ఆనం…టీడీపీ ఫోటోలను మార్చేశారు….

Date:18/06/2018
నెల్లూరు  ముచ్చట్లు:
ఆనం వివేకానందరెడ్డి హఠాన్మరణంతో ‘సైకిల్‌’ దిగడం కాస్త ఆలస్యమయ్యిందిగానీ, లేదంటే మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రస్తుతం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతగా మెడలో ఆ పార్టీ కండువా వేసుకుని, జగన్‌ తరఫున వకాల్తా పుచ్చుకుని వుండేవారే. తెలుగుదేశం పార్టీకి గుడ్‌ బై చెప్పే ఉద్దేశ్యంతోనే, ఇంట్లో ఫొటోల్ని సైతం మార్చేశారు కొన్నాళ్ళ క్రితం మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. సోదరుడు వివేకానందరెడ్డి మరణంతో, రామనారాయణరెడ్డి టీడీపీని వీడే ‘కార్యక్రమాన్ని’ కాస్త పోస్ట్‌పోన్‌ చేసుకోవాల్సి వచ్చింది. ఇంకోసారి ఆనం పార్టీ మార్పు అంశం రాజకీయంగా చర్చనీయాంశమయ్యింది. ఈ నేపథ్యంలో ఆనం రామనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పార్టీ మారే విషయమై చూచాయిగా క్లారిటీ ఇచ్చేశారు. ‘పార్టీ మారడానికి సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నాం..’ అని చెప్పారాయన. అలాగని, ‘పార్టీ మారతానని ఇప్పుడే చెప్పడంలేదు..’ అంటూ ముక్తాయింపు కూడా ఇచ్చేశారు రామనారాయణరెడ్డి. ఆనం వివేకానందరెడ్డి తనయులు మాత్రం టీడీపీ మారే ఉద్దేశ్యంలో లేరన్న ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్నీ ఆనం రామనారాయణరెడ్డి కొట్టి పారేశారు. ‘కుటుంబమంతా ఒక్క చోట కూర్చుని, నిర్ణయం తీసుకుంటాం.. ఈ విషయంలో ఇంకో మాటకు తావు లేదు’ అని సెలవిచ్చారండోయ్‌.నెల్లూరులో ఆనం బ్రదర్స్‌ రాజకీయం గురించి కొత్తగా చెప్పుకునేదేముంది.? వివేకా మాస్‌ లీడర్‌ అయితే, రామనారాయణరెడ్డి క్లాస్‌ లీడర్‌గా గుర్తింపు పొందారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీలో పనిచేసిన ఆనం బ్రదర్స్‌, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. కాంగ్రెస్‌లో వుండి, చంద్రబాబుని విమర్శించడం.. టీడీపీలోకి వచ్చాక వైఎస్‌ జగన్‌పై నిప్పులు చెరగడం ద్వారా ‘ఆనం’ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ అవడం తెల్సిన విషయాలే. అయితే, రాజకీయ విమర్శల విషయంలో వివేకానందరెడ్డి ఒకింత అత్సుత్సాహం చూపేవారు. ఆనం రామనారాయణరెడ్డి మాత్రం ఆచి తూచి వ్యవహరించేవారు. కానీ, ఇప్పుడు సోదరుడు వివేకా మరణంతో ఆనం రామనారాయణరెడ్డి రాజకీయంగా ఒంటరి అయిపోయారు.ఇదిలా వుంటే, ఆనం రామనారాయణరెడ్డిని బుజ్జగించేందుకు మంత్రులు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు సైతం, ఈ బుజ్జగింపుల ఎపిసోడ్‌లో తనవంతు పాత్ర పోషిస్తున్నా, రామనారాయణరెడ్డి మాత్రం వైఎస్సార్సీపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే ఆయన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సమక్షంలో, ఆ పార్టీలో చేరబోతున్నారట.
Tags:Ano … Tdipi photos changed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *