తమిళనాడులో మరో పోలిటికల్ హీరో

Date:14/02/2018
చెన్నై  ముచ్చట్లు:
తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం సినిమా హీరోల హవా కొనసాగుతోంది. దీంతో ప్రస్తుతం అక్కడి రాజకీయాలు.. దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. జయలలిత అకాల మరణంతో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార పార్టీలో కొనసాగుతున్న అనిశ్చితి కూడా రాజకీయ ప్రతిష్టంభనకు కారణమైంది. ఇదిలా ఉండగా… తమిళ స్టార్ హీరోలు రజనీకాంత్ , కమల్‌ హాసన్ రాజకీయ పార్టీ పెడుతున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అవసరమైన పక్షంలో కలిసి పనిచేస్తామన్న… హింట్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో.. మరో తమిళ నటుడు విజయ్‌ కూడా వీరి మార్గంలోనే పయనించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.విజయ్ రాజకీయరంగ ప్రవేశానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు.. ‘విజయ్‌ ప్రజా సంఘం’ నిర్వాహకులు ఒక తమిళ పత్రికకు తెలిపారు. చెన్నైలో విజయ్‌ వీరితో సమావేశమయ్యారు. అందులో పాల్గొన్న నిర్వాహకులు కొందరు మాట్లాడుతూ… రజనీకాంత్ సభ్యత్వ నమోదుకు తన వెబ్‌సైట్‌ను జనవరి 2న ప్రారంభించగా… విజయ్‌ గతేడాది సెప్టెంబర్‌లోనే సభ్యత్వ నమోదుకు మొబైల్‌ అప్లికేషన్‌ను ప్రారంభించారని గుర్తు చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి బూత్‌ కమిటీ ఏర్పాట్లు చేయమని ‘అఖిల భారత విజయ్‌ ప్రజా సంఘం’ అధ్యక్షుడు బుస్సీ ఆనంద్‌ను విజయ్‌ ఆదేశించినట్లు తెలిసింది. బూత్‌ కమిటీల ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఒక బూత్‌ కమిటీలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, ఉప కార్యదర్శి, కోశాధికారి ఉంటారని… దీని ప్రకారమే బూత్‌ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
Tags: Another political hero in Tamil Nadu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *