American Visa Factor Again

మళ్లీ తెరమీదకు అమెరికా వీసా అంశం!

-పొడిగింపును అడ్డుకునే దిశగా ట్రంప్ నిర్ణయం

-ఆందోళనలో హెచ్-1బీ అభ్యర్ధులు

Date: 04/01/2018

వాషింగ్టన్ ముచ్చట్లు:

వీసాల పొడిగింపునకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు తాజాగా తీసుకున్న మరో నిర్ణయం భారతీయ హెచ్-1బీ వీసాలపై అగ్రరాజ్యంలో ఉద్యోగాలు చేస్తున్న వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అగ్రరాజ్య రక్షణాత్మక ధోరణులకు ప్రపంచ ఐటీ రంగం ముఖ్యంగా భారతీయ ఐటీ ఉద్యోగులు బలికావాల్సి వస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్దన్నగా వ్యవహరించే అమెరికానే ప్రపంచీకరణకు తిలోదకాలిస్తోందా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యేలా ట్రంప్ సర్కారు తాజా నిర్ణయం ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకోవాలన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపు అక్కడ పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు శరాఘాతమవుతోంది. ట్రంప్ వైఖరితో హెచ్-1బీ వీసాల పొడిగింపునకు అడ్డంకులు ఏర్పడుతుండగా, కాలపరిమితి పెరుగకుండా కొత్త నిబంధనలను పరిశీలిస్తోంది అమెరికా సర్కారు. సదరు నిబంధనల సవరణ బిల్లు వాస్తవరూపం దాల్చితే అది నేరుగానే వేలాదిమంది విదేశీ ఉద్యోగులను అమెరికాలోకి రాకుండా అడ్డుకోనున్నాయి. అంతేగాక గ్రీన్ కార్డును సొంతం చేసుకోవాలనుకుంటున్న వారి ఆశలు అడియాసలు కానున్నాయి. నూతన నియమాలతో ప్రస్తుత వీసా విధానం మరింత కఠినతరం కానుండగా, హెచ్-1బీ వీసాలు దూరమవడమేగాక, గ్రీన్ కార్డు దరఖాస్తులూ పెండింగ్‌లో పడుతాయని అమెరికాకు చెందిన న్యూస్ ఏజెన్సీ మెక్‌క్లాచీ డీసీ బ్యూరో పేర్కొంది. ఈ పెండింగ్ కాలంలో వీసా పునరుద్ధరణను అడ్డుకోవాలన్నదే బిల్లు ప్రధాన లక్ష్యమన్నది. హెచ్-1బీ వీసాల దుర్వినియోగాన్ని అరికట్టడంతోపాటు ఇప్పటికే గ్రీన్ కార్డులున్నవారి భవిష్యత్తునూ ప్రశ్నార్థకం చేసే నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటున్నదని ఓ నివేదికలో బ్యూరో వెల్లడించింది. ఇప్పటికే హౌజ్ జ్యుడీషియరీ కమిటీ బిల్లుకు ఆమోదం తెలుపగా, ఇది అమెరికా సెనెట్ వద్ద ఉంది. ఇక్కడ కూడా ఆమోదం పొందితే భారతీయ టెక్నాలజీ ఇంజినీర్లకు ఇక ఇబ్బందులే అన్న కోణంలో హోంలాండ్ సెక్యూరిటీ అధికారులు కూడా మాట్లాడుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. తమ చర్యలు అమెరికన్ల ఉద్యోగావకాశాలను తప్పక పెంచుతాయన్న విశ్వాసం వారి మాటల్లో కనిపిస్తోంది. వీసా విధానంలో కీలక మార్పులను చేసే యోచనలో ఉన్నామని అమెరికా పౌరసత్వ, వలస సేవల (యూఎస్‌సీఐఎస్) మీడియా రిలేషన్స్ చీఫ్ జోనాథన్ విథింగ్టన్ కూడా తెలిపారు. బిల్లు అమల్లోకి వస్తే 15 లక్షలకుపైగా భారతీయ ఉద్యోగులను ప్రభావితం చేయనుండగా, భారత్‌తోపాటు చైనా ఉద్యోగులకూ ఇది ప్రతికూలమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. హెచ్-1బీ వీసాలను అమెరికాలో స్వల్పకాలిక ఉద్యోగ అనుమతికిగాను జారీ చేస్తున్నారు. ఈ వీసాలను అత్యధికంగా పొం దుతున్న దేశాల్లో భారత్ కూడా ఉండగా, దేశీయ ఐటీ కంపెనీల ఔట్‌సోర్సింగ్ ప్రాజెక్టులకు ఇదే ఆధారం. దేశీయ ఐటీ రంగ ఆదాయంలో అధిక వాటా విదేశాల నుంచే వస్తుండగా, అందులో అమెరికా నుంచే ఎక్కువగా లభిస్తున్న విషయం తెలిసిందే. ఈ వీసాపై అమెరికాలో మూడేళ్లు పనిచేయవచ్చు. అవసరాలనుబట్టి మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. అంతకుమించి ఈ వీసా చెల్లుబాటు కాదు. అయితే తాము అధికారంలోకి వస్తే అమెరికన్ల నిరుద్యోగాన్ని దూరం చేస్తామంటూ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ట్రంప్ ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకునే దిశగా ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే గతేడాది ఏప్రిల్‌లో బై అమెరికన్-హైర్ అమెరికన్ నినాదం ఇచ్చారు. తరువాత హెచ్-1బీ వీసా నిబంధనల కఠినతరంపై దృష్టిపెట్టారు. ఈ వీసాలు పొందాలంటే నిపుణులై ఉండాలని, తాము నిర్ణయించిన వేతనాలివ్వాలని మెలిక పెట్టడంతో, వీటి భారం మోయలేనంతగా తయారైంది. ఫలితంగా ఇప్పటికే భారతీయ ఐటీ సంస్థలు అమెరికా ప్రాజెక్టుల కోసం ఇక్కడి నుంచి ఉద్యోగులను పంపించడం తగ్గించి, అమెరికన్లనే నియమించుకుంటున్నాయి. అమెరికా ప్రభుత్వం ఈ విజయాన్ని ఆసరాగా తీసుకునే ఇప్పుడు వీసా పొడిగింపునూ రద్దు చేయాలని చూస్తోంది. కాగా, స్టడీ, ఇతరత్రా వీసాలపై వెళ్లినవారూ సంపాదనే ధ్యేయంగా ఉద్యోగాలు చేసుకుంటూ ఉండటం కూడా అమెరికన్ల నిరుద్యోగానికి కారణమవుతున్నదని భావిస్తున్న ట్రంప్ మొత్తం అమెరికా వీసా విధానాన్నే సమూలంగా మార్చేందుకు నడుంబిగించారు. దాన్ని హెచ్-1బీ వీసాలతోనే మొదలుపెట్టారు. గడువు ముగిసినా అమెరికాలోనే ఉండిపోవడం కూడా కఠిన నిర్ణయాలకు దారితీస్తోంది. కాగా, వీసా నిబంధనల మార్పులు భారత్‌తోపాటు అమెరికాకూ హానికరమేనని దేశీయ ఐటీ రంగ సంస్థల సంఘం నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. హెచ్-1బీ వీసా పొడిగింపును నిరోధించేలా కొత్త నిబంధనలను తీసుకొస్తే అగ్రరాజ్యానికీ ఇబ్బందేనని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ద్వైపాక్షిక వాణిజ్యానికి ట్రంప్ సర్కారు తూట్లు పొడుస్తోందని, ఈ తరహా రక్షణాత్మక ధోరణులు మంచివి కావని హితవు పలికారు. నిజానికి గత రెండేళ్లలో భారతీ ఐటీ సంస్థల హెచ్-1బీ వీసాల వినియోగం 50 శాతం పడిపోయిందన్న ఆయన ఇప్పుడు 10 వేల దిగువనే ఉన్నదన్నారు. హెచ్-1బీ వర్కింగ్ వీసా నిబంధనలు కఠినతరమైతే ఆందోళన అక్కర్లేదని, అక్కడి నుంచి వచ్చే వేలాది మంది నిపుణులతో భారత్ మరింతగా వెలిగిపోతుందని మహీంద్రా గ్రూప్ సంస్థల అధిపతి ఆనంద్ మహీంద్రా అన్నారు. ‘‘అదే జరిగితే స్వాగతం. స్వదేశానికి రండి. మీ రాక భారత్ వృద్ధికి దోహదపడుతుంది’’ అని అన్నారు. అయితే, భారతీయ ఐటీ కంపెనీలపై భారం పడుతుందని గ్రేహౌండ్ రిసెర్చ్ ప్రధాన విశ్లేషకుడు, వ్యవస్థాపక సీఈవో సంచిత్ వర్ గోగియా ఆందోళన వ్యక్తం చేశారు.

Tags: American Visa Factor Again

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *