అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు సర్వే పూర్తి

-త్వరలో నోటిఫికేషన్ విడుదల
-మంత్రి నారాయణ వెల్లడి
Date:13/02/2018
అమరావతి ముచ్చట్లు:
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీసీఆర్ డీఏ (ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ చెప్పారు. సచివాలయం లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు సర్వే పూర్తి అయిందని, దానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 97.5 కిలోమీటర్లు నిర్మించే ఈ రోడ్డుకు సంబంధించిన నోటిఫికేషన్ ను సీఆర్డీఏ విడుదల చేస్తుందని చెప్పారు. ఈ రోడ్డుకు, అమరావతి లోపలి ప్రధాన రోడ్లకు అనుసంధానం చేసే రోడ్లకు కలిపి 8వేల ఎకరాలు సమీకరించవలసి ఉందన్నారు. ఈ భూములను కూడా పూలింగ్ పద్దతిలో తీసుకుంటామని, అందుకు ఇష్టపడనివారు ఉంటే వారి వద్ద నుంచి భూ సేకరణ విధానం ద్వారా సేకరిస్తామని చెప్పారు. అవుటర్ రింగ్ రోడ్డును నేషనల్ హైవే అథారిటీ నిర్మిస్తుందని చెప్పారు. అమరావతి నిర్మాణం కోసం ఎస్బీఐ ద్వారా రూ.500 కోట్లకు మసాలా బాండ్స్ విడుదల చేయాలని, 5.5 ఎకరాల్లో రూ.284 కోట్ల వ్యయంతో ఐటీ టవర్ నిర్మించాలని నిర్ణయించినట్లు వివరించారు. అమరావతిలోని 400 కెవి, 220 కెవి విద్యుత్ లైన్లను మార్చాలని నిర్ణయించామని, అందుకు రూ.1370 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. అమరావతిలో హైకోర్టు భవనాలు నిర్మించే ప్రాంతంలో లండన్ కు చెందిన నార్మన్ ఫోస్టర్ రూపొందించిన ప్లాన్ ప్రకారం తొలుత సిటీ సివిల్ కోర్టు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రూ.108 కోట్లతో లక్షా 96వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీని నిర్మాణం 8 నెలలో పూర్తి చేయిస్తామని చెప్పారు. ఇందులో తాత్కాలికంగా హైకోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు కూడా ఇందుకు అంగీకరించినట్లు తెలిపారు. ఏప్రిల్ లో విజయవాడ ఏ1 కన్వెన్షన్ హాల్ లో హాపీసిటీ సమ్మిట్ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.  కాంప్రహెన్సివ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ ని అధ్యయనం చేయమని సీఎం చెప్పారన్నారు. మార్చి 19 నుంచి 23 వరకు వాషింగ్టన్ లో జరిగే ప్రపంచ పేదరిక సదస్సుకు ప్రభుత్వ తరపున ప్రతినిధులను పంపించాలని నిర్ణయించినట్లు మంత్రి నారాయణ చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ కూడా పాల్గొన్నారు.
Tags :Amaravathi Inner Ring Road Survey Completed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *