Anita's falling in the sack

నానా పాట్లు పడుతున్న అనిత

Date:16/11/2018
విశాఖపట్టణం ముచ్చట్లు:
విశాఖ జిల్లాలో తెలుగుదేశం రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ఓ వెలుగు వెలిగిన ఆ మహిళా ఎమ్మెల్యేకు టికెట్ బెంగ పట్టుకుంది. మొన్నటి వరకూ అధినాయకత్వం తమను ఏకంగా మంత్రిని చేస్తుందని ధీమాగా ఉన్న ఆమెకు అసలు వాస్తవం తెలిసేసరికి సీటు కూడా గోవిందా అయిపోయేలా ఉంది. దాంతో కొత్త వ్యూహాన్ని అమలు చేస్తూ మరో మారు హై కమాండ్ మెప్పు పొందేందుకు చురుకుగా పావులు కదుపుతోంది.అధినేత చంద్రబాబుని ఎలా మచ్చిక చేసుకోవాలో పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు బాగా తెలిసినట్లుంది. ఈ మధ్య వరకు సైలెంట్ గా ఉన్న ఆమె మళ్ళీ తనదైన మార్క్ హాట్ కామెంట్స్ కి తెర తీశారు. అదీ అమరావతి వేదికగా చేసుకుని వీలైనన్ని మీడియా మీటింగులు పెడుతూ వైసీపీపైనా, వైఎస్ కుటుంబం పైనా ఇపుడు ఆమె బాణాలు సంధిస్తున్నారు. వైఎస్ జగన్ తల్లి విజయమ్మ ప్రెస్ మీట్ కి కౌంటర్ ఇస్తూ అనిత మాటల బాంబులతో ఫ్యాన్ పార్టీపై దాడి చేశారు. దీనికి పార్టీ హై కమాండ్ నుంచి మంచి మార్కులే పడ్డాయని అంటున్నారు.వైసీపీ ఎమ్మెల్యే రోజాను టార్గెట్ చేసుకుని అనిత ఎక్కుపెట్టిన బాణాలు గురి తప్పలేదు.
దానికి ప్రతిగా ఓ దశలో అనితను ఎస్సీ కోటాలో మంత్రిని చేయాలని కూడా హై కమాండ్ ఆలోచించిందని ప్రచారం జరిగింది. ఆ తరువాత ఆమెను టీటీడీ బోర్డ్ మెంబర్ ని చేశారు. అయితే ఆమె క్రిస్టియన్ అని స్వయంగా చెప్పుకోవడంతో ఆ పదవి పోయింది. ఆ వివాదం తరువాత అనితకి టీడీపీ అధినాయకత్వంతో గ్యాప్ ఏర్పడింది. ఈ మధ్యలో ఆమెకు టికెట్ కూడా రాకుండా చేసేందుకు పార్టీలోని ప్రత్యర్ధులు ఎత్తులు వేయడంతో అనిత ఇక లాభం లేదనుకుని పాత అస్త్రాలనే మళ్ళీ ప్రయోగిస్తున్నారు. విశాఖ జిల్లాలో అనిత ఎక్కువగా అర్బన్ జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావుతో సాన్నిహిత్యం నెరిపేవారు. ఆయన మద్దతు ఉంటే చాలనుకునేవారు. మారిన పరిస్థితుల్లో ఆమె రూరల్ జిల్లా మంత్రి అయ్యన్నపాత్రుడితోనూ సఖ్యతగా ఉంటున్నారు. ఇద్దరు మంత్రులు తన గురించి నాలుగు మంచి మాటలు చంద్రబాబుకు చెబుతారని, ఆ విధంగా టికెట్ తనకు దక్కుతుందని అనితా భావిస్తున్నారట. మరి చంద్రబాబు మదిలో ఏముందో తెలియదు కానీ అనితకు సీటు దక్కదన్న ప్రచారం మాత్రం జోరుగానే సాగుతోంది. ఈ కొత్త ఎత్తుగడలతో బాబు మనసు గెలుచుకుంటే అనిత మరో మారు ఎమ్మెల్యే అభ్యర్ధిగా రంగంలోకి దిగినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో….
Tags:Anita’s falling in the sack

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *