పచ్చదనం దిశగా ఏపీ అడుగులు 

Date:14/02/2018
విజయవాడ ముచ్చట్లు:
 కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనం పెంపునకు తీసుకుంటున్న చర్యలు ఫలితాన్ని ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం వెలువరించే ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్టు రిపోర్టు 2017 సంవత్సరం నివేదికలో రాష్ట్రంలో 2.14 లక్షల హెక్టార్లలో పచ్చదనం అదనంగా పెరిగినట్లు వెల్లడించింది. ఏపీలో ఫారెస్టు కవర్ 1.31 శాతం మేర పెరిగింది. ఈ పెరుగుదల 2.14 లక్షల హెక్టార్ల మేర ఉంటుంది. 2015లో 41 లక్షల హెక్టార్లలో గ్రీన్ కవర్ ఉండగా, గత ఏడాది డిసెంబర్ నాటికి 43.14 లక్షల హెక్టార్లకు పెరిగింది. దీంతో గ్రీన్ కవర్ పెరిగిన ఐదు రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంది. ఏపీ తరువాత కర్నాటక, కేరళ ఉన్నాయి. మడ అడవుల పెంపు 3700 హెక్టార్ల మేర పెరిగి ప్రస్తుతం 40,400 హెక్టార్లకు విస్తరించింది. ఇది దేశంలోనే విస్తీర్ణంలో రెండోదిగా నమోదైంది. గత రెండు సంవత్సరాల్లో దాదాపు 50 కోట్ల మొక్కలను నాటడం రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియచేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెంచాలంటూ అధికారులకు ఆదేశాలు ఇస్తూ, ప్రత్యేక దృష్టి సారించారు. గ్రీన్ కవర్ పెరగడం వల్ల నాణ్యమైన గాలి కూడా అందుబాటులోకి వస్తుందని సీఎం భావన. గాలి, నీరు, పచ్చదనం పెంపు వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తూ, జలసిరికి హారతి, వనం మనం, సూర్య ఆరాధన వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. టేకు, ఎర్ర చందనం వంటి వాటిని 26,853 హెక్టార్లలో పెంచుతున్నారు. 1415 కిలోమీటర్ల మేర ఎవెన్యూ ప్లాంటేషన్ పెంపు, కొండ ప్రాంతాల్లో ట్రెంచ్‌లు తవ్వి, 2936 టన్నుల విత్తనాలు చల్లడం, హరితాంధ్రప్రదేశ్ వంటి చర్యలు గ్రీన్ కవర్ పెరిగేందుకు దోహదపడ్డాయి. 2,91,933 కాంటూరు ట్రెంచ్‌లు, మినీ పెర్కొలేషన్ ట్యాంక్‌లు, 249 డ్యాంలు, 806 రాక్‌ఫిల్ డ్యామ్‌ల నిర్మాణం కూడా భూగర్భ జలాల పెరిగేందుకు, తద్వారా పచ్చదనం పెంపొందేందుకు సహయపడింది. సీఎం చొరవతో చేపట్టిన అనేక కార్యక్రమాల కారణంగా గ్రీన్ కవర్ పెరిగింది. భారీ ఎత్తున మొక్కలు నాటడమే గ్రీన్ కవర్ పెరగడానికి కారణంగా గుర్తించింది.
Tags: AP steps towards greenness

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *