America Shut Down donald trump Democratic Party Republican Party

ట్రంప్‌కు షాక్‌.. స్తంభించిన అమెరికా

సాక్షి

Date :20/01/2018

వాషింగ్టన్‌ : అనుకున్నదే జరిగింది. అమెరికా ప్రభుత్వం మరోసారి మూతపడింది. గడువులోగా ‘ద్రవ్య వినిమయ బిల్లు’  ఆమోదం పొందలేదు. దీంతో షట్‌ డౌన్‌ ప్రకటించేశారు. ఈ కారణంగా ప్రభుత్వ వార్షిక లావాదేవీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నిధులు నిలిచిపోవటంతో.. ప్రభుత్వ కార్యాకలాపాలు స్తంభించిపోయాయి. అయితే అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.

స్వాప్నికుల భద్రత విషయంలో స్పష్టమైన హామీ కోరిన డెమోక్రట‍్లకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించలేదు. శుక్రవారం అర్ధరాత్రి దాకా ద్రవ్య వినిమయ బిల్లుపై రిపబ్లికన్లు-డెమోక్రట‍్లకు మధ్య ఎడతెరగని చర్చలు జరిగాయి. అయితే అవి విఫలం కావటంతో బిల్లు ఆమోదం పొందకుండా పోయి షట్‌ డౌన్‌ విధించాల్సి వచ్చింది. దీంతో ట్రంప్‌ ఏడాది పాలన పూర్తి చేసుకున్న మరుసటి రోజే షాక్‌ తగిలినట్లయ్యింది.

షట్‌డౌన్‌ అంటే… ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ ఖర్చులకు సంబంధించి వినిమయ బిల్లులో వేటిని చేర్చాలి.. ఎంత కేటాయింపులు చేయాలన్న దానిపై అమెరికన్‌ కాంగ్రెస్‌లో విభేదాలు కొనసాగితే ఈ ప్రతిష్టంభన ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో వినిమయ బిల్లు ఆమోదం పొందకపోతే రోజువారీ వ్యవహారాలకు అవసరమైన నిధులు నిలిచిపోయి షట్‌డౌన్‌ మొదలవుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్ని పూర్తిగా మూసివేస్తారు. అత్యవసర విభాగాలు(రక్షణ వ్యవహారాలు, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ, ఎఫ్‌బీఐ వంటివి) మినహా అధిక శాతం ప్రభుత్వ సర్వీసులు నిలిచిపోతాయి. ఈ సమయంలో 40 శాతం ప్రభుత్వ ఉద్యోగులకు వేతనం లేని సెలవు ప్రకటిస్తారు. షట్‌డౌన్‌ వల్ల అమెరికా ప్రభుత్వానికి ఒక్కో వారానికి దాదాపు 6.5 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ. 42 వేల కోట్లు) నష్టమని ‘ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌’ విశ్లేషకులు అంచనా వేశారు.

ఇప్పుడు షట్‌డౌన్ ఎందుకంటే… తల్లిదండ్రుల వెంట అమెరికాకు వచ్చిన పిల్లల్ని(స్వాప్నికులు) తిప్పి పంపకుండా.. వారి పరిరక్షణకు తీసుకునే చర్యల్ని బిల్లులో చేర్చాలని డెమోక్రట్‌లు పట్టుబడుతున్నారు. ఒబామా హయాంలో స్వాప్నికులకు తాత్కాలికంగా చట్టబద్ధ హోదా కల్పించినా, ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక ఆ విధానంలో మార్పులు తీసుకొచ్చారు. వీరికి చట్టపరంగా లభిస్తోన్న భద్రతను తొలగించేందుకు గత సెప్టెంబర్‌లో చర్యలు ప్రారంభించారు. దీనిని డెమోక్రట్‌లు తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నారు. అయితే వలస విధానం భిన్న అంశమని, దీనిపై తర్వాత నిర్ణయం తీసుకోవచ్చని అధ్యక్షుడు ట్రంప్, రిపబ్లికన్‌ సభ్యులు వాదిస్తున్నారు. ఫండింగ్ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో 230-197 ఓట్లు పోలయ్యాయి. కొందరు రిపబ్లికన్లు కూడా దానిని వ్యతిరేకించటంతో.. ప్రభుత్వం చర్చలకు డెమోక్రట‍్లను ఆహ్వానించింది. ఈ క్రమంలో జరిగిన చర్చలు విఫలం అయ్యాయి.

గతంలో కూడా… 1981 నుంచి ఇంతవరకూ అమెరికాలో 12 సార్లు ‘గవర్నమెంట్‌ షట్‌డౌన్‌’ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. బిల్‌ క్లింటన్‌ హయాంలో అత్యధికంగా 1995 డిసెంబర్‌ నుంచి 1996 జనవరి వరకూ 21 రోజులు షట్‌డౌన్‌ కొనసాగింది. ప్రస్తుత షట్‌ డౌన్‌ పిబ్రవరి 16 వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *