో విశ్రాంతి లేని పనిమూలంగా రక్తహీనతతో బాధపడ్డాడు ఆల్బర్ట్‌ స్విట్జర్‌. జూలై 1918లో స్విట్జర్లాండ్‌లోని స్వస్థలానికి వెళ్ళిన తరువాత స్వతంత్రుడయ్యారు. జర్మనీలో జన్మించిన ఇతడు ఫ్రెంచి పౌరసత్వం స్వీకరించారు. స్ట్రాస్‌ బర్గ్‌లో మతబోధకుడిగా పనిచేస్తున్నప్పుడు ఆరోగ్యం మెరుగైన తరువాత 1920 నుండి తిరిగి లాంబరీని వెళ్ళడానికి కావలసిన ధనాన్ని సమకూర్చడానికి మరల సంగీత కార్యక్రమాలు కొనసాగించారు. 1922లో ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఇచ్చిన డేల్‌ స్మారక ఉపన్యాసాలు చాలా పేరుపొందాయి. ఆయా ప్రసంగాలు రెండు సంపుటాలుగా ముద్రించబడ్డాయి కూడా. 1924 సంవత్సరంలో ఒంటరిగా తిరిగి గాబన్‌ చేరారు. కొందరు వైద్యుల సహాయంతో వైద్యసేవలు కొనసాగించారు. వారిలో డాక్టర్‌ విక్టర్‌ నెస్మాన్‌ ముఖ్యుడు. ఆతని తరువాత డాక్టర్‌ ట్రెంజ్‌ వీనితో చేరారు. ముందుకాలంలో పనిచేసిన జోసెఫ్‌ తిరిగి కలిసారు. 1925-6లో కొత్త హాస్పిటల్‌ నిర్మించారు, తెల్లవారి కోసం ప్రత్యేకంగా ఒక వార్డుతో సహా. కరువు, అతిసారం ప్రబలడంతో అక్కడి పనివారితోనే హాస్పిటల్‌ నిర్మాణం కొనసాగించారు. డాక్టర్‌ ట్రెంజ్‌ సహాయంతో ప్రయోగాలు చేయడం కూడా మొదలుపెట్టారు. హాస్పిటల్‌ నడుస్తుండగా 1927లో స్విట్జర్‌ యూరప్‌ తిరిగి వచ్చారు. స్విట్జర్‌ మళ్ళీ 1929-1932 మధ్యకాలంలో గాబన్‌ వెళ్ళి సేవచేశారు. ఈతని పేరు ప్రఖ్యాతులు యూరప్‌ అంతా వ్యాపించాయి. మళ్ళీ 1937లో వచ్చి రెండవ ప్రపంచ యుద్ధం ముగిసేవరకు అక్కడే ఉన్నారు.

Tags: Albert’s own best service!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *