ఆర్మూర్ నుంచి యదేఛ్చగా స్మగ్లింగ్

నిజామాబాద్ ముచ్చట్లు:
 
సినిమాను తలపించేలా.. ఢీ అంటే ఢీ అనేలా గంజాయి, క్లోరోఫామ్, డైజోఫామ్ స్మగ్లింగ్ వ్యవహారం నడుస్తోంది. దమ్ముంటే పట్టుకోండి. చేతనైతే దాడులు చేయండి. మేము మాత్రం తగ్గేదే లేదంటూ ఎక్సైజ్ పోలీసులకు మత్తు పదార్థాల స్మగ్లర్లు సవాల్ విసురుతున్నారు. ఛాలెంజింగ్‌గా తీసుకున్న అధికారులు వచ్చినప్పుడు మాత్రమే సవాల్‌కు ప్రతిసవాల్ విసురుతున్నారు. కానీ అధికారి మారితే పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది. స్మగ్లర్లకు ఇంటి దొంగల లోపాయి సహకారం ఎక్సైజ్ శాఖకు శాపంగా మారుతోంది.జీతాల కంటే  మామూళ్లు నాలుగింతలు ఎక్కువ ఉండటంతో ఇంటి దొంగలు పెరిగిపోతున్నారు. కొందరు కోవర్టులుగా మారి, ముందస్తుగా దాడుల సమాచారం చేరవేయడం పరిపాటిగా మారింది. హద్దులు దాటి వస్తున్న మత్తు పదార్థాలను పట్టుకోవడంలో ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎక్సైజ్, స్థానిక పోలీసులకు సవాల్ గా నిలుస్తుంది. హానికర పదార్థాలు సరిహద్దులు దాటి వస్తున్నా, చెక్ పోస్టుల దగ్గర మాత్రం పట్టుబడడం లేదు. ఇటీవల చెక్ పోస్టుల ట్రాక్ రికార్డు అందుకు నిదర్శనం.ఉమ్మడి జిల్లాలో గంజాయి వాసన గుప్పుమంటుంది. కొన్ని ప్రాంతాల్లో విచ్చలవిడిగా దీని సాగు కొనసాగుతోంది. అమ్మకాలు సైతం జోరుగా జరుగుతున్నాయి. అక్రమ సంపాదనకు అలవాటుపడిన కొందరు యథేచ్ఛగా ఈ దందా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గాంధారి, వర్ని, ఎల్లారెడ్డి లాంటి అటవీ ప్రాంతంలో ఎక్కువగా గంజాయి సాగు కొనసాగుతోంది. అటవీ మధ్యలో లేదంటే పంటల మధ్య గంజాయి పండించడం రివాజుగా మారింది.అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లోని ఏజెన్సీ ప్రాంతాల్లో నుంచి నిజామాబాద్ కు గంజాయి అక్రమ రవాణా జరుగుతున్న విషయం బహిరంగ రహస్యమే. ఏవోబీకి సంబంధం కలిగిన గంజాయి నాగపూర్ మీదుగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు తరలి వస్తుంది. ఇక్కడి నుంచి పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలకు యథేచ్ఛగా సరఫరా చేస్తున్నారు. ఈ విధంగా ఏ ఇబ్బంది లేకుండా మత్తు పదార్థాలు సరిహద్దులు దాటడం విమర్శలకు దారి తీస్తోంది.
 
 
 
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు దందా జోరుగా జరుగుతుంది. ప్రకృతి ప్రసాదించిన ఈత, తాటి వనం నుంచి వచ్చే కల్లు కంటే కృత్రిమ కల్లు ఉమ్మడి జిల్లాలో జోరుగా తయారవుతుంది. దానికి అవసరమైన క్లోరోఫామ్, డైజోఫామ్ అల్ప జోలుమ్ లాంటి మత్తు పదార్థాలు కృత్రిమ కల్లు తయారీలో వినియోగిస్తారు. నిషేధిత మత్తు పదార్థాలు కల్తీ కల్లు తయారీ లో వినియోగించడం సర్వసాధారణం. ఉమ్మడి జిల్లాలో సుమారు వెయ్యికి పైగా కల్లు బట్టీల్లో కల్తీ కల్లు విక్రయిస్తున్నారు.కల్లు సొసైటీలు ముసుగులో కృత్రిమ కల్లు అమ్మకాలు జరుగుతున్నాయి. కల్తీ కల్లు తయారీకి  వినియోగించే ముడి పదార్థాలు యథేచ్ఛగా హద్దులను దాటి చెక్ పోస్టుల మీదుగా తరలి రావడం విశేషం. ఇంత జరుగుతున్నా స్థానిక ఆప్కారి అధికారులు పట్టించుకోరు. చెక్ పోస్టుల్లో చూసీ చూడనట్టు తనిఖీలు చేస్తారు. తూతూ మంత్రంగా తనిఖీలతో సరిహద్దులు దాటేందుకు పరోక్షంగా అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.నిషేధిత పదార్థాలైన గంజాయి, డ్రగ్స్, డైజోఫాం, క్లోరోఫాం, షాక్రిన్ వంటివి రాష్ట్రంలోకి సరాఫరా కాకుండా మద్నూర్ మండలం లో సలాబత్ పూర్, బోధన్ మండలం లో సాలుర వద్ద అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వీటి గుండా గంజాయి లాంటి మత్తు పదార్థాలు పెద్దయెత్తున సరఫరా అవుతున్నాయి. ఇలా రావడానికి కారణం ఈ అవినీతి చెక్ పోస్టులే. అవినీతి మామూళ్ల మత్తులో తనిఖీలు లేకుండా వాహనాలను ఎక్సైజ్ సిబ్బంది వదిలేస్తున్నారు. బండికి రేటు కట్టి మత్తు పదార్థాలను సరిహద్దుల్లోకి ప్రవేశం కల్పిస్తున్నారు.అదే సమయంలో గంజాయి స్మగ్లర్ల సరుకును పక్క రాష్ట్రాలకు తరలించడంలో సహాయం చేస్తున్నారు. ఏళ్లుగా ఇక్కడే తిష్ట వేసిన ఎక్సైజ్ సిబ్బంది అవినీతి స్మగ్లర్లకు కలిసి వస్తుంది. కొందరు ఉన్నత అధికారుల మిలాఖత్ వీరికి కలిసి వస్తుంది. ఇంటి దొంగలను విధుల నుంచి తప్పించడం లేదంటే పట్టుకోవడం చేస్తే తప్ప పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీంతోపాటు తరచూ డ్యూటీ సిబ్బందిని మార్చాలనే వాదన ఉంది. గమ్మత్తైన విషయం ఏంటంటే జిల్లా లోపల తరచూ పట్టుబడుతున్న గంజాయి, అంత రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల్లో పట్టుబడకపోవడం అక్కడి అవినీతికి, స్మగ్లర్లతో సిబ్బంది కుమ్మక్కుకు ప్రత్యక్ష నిదర్శనం.
 
 
 
ఇవే ఉదాహరణలు :
– ఈ నెల 15న డిచ్‌పల్లిలో  సీఐ ప్రతాప్ అధ్వర్యంలో నలుగురు గంజాయి స్మగ్లర్లను పట్టుకొని, రిమాండ్ చేశారు.
– గతవారం బీర్కూర్ మండల కేంద్రంలోని ఓ కిరాణా దుకాణం పై ఎక్సైజ్ అధికారులు దాడి చేసి, గంజాయి ప్యాకెట్లు  స్వాధీనం చేసుకున్నారు.
– తాజాగా ఎక్సైజ్ అధికారులు నిజామాబాద్ నగరంలో దాడులు జరిపి పూలాంగ్ చౌరస్తాలో, ఖానాపూర్ లో గంజాయితో పాటు కొన్ని గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్న సంఘటన కలకలం రేపింది.
– బోధన్ మండలంలోని పెగడా పల్లి లో  ఎక్సైజ్ అధికారులు  దాడులు జరిపి, గంజాయి స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
– పిట్లం మండలం కంబాపూర్ లో రెండు నెలలు కిందట దాడుల్లో అధికారులు గంజాయి పట్టుకున్నారు.
– జుక్కల్ మండలం లో గంజాయి పంట అంతర్ పంటగా సాగు చేయడం, అధికారులు నిప్పు పెట్టడం తరుచూ జరిగేదే.
– వర్ని మండలంలోని బడా పహాడ్ చౌరస్తాలో ఏడాది కిందట 3 క్వింటాళ్ల గంజాయి పట్టుబడటం సంచలనం రేపింది.
 
 
 
– నిజామాబాద్ సిటీ, గాంధారి లో తరచూ గంజాయి పట్టుబడటం విదితమే.– ఉమ్మడి జిల్లాలో కొందరు గంజాయి స్మగ్లర్లపై పీడీ చట్టం ప్రయోగించడం స్మగ్లింగ్ ఏ స్థాయిలో ఉందో తెలుపుతుంది.
చెక్ పోస్ట్ డ్యూటీ కి భలే డిమాండ్..
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో రెండు అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులు ఉన్నాయి. అక్కడ విధుల నిర్వహణ కు ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది ఆసక్తి చూపుతారు. ఎందుకంటే అక్కడ విధినిర్వహణ అంటే కాసులు కురిపించే డమే. పోస్టింగ్ కొరకు లంచాలు ఇవ్వడం సర్వ సాధారణం. ఇటీవల ఎక్సైజ్ శాఖలో ఒక ఉద్యోగి, ఒక కానిస్టేబుల్‌కు చెక్ పోస్ట్‌లో పోస్టింగ్ కొసం లంచం ఇవ్వడం కలకలం రేపింది. పోస్టింగ్ ఇప్పించక పోవడంతో సదరు కానిస్టేబుల్ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.దీని సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడం, ఈ వ్యవహారాన్ని రచ్చకీడ్చింది. ఆ ఫిర్యాదు వ్యవహారం చెక్ పోస్టుల్లో వసూళ్ల పర్వం బహిరంగమని తేల్చి పారేసింది. కానీ ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంత జరిగిన అధికారులు స్పందించక పోవడం వెనుక ఏదో మతలబు ఉందనేది బహిర్గతమైంది.
 
Tags: Arbitrary smuggling from Armor

Natyam ad